Jul 01,2023 11:14

తిరువనంతపురం : బిజెపి ఎన్నికల ముందు ఉమ్మడి పౌర స్మృతిపై చర్చ లేవనెత్తడం దాని విచ్ఛిన్నకర రాజకీయ ఎజెండాను బయటపెడుతోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అన్నారు. ఆయన శుక్రవారం నాడిక్కడ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, ఒకే దేశం ఒకే జాతి ఒకే సంస్కృతి అన్న బిజెపి ఎజెండాలో భాగంగా తీసుకొస్తున్న ఉమ్మడి సివిల్‌ కోడ్‌ దేశంలో బహుళత్వాన్ని నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక దేశం ఒకే సంస్కృతి అంటే మెజారిటీ మతతత్వ వాదాన్ని అమలు చేసే ప్రణాళికేనని అన్నారు. ఏక రూప పౌర నియమావళిని విధించే బదులు వ్యక్తిగత చట్టాల్లో వివక్షాపూరిత పద్ధతులను సంస్కరించేందుకు ప్రయత్నించడం మంచిదన్నారు. అలాంటి యత్నాలకు ఆ విశ్వాసాలకు సంబంధించిన సంస్థలు, సంఘాల నుంచి మద్దతు తప్పనిసరి అని ఆయన అన్నారు. అన్ని పక్షాలను కలుపుకుని చర్చల ద్వారా దీనిని పరిష్కరించుకోవాలి. దేశంలో చాలా సంస్కరణోద్యమాలు వారి లోంచి పుట్టుకొచ్చినవేనని విజయన్‌ తెలిపారు.భారత దేశంలో భిన్నాభిప్రాయాలను అణచిపెట్టడం ఏకరూపత అనిపించుకోదు. భిన్నాభిప్రాయాలను స్వీకరించి వైవిధ్యంతో కూడినదే భారతీయ తత్వమని ఆయన అన్నారు. నిర్దిష్ట ఎజెండాతో వ్యక్తిగత చట్టాలను ఏకీకృతం చేయడం తగదన్నారు. ఇది ప్రభుత్వం ఒక్కటే పరిష్కరించే సమస్య కాదని ఆయన అన్నారు. ఉమ్మడి సివిల్‌ కోడ్‌ను తీసుకురావడం ప్రస్తుత పరిస్థితుల్లో అంత మంచిది కాదని మునుపటి లా కమిషన్‌ 2018లో స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని ముఖ్యమంత్రి విజయన్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు.