రాజధానిని రియల్ ఎస్టేట్‌గా మార్చొద్దు : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు
- మోడీది ముదనష్టపు పాలన
- దేశ రక్షణ భేరి బహిరంగ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు
ప్రజాశక్తి- ఒంగోలు సబర్బన్ : అమరావతి రాజధాని కోసం ఆందోళన చేస్తోన్న రైతులపై అభాండాలు మాని విశాఖ ఉక్కు కోసం జరిగే పోరాటానికి మద్దతుగా ప్రభుత్వ పెద్దలు బయటకు వచ్చి మాట్లాడాలని, రాజధానిని రియల్ ఎస్టేట్‌గా మార్చొద్దని, రాజధానుల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలను చేయాలని చూస్తే ప్రజలు ఊరుకోబోరని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హెచ్చరించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా దేశరక్షణ భేరి బహిరంగ సభ మంగళవారం ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ సెంటర్‌లో జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో వి.శ్రీనివాసరావు ముఖ్యవక్తగా మాట్లాడారు. ఎనిమిదేళ్ల పాలనలో నోట్ల రద్దు, ఆర్టికల్ 370 రద్దు, ధరల పెంపు, నిరుద్యోగం పెంపు, రైతువ్యతిరేక విధానాల అమలు తప్ప, బిజెపి ప్రభుత్వం దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు. మోడీది ముదనష్టపు పాలన అని, దానికి ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. జిఎస్‌టి వల్ల అన్ని వర్గాల ప్రజలూ చితికిపోతున్నారని తెలిపారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఇచ్చిన మోడీ రెండు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. నిరుద్యోగంతో దేశం కొట్టుమిట్టాడుతోందన్నారు. రైతుల పోరాటంతో మూడు వ్యవసాయ నల్లచట్టాలను వెనక్కి తీసుకున్నా ప్రభుత్వం ఈ చట్టం విధానాలను మాత్రం ముందుకు తీసుకొనిపోయేందుకు ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తానన్న ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేశారన్నారు. ఐదేళ్లుకాదు, పదేళ్లు ప్రత్యేక హోదా ఉండాలని చెప్పిన బిజెపికి ప్రస్తుతం నోరు పెగలడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి అన్ని రకాలుగా అన్యాయం జరుగుతున్నా అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి ప్రశ్నించడం లేదన్నారు. అడిగితే కేసులు పెడతారని ఒకరు, కేసులు బయటకు తీస్తారని మరొకరు బయపడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని నాశనం చేస్తోన్న మోడీకి సలాం చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతులకు మద్దతు ధర ఇవ్వడంలోనూ, కార్మిక చట్టాలను అమలు చేయడంలోనూ కమ్యూనిస్టుల పాలనలో ఉన్న కేరళ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. సభలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పూనాటి ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు జాలా అంజయ్య, వై.సిద్ధయ్య, ఒంగోలు నగర కార్యదర్శి జి.రమేష్ పాల్గొన్నారు.










