హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో అత్యవరసర సమయాల్లో మాత్రమే ప్రజలు బయటకు రావాలని డీజీపీ అంజనీ కుమార్ సూచించారు. డీజీపీ కార్యాలయం నుంచి అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్, గ్రే హౌండ్స్ ఇతర అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యక్షగా పర్యవేక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల ఎదురవుతున్న పరిస్థితులను చీఫ్ సెక్రటరీ ద్వారా ప్రతి జిల్లాపై పర్యవేక్షిస్తున్నామని అన్నారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్లలో పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. ముసారాంబాగ్ బ్రిడ్జ్‌పై వరద నీరు కూడా కంట్రోల్‌లో ఉందన్నారు. వరదలపై డీజీపీ కార్యాలయంలో 24 గంటలపాటు రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిని సమీక్షిస్తున్నామని వెల్లడించారు. పిల్లలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, సెల్ఫీలు తీసుకోవడానికి వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. సెల్ఫీలు తీసుకోవడానికి జలపాతాలు, మత్తడి పోస్తున్న చెరువులు, పారుతున్న కాలువల వద్దకు వెళ్లకూడదని చెప్పారు. విద్యుత్ స్తంభాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాల్లో కురుస్తున్నభారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి తగిన సహాయ పునరావాస కార్యక్రమాలపై సలహాలు, సూచనలు, సహాయం అందించడానికి డీజీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఫ్లడ్ మానిటరింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అధనపు డీజీలు శివధర్ రెడ్డి, సంజరు కుమార్ జైన్, విజరు కుమార్‌తో కలిసి డీజీపీ అంజనీ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. డీజీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో నైనా రహదారులు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం ఏర్పడితే సెటిలైట్ ద్వారా పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులకు వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు తగు ఆదేశాలు జారీ చేశారు.










