Mar 21,2023 14:04

ఒంగోలు (ప్రకాశం) : ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని, రేపటి అసెంబ్లీలోనైనా ముఖ్యాంశాలు చర్చించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. మంగళవారం ఉదయం ఒంగోలులోని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  నిర్వహించిన మీడియా సమావేశంలో వి.శ్రీనివాసరావు మాట్లాడారు. నిన్న అసెంబ్లీలో జరిగిన ఘటనలు అసెంబ్లీ ప్రతిష్టనే దిగజార్చాయని అన్నారు. అధికార పార్టీ బాధ్యతారహితంగా ప్రతిపక్షాలపై దాడి చేయడం, ఎమ్మెల్యే స్వామిపై భౌతిక దాడికి దిగడం సరైంది కాదన్నారు. అసెంబ్లీ సవ్యంగా జరగడానికి స్పీకర్‌, అధికార పక్షం బాధ్యత వహించాలని, అసెంబ్లీని సంయమనంతో జరిపించాల్సిన బాధ్యత అధికార పక్షానిదనిదేనన్నారు.  కానీ వాళ్లే దాడి చేస్తే ఇక అసెంబ్లీకి అర్థమేముంది ? అని ఆయన ప్రశ్నించారు. జిఒ నెం.1 రద్దు కోరుతూ... సోమవారం అన్ని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో ... దానికి అనుమతినివ్వకుండా అరెస్టులు చేసి, రాష్ట్రమంతా అందరికీ నోటీసులిచ్చారని, ఎక్కడికక్కడ తీవ్ర నిర్బంధాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి సమయంలో ప్రతిపక్షం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చర్చించాల్సిందిపోయి.. స్పీకర్‌ తన అధికారంతో దాన్ని తిరస్కరించారని చెప్పారు. ''అసెంబ్లీలో నిరసనలు వచ్చినప్పుడు మార్షల్స్‌ను పిలవాలని, కానీ దానికి భిన్నంగా వ్యవహరిరంచారని అన్నారు. అసలు అసెంబ్లీ స్పీకర్ కంట్రోల్‌ లో ఉందా ? లేక రాష్ట్ర ప్రభుత్వ ఆధిపత్యంలో నడుస్తుందా ? '' అని ఘాటుగా ప్రశ్నించారు. ''మిగతా ఎమ్మెల్యేలంతా వచ్చి నన్ను కాపాడండీ అని స్పీకర్‌ అడిగారా ?'' అని అన్నారు.  అసెంబ్లీలో మంద బలాన్ని ప్రయోగిస్తే ప్రజాస్వామ్యానికి అర్థమేముంది ? అని నిలదీశారు. ప్రమాదకరమైన జిఒ నెంబర్‌ 1 ముఖ్యమైన విషయమనీ, ఆ విషయం పక్కకుపోయి.. అసెంబ్లీలో దాడి ప్రధానాంశంగా ముందుకొచ్చిందని ఆక్షేపించారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్నో సమస్యలపై చలో అసెంబ్లీలు, ధర్నాలు చేశారని చెప్పారు. ముఖ్యంగా అంగన్వాడీలను వేలాదిమందిని కనీసం ఆడవారు అని కూడా చూడకుండా మగ పోలీసులే  బలవంతంగా రైళ్లలో ఎక్కించారని, కర్నూలులోనైతే అంగన్వాడీలు రైలులో ఎక్కకపోతే రైలే కదలబోదంటూ పోలీసులే హెచ్చరించారని తెలిపారు. రైల్వే శాఖను, స్టేషన్లను కూడా పోలీసులు కంట్రోల్‌లోకి తీసుకున్నారని విమర్శించారు. నిర్బంధాలను తట్టుకొని ఎన్నో ఇబ్బందుల మధ్య అంగన్వాడీలంతా విజయవాడకు చేరుకున్నారని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ధర్నాలు చేయడం అనేది ఆనవాయితీగా ఉందని, అదో హక్కు అని, ఆ పద్ధతి ఎప్పటినుండో వస్తుందని తెలిపారు. రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటి నుండి ఆ పద్ధతి కొనసాగుతున్దనని గుర్తు చేశారు. ప్రస్తుతం విజయవాడలోని ధర్నా చౌకనే మూసేశారని, చలో అసెంబ్లీ అని పిలుపునిస్తే... అసెంబ్లీకి పోయే దారులన్నీ మూసేస్తే అర్థముంటుంది... ధర్నా చౌకకు పోయే దారులను మూసేయడమేంటి ? అని ఆయన ప్రశ్నించారు. దారులన్నీ మూసేయడంతో అన్ని రోడ్లపై మహిళలు నిరసనలు వ్యక్తం చేశారని, వారిలో కొందరు సొమ్మసిల్లిపడిపోయారని, మరికొందరు గుండెపోటుకు గురై ప్రాణాపాయస్థితివరకు వెళ్లారని.. వారిలో ఎవరిదైనా ప్రాణం పోతే ఎవరు బాధ్యత వహిస్తారని వి.శ్రీనివాసరావు ప్రశ్నించారు. అంగన్వాడీలు సమరశీలంగా వీధుల్లోకి రావాల్సిన పరిస్థితిని తెచ్చింది వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డేనని అన్నారు. ఎన్నికల సమయంలో వాగ్దానాలిస్తూ ... తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నట్లు కాకుండా అంగన్వాడీలకు వేతనాలిస్తానని వైఎస్‌.జగన్‌ చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణలో రూ.13,500 జీతం ఇస్తున్నారు. ఎపిలో 11,000 వస్తుంది. ఆ రెండు వేల రూపాయలను ఇవ్వండని  మహిళలంతా మొత్తుకుంటూనే ఉన్నారని చెప్పారు. వైఎస్‌ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఆలోచిస్తాం అంటూనే కాలయాపన చేస్తున్నారని అన్నారు. మళ్లీ ఎన్నికలు కూడా వచ్చేస్తున్నాయి.. ఇంకెప్పుడు ఇస్తారని అడిగారు. వేరే గత్యంతరం లేక అంగన్వాడీలంతా విజయవాడకు వస్తే ... వారితో చర్చించి పరిష్కారించాల్సిందిపోయి.. నిర్బంధాలు చేస్తున్నారని... ఇది పోలీసుల రాజ్యమా ? ప్రజాస్వామ్యమా ? అని  ప్రశ్నించారు. సిఎం జగన్‌ ఏదైతే మాటిచ్చారో.. దానినే నెరవేర్చాలని అడుగుతున్నారని చెప్పారు. కాటికాపరులు, స్మశాన కార్మికులందరూ చిల్లర్లతో బతుకుతున్నారని, తమను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని నిన్న ర్యాలీ చేపట్టారని అన్నారు. రేపు జరగనున్న రెండు రోజుల అసెంబ్లీలోనైనా అంగన్వాడీల సమస్యలపై, జిఒ నెం.1 రద్దుపై, దళితులపై దాడులు, స్మశానాల కేటాయింపు, కాటికాపరుల సమస్యలు, ఉక్కు ఫ్యాక్టరీని పరిరక్షించే అంశాలపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను ఆపడానికి సిఎం జగన్‌, రాష్ట్ర సభ్యులంతా కలిసి పార్లమెంటులో నిలదీసి తాడోపేడో తేల్చుకొని రావాలని అధికార పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నామని వి.శ్రీనివాసరావు అన్నారు.