Jul 28,2023 10:56

టిటిడి అటవీ కార్మికుల దీక్షలపై సర్కారుకు సిహెచ్‌ నర్శింగరావు ప్రశ్న
తిరుపతిలో భారీ ప్రదర్శన,సభ
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
ప్రజాశక్తి - తిరుపతి సిటి :   
తిరుమల గిరుల పచ్చదనాన్ని నిరంతరం కాపాడుతున్న అటవీ కార్మికులకు టిటిడి యాజమాన్యం ద్రోహం చేస్తోందని అఖిలపక్షం మండిపడింది. కార్మికులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు గురువారం నాటికి వెయ్యి రోజులకు చేరుకున్నాయి. వారికి సంఘీభావంగా ప్రజాసంఘాల పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు జరిగాయి. తిరుపతిలో భారీ ప్రదర్శన, సభ జరిగింది. టిటిడి అటవీ కార్మికుల యూనియన్‌ గౌరవాధ్యక్షులు కందారపు మురళి ఈసభకు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్శింగరావు మాట్లాడుతూ అటవీ కార్మికుల పట్ల టిటిడి యాజమాన్యం ప్రవర్తిస్తున్న తీరును తప్పుబట్టారు. 200 మంది కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి వెయ్యి రోజులుగా నిరాహారదీక్షలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి నామమాత్రంగా కూడా పట్టదా అని ఆయన ప్రశ్నించారు. ఈ పరిస్థితిటిటిడి లాంటి సంస్థలకు గౌరవనీయం కాదన్నారు. జూనియర్లను పర్మినెంట్‌చేసి, సీనియర్లను కార్పొరేషన్‌లో కలపడం చరిత్రలో ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. కందారపు మురళి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పర్మినెంట్‌ చేస్తామని సిఎం జగన్‌ హామీ ఇచ్చి, నాలుగున్నరేళ్లయినా హామీని అమలు చేయలేదన్నారు. క్రూరమృగాలు వెంటాడుతున్నా టిటిడి కార్మికులు తిరుమల పచ్చదనం కోసం పాటు పడుతూనే ఉన్నారని తెలిపారు. టిడిపి చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పులివర్తి నాని, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, రాష్ట్ర కార్యదర్ధి దంపూరి భాస్కర్‌ మాట్లాడుతూ అటవీ కార్మికులకు టైంస్కేలు ఇస్తామని తీర్మానించి నాలుగేళ్లయినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి మాట్లాడుతూ టిటిడి అటవీ కార్మికులకు మద్దతుగా ఆగస్టు నెలలో జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌తో తిరుపతిలో బహిరంగసభ నిర్వహిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్‌ నేత నవీన్‌కుమార్‌రెడ్డి, సిపిఐ జిల్లా నేత రాధాకృష్ణ మాట్లాడుతూ వెయ్యి రోజుల పాటు రిలేదీక్షలు చేయడం చారిత్రాత్మకమని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వి నాగరాజు, నగర కార్యదర్శి టి సుబ్రమణ్యం మాట్లాడుతూ 25 ఏళ్లుగా టిటిడి అటవీ కార్మికుల శ్రమను దోపిడీ చేసి ఇప్పుడు వీధుల పాలు చేయడం దారుణమని విమర్శించారు. రిపబ్లికన్‌ పార్టీ దక్షిణ భారత అధ్యక్షులు పూతలపట్టు అంజయ్య, ఐఎన్‌టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు లేబూరి రత్నకుమార్‌, టిటిడి అటవీ కార్మికుల యూనియన్‌ నేతలు ప్రసంగించారు. పోస్టల్‌ నాయకులు శ్రీధర్‌, ప్రముఖ న్యాయవాదులు దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు.