
మాంద్యం, కోవిడ్ సవాళ్లనెదుర్కొంటున్న రాష్ట్రాలను ఆదుకునే విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన నీతి ఆయోగ్ భేటీ ఎలాంటి హామీ ఇవ్వలేదు. కో-ఆపరేటివ్ ఫెడరలిజం వంటి ఆర్భాటపు మాటలు తప్ప ఫెడరలిజం స్ఫూర్తి కేంద్ర బిజెపిలో ఎంత మాత్రం కనిపించలేదు. పైపెచ్చు జిఎస్‌టి వసూళ్ల పెరుగుదల సరిపోవడం లేదు ఇంకా పెంచాలన్న నిర్దేశమే సమావేశ ప్రధానాంశమైంది. దేశ స్వావలంబన సాధన దిశగా ఏర్పడిన కేంద్ర ప్రణాళికా సంఘం స్థానంలో 'నీతి ఆయోగ్' రావడం కేవలం పేరు మార్పు మాత్రమే కాదు. స్వావలంబన, పేదరిక నిర్మూలన, ప్రాంతీయ అసమానతల తగ్గింపు వంటి లక్ష్యాల స్థానంలో విదేశీ, స్వదేశీ కార్పొరేట్ల సేవే ఏకైక లక్ష్యంగా నీతి ఆయోగ్ పని చేస్తోంది. నీతి ఆయోగ్ పాలక మండలిని మోడీ 'టీం ఇండియా'గా అభివర్ణిస్తారు. సదరు టీం సభ్యుల విశ్వాసాన్ని కేంద్రం, నీతి ఆయోగ్ క్రమంగా కోల్పోతున్నదనడానికి 7వ గవర్నింగ్ భేటీకి ముఖ్యమంత్రుల గైర్హాజరే సూచిక. తెలంగాణ సిఎం కెసిఆర్ సమావేశాన్ని బహిష్కరించగా, తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్ అవిశ్వాసంతో, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ అసహనంతో హాజరు కాలేదు. గైర్హాజరైన ఐదుగురు సిఎంలలో ఎన్‌డిఎ లోని బీహార్ సిఎం నితీష్ కుమార్ కూడా ఉన్నారు. కూటమిలోని ముఖ్యమంత్రి మీటింగ్‌కు డుమ్మా కొట్టడం అసంతృప్తికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు.
భేటీలో పాల్గొన్న బిజెపి యేతర ముఖ్యమంత్రుల్లో అత్యధికులు కేంద్ర సహాయం కోసం విన్నపాలు చేశారు. సమస్యలను వివరించారు. లోపాలను ఎత్తి చూపారు. బిజెపి పాలనలో సమాఖ్య స్ఫూర్తికి తగులుతున్న దెబ్బలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఒక్కరే నిలదీశారు. నిత్యావసరాలు, ముఖ్యంగా ఆహార వస్తువులపై జిఎస్‌టి రేట్లను సమీక్షించి ప్రజలపై భారం పడకుండా చూడాలన్నారు. మరో ఐదేళ్లపాటు రాష్ట్రాలకు జిఎస్‌టి పరిహారం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఉమ్మడి జాబితాలోని అంశాలపై ఏకపక్షంగా కేంద్రం చట్టాలు చేయొద్దని, అలాంటి చట్టాలను ఉపసంహరించుకోవాలన్నారు. మన రాష్ట్ర సిఎం జగన్, విభజనతో పూర్తి వ్యవసాయ రాష్ట్రమైనందున ఆ రంగం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టినట్లు వివరించారు. లక్ష్య సాధనకై వికేంద్రీకరణ చేపట్టామని చెప్పుకొచ్చారు. సాగు రంగానికి కేంద్రం సహాయ పడాలని అభ్యర్థించారు. ప్రణాళికా సంఘం, జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డిసి) వంటివి గతంలో రాష్ట్రాల గొంతు విప్పడానికి ఉన్న వేదికలు. అవి రద్దయ్యాక ఉన్న ఏకైక వేదిక నీతి ఆయోగ్ మండలి. దానిలోనూ ఎ.పి. సిఎం విభజన హామీలు, ప్రత్యేక హోదాపై మాటమాత్రమైనా ప్రస్తావించకపోవడం రాష్ట్ర ప్రయోజనాలకు నష్టదాయకం. అయినా అడగలేదంటే భయమా? లేక కార్పొరేట్ విధానాల మీద భక్తా? ఏది కారణం? ఏదైనప్పటికీ నష్టపోతున్నది మాత్రం రాష్ట్రమే.
దేశంలో ఎన్నడూ లేనంతగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొన్ని ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం జూన్ చివరికి 10 శాతానికి చేరిందని కేంద్ర గణాంకాల విభాగమే వెల్లడించింది. ధరలు పెరగడానికి డీజిల్, పెట్రోలు ఛార్జీలే కారణం. ధరల అదుపు నీతి ఆయోగ్ ఎజెండాలో లేనే లేదు. ధరల పెరుగుదలకు ఆజ్యం పోసేలా జిఎస్‌టి వసూళ్లు పెంచాలని ప్రధాని రాష్ట్రాలకు హుకుం జారీ చేయడం ప్రజలను ఆహారానికి దూరం చేయడానికే. దేశంలో నిరుద్యోగం రికార్డులు బద్దలు కొడుతున్న వేళ ఉద్యోగ, ఉపాధి కల్పనను నీతి ఆయోగ్ విస్మరించడం దుర్మార్గం. నయా-ఉదార వాద విధానాలకు ఉపకరించే ట్రేడ్, టూరిజం, టెక్నాలజీ... మూడు 'టి'లను రాష్ట్రాలు ప్రోత్సహించాలని చెప్పారు ప్రధాని. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు పాతికేళ్లకు ఫలితాలిస్తాయంటున్నారు. గతంలో రైతుల ఆదాయాలను ఐదేళ్లలో రెట్టింపు చేస్తామన్నారు. గడువు ముగుస్తున్నా ఆ లక్ష్యం సుదూర స్వప్నంగా మిగలడంపై ప్రధాని ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? విద్య కాషాయీకరణ-కార్పొరేటీకరణకు ఉద్దేశించిన నూతన విద్యా విధానంపై రోడ్ మ్యాప్ వేసుకోవాలని రాష్ట్రాలకు ప్రధాని ఉద్బోధ హిందూత్వ-కార్పొరేట్ విధాన లక్ష్యంలో భాగం. రాష్ట్రాల అధికారాలను కబ్జా చేస్తూ, ఆర్థిక వనరుల కేంద్రీకరణకు పాల్పడుతూ సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్న కేంద్ర బిజెపిని రాష్ట్రాలు నిలదీయాలి. అప్పుడే రాష్ట్రాలకు మనుగడ.