Sep 02,2023 18:39

రాయ్ పూర్‌ : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆ రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి డిల్లీకా దర్బార్‌ (గాంధీ కుటుంబం) ఏమీ మేలు చేయదు అని అమిత్‌షా ఆరోపించారు. ఈ ఏడాది చివరలో ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. ఈ దిశగా.. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా..కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ఆరోప్‌ పాత్ర (అభియోగాల జాబితా)ను శనివారం రారుపూర్‌లో ఆవిష్కరించారు. ఈ ఆరోప్‌ పాత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో అమిత్‌షా మాట్లాడుతూ.. 'రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కేవలం పాలన మార్పు గురించి మాత్రమే కాదు. ఛత్తీస్‌గఢ్‌ భవిష్యత్తు గురించి కూడా. రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి భూపేష్‌ బాఘేల్‌ అవినీతి ప్రభుత్వానికి ఓటు వేయాలా? లేక అభివృద్ధి ఆధారిత బిజెపి ప్రభుత్వానికి ఓటు వేయాలా నిర్ణయించుకోవాలి. ఛత్తీస్‌గఢ్‌కి దిల్లీకా దర్బార్‌ (గాంధీ కుటుంబం) మేలు చేయదు. రాష్ట్రాన్ని అవినీతి బారి నుంచి కాపాడేది బిజెపి మాత్రమే. బిజెపి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి, ప్రగతి పథంలో తీసుకెళ్తామని, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, కుంభకోణాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 'ఆరోప్‌ పత్ర'ను ఆవిష్కరించాం' అని షా అన్నారు.
2018లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. రాష్ట్రాన్ని ప్రజలను దోచుకోవడం తప్ప మరేమీ చేయలేదు అని షా అన్నారు. రాష్ట్రంలో గత బిజెపి ప్రభుత్వాన్ని ఈ సందర్బంగా ఆయన ప్రశంసించారు. 'రమణ్‌సింగ్‌ (ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి) పాలనలో ఉన్నప్పుడు రాష్ట్రం అభివృద్ధి సాధించింది. రమణ్‌సింగ్‌ ప్రతి ఒక్కరికీ ఉచిత రేషన్‌ అందించాడు. అందుకే ప్రజలు ఆయనను చావల్‌ బాబా (బియ్యాన్ని ఉచితంగా అందించే నాయకుడు) గా పిలుస్తారు. పంచాయతీ ఎన్నికల సమయంలో మేము మహిళా అభ్యర్థిలుకు 50 శాతం సీట్లు కూడా రిజర్వ్‌ చేశాము. ఛత్తీస్‌గఢ్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌, పవర్‌హబ్‌, సిమెంట్‌ హబ్‌, అల్యూమినియం హబ్‌గా గుర్తించబడింది.' అని షా అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నక్సలిజాన్ని ప్రోత్సహిస్తోంది. బిజెపి కార్యకర్తలను హత్యచేసింది అని షా ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల వ్యాపార కేంద్రంగా మార్చింది. అని షా ఆరోపించారు.