Nov 13,2022 06:29
  • నవంబర్‌ 14 వరల్డ్‌ డయాబెటిస్‌ డే

వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మందిని ఇబ్బంది పెడుతున్న వ్యాధి మధుమేహం. ఒకసారి ఈ వ్యాధి వస్తే జీవితాంతం భరించాల్సిందే అన్న చేదు వాస్తవం చాటునే చక్కని పరిష్కారం సైతం ఉంది అన్న తీపి వాస్తవాన్ని కూడా గమనించాలి. మెరుగైన జీవనం, క్రమబద్ధమైన ఆరోగ్య సూత్రాలను పాటిస్తే.. జీవితాన్ని ఆరోగ్యమయంగా మార్చుకో వచ్చనేది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మధుమేహ నియంత్రణ కోసం 1991 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం నవంబరు 14న 'డయాబెటిస్‌ డే' జరుపుకుంటున్నాం. కానీ మధుమేహం రోగుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. ప్రపంచంలో ప్రాణాలు తీస్తున్న ప్రమాదకర వ్యాధుల జాబితాలో మధుమేహ వ్యాధి తొమ్మిదవ స్థానంలో వుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 14.2 కోట్ల మంది మధుమేహ రోగులతో చైనా మొదటి స్థానంలో ఉంది. 7.7 కోట్ల మంది రోగులతో భారతదేశం రెండో స్థానంలో ఉంది. ఈ లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో ప్రతి 11వ వ్యక్తికి మధుమేహం ఉంది. ఈ సంఖ్యలను చూస్తే మధుమేహ వ్యాధి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం అవుతుంది. సమస్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 42.2 కోట్ల మందికి మధుమేహం ఉందని...నాలుగు దశాబ్దాల కిందటితో పోలిస్తే ఈ సంఖ్య నాలుగు రెట్లకు పైగా పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) అంచనా.
ఈ వ్యాధి వల్ల శరీరంలోని ప్రతి అవయవం ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నా కూడా...మధుమేహ బాధితుల్లో సగం మందికి తమకు ఆ వ్యాధి ఉందన్న సంగతే తెలియదు. ఉందని గుర్తించిన తర్వాత కూడా తగిన జాగ్రత్తలు తీసుకోక బాధపడుతున్న పరిస్థితి. దీనిని నివారించడానికి మన ముందు రెండు మంచి మార్గాలు ఉన్నాయి. ఎవరికి మధుమేహ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందో తెలుసుకొని జాగ్రత్త పడడం మొదటిది. మధుమేహ వ్యాధి లక్షణాలు కనిపించక ముందే గుర్తించడం రెండవది. మధుమేహం రావడానికి ప్రధాన కారణం వంశపారంపర్య చరిత్ర అని ఎక్కువ మంది అనుకుంటారు. ఇది వాస్తవం కాదు. ఆరు శాతం మందికి మాత్రమే వంశపారంపర్య కారణం ఉంటుంది. షుగర్‌ రావడానికి ప్రధానమైన కారణం అధిక బరువు. దీనితోపాటు శారీరక శ్రమ తక్కువగా ఉండడం. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం. నిద్ర లేమి వంటి కారణాలు కూడా మధుమేహ వ్యాధికి దారి తీయవచ్చు.
శారీరక శ్రమ తగ్గిపోయి, మానసిక ఒత్తిడి పెరిగిపోతూ అధిక బరువుకి దారితీస్తున్నది. టీవీలు, సెల్‌ ఫోన్లు సన్నబడుతున్నాయి. మనుషులు లావు అవుతున్నారు. లావు కావడమే షుగర్‌ వ్యాధి పెరగడానికి ప్రధాన కారణం అయింది. టెక్నాలజీని ఉపయోగించుకుంటూనే ఆహార నియమాలు పాటిస్తూ రోజూ కనీసం 30 నిమిషాల పాటైనా వ్యాయామం చేయగలిగితే షుగర్‌ వ్యాధి రాకుండా కట్టడి చేయవచ్చు. షుగర్‌ వ్యాధిని డాక్టర్లు ఈరోజు గుర్తించారు అంటే...అది ఈ రోజే వచ్చిన జబ్బు కాదు. దరిదాపుగా ఐదు నుంచి పది సంవత్సరాల క్రితమే ప్రారంభమై ఉంటుంది. మొదట్లో వ్యాధి లక్షణాలు కనిపించవు. క్రమంగా వ్యాధి మొదలై, లక్షణాలు వస్తాయి. ఈ దశనే వైద్య పరిభాషలో ప్రీ డయాబెటిస్‌ అంటారు. ప్రీ డయాబెటిస్‌ దశలో వ్యాధిని గుర్తించగలిగితే దాదాపు సగం మందికి వారి జీవితంలో ఈ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. మిగిలిన సగం మందికి ఐదు నుంచి పది సంవత్సరాల పాటు వ్యాధిని వెనకకు నెట్టవచ్చు. 45 సంవత్సరాలు పైబడిన వారందరూ మూడు సంవత్సరాలకు ఒకసారి ఉదయం పరగడుపున రక్త పరీక్ష చేయించుకుని షుగర్‌ మోతాదును చూసుకోవాలి. దీనిని ఫాస్టింగ్‌ బ్లడ్‌ షుగర్‌ అంటారు. ఫాస్టింగ్‌ బ్లడ్‌ షుగర్‌ 100 మిల్లీ గ్రాముల లోపు ఉంటే షుగర్‌ వ్యాధి లేనట్టు. వంద నుంచి 139 మిల్లీ గ్రాముల లోపు ఉంటే ప్రీ డయాబెటిస్‌ దశలో ఉన్నట్టు. 140 మిల్లీ గ్రాములకు మించి ఉంటే డయాబెటిస్‌ వ్యాధి ఉన్నట్టు. ప్రీ డయాబెటిస్‌ దశలో ఉన్నవారు సంవత్సరానికి ఒక్కసారి షుగర్‌ మోతాదును పరీక్షించుకోగలిగితే షుగర్‌ వ్యాధిని ముందుగా గుర్తించవచ్చు. తగిన వైద్యం చేయించుకుంటే షుగర్‌ వ్యాధి వల్ల వచ్చే అనేక అనర్ధాలను అదుపు చేయవచ్చు.
మనిషి వ్యాధి నిరోధక శక్తిని బట్టి మధుమేహ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. తరచూ మూత్రం రావడం, దాహం ఎక్కువగా వేయడం. గొంతు ఎండిపోతున్నట్లు అనిపించడం, అకారణంగా బరువు తగ్గడం, బాగా నీరసంగా ఉండడం. చూపు మందగించడం, అతిగా ఆకలి వేయడం, కాళ్లలో స్పర్శ తగ్గడం, వృషణాలలో దురద, అంగంలో మంటగా ఉండటం... లాంటి లక్షణాలు కనిపిస్తే తప్పక రక్తంలో షుగర్‌ మోతాదును పరీక్ష చేయించుకోగలిగితే షుగర్‌ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించవచ్చు. ఈ లక్షణాలన్నీ అందరిలో ఉండకపోవచ్చు. కొద్దిమందిలో కొన్ని కనిపిస్తాయి. మరికొందరిలో మరికొన్ని కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఉన్న వారందరూ తప్పక షుగర్‌ పరీక్ష చేయించుకోవాలి. వ్యాధి ముదిరి రక్త నాళాలు, మూత్రపిండాలు, గుండె సమస్యలు వచ్చిన తర్వాతే ఎక్కువ మంది గుర్తిస్తారు. రక్తంలో చక్కెర స్థాయి అధిక స్థాయిలో ఉంటే.. అది రక్త నాళాలను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది. శరీరంలో రక్తం సక్రమంగా ప్రవహించలేకపోతే రక్తం అవసరమైన శరీర భాగాలకు అది చేరదు. దానివల్ల నాడీ వ్యవస్థ దెబ్బతినటం, చూపు కోల్పోవటం, కాళ్లకు ఇన్ఫెక్షన్లు వంటి ప్రమాదాలు పెరుగుతాయి.
మధుమేహం వ్యాధి బారిన పడకూడదంటే...ఆరోగ్య వంతమైన ఆహారం తీసుకుంటూ మంచి అలవాట్లతో జీవనశైలిని పాటించాలి. మధుమేహాన్ని నివారించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇలాంటి చిన్న మార్పులు కూడా చాలా పెద్ద ప్రభావం చూపుతాయి. తీపిగా ఉండే మిఠాయిలు, చక్కెర పానీయాల్లో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఎక్కువగా ఉంటుంది. రోజూ ఆర్టిఫీషియల్‌ షుగర్‌ డ్రింక్స్‌ లేదా కూల్‌ డ్రింక్స్‌ తాగే వ్యక్తులకు టైప్‌ 2 డయాబెటిస్‌ వచ్చే అవకాశం 80 శాతం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పానీయాలకు ప్రత్యామ్నాయంగా తాజా పండ్ల రసం, టీ, కాఫీ లేదా నిమ్మరసం, కొబ్బరి నీరు వంటివి తీసుకోవచ్చు.
ప్రతి ఒక్కరూ శరీర బరువు పెరగకుండా శ్రద్ధపెట్టాలి. ఎందుకంటే అధిక బరువు మధుమేహానికి ప్రధాన కారణం. అదనపు బరువును తగ్గించే ప్రతి ప్రయత్నం డయాబెటిస్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, శరీర బరువులో 7 శాతం వరకు తగ్గడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం 60 శాతం వరకు తగ్గుతుందని ఒక పరిశోధన తేల్చింది. బరువు నియంత్రణలో ఉన్నంత మాత్రాన పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పలేం. ఎందుకంటే వెయిట్‌ మేనేజ్‌మెంట్‌కు తోడు శారీరక శ్రమ ఉంటేనే జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. అయితే శారీరకంగా చురుకుగా ఉండటం అంటే జిమ్‌లలో గంటల కొద్దీ కష్టపడడం కాదు. వాకింగ్‌, జాగింగ్‌, సైక్లింగ్‌ వంటివి కూడా చేయవచ్చు. ఇవి బద్ధకాన్ని దూరం చేసి శారీరక, మానసిక చురుకుదనాన్ని పెంచుతాయి.
మధుమేహాన్ని నివారించడంలో నిద్ర కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారం, శారీరక శ్రమ, ఇతర జీవనశైలి మార్పులు పాటించినా.. నిద్ర సరిగా లేకపోతే ప్రయోజనం ఉండదు. నిద్ర నాణ్యత తగ్గితే, ఆ ప్రభావం ఆహారం, బరువుపై పడుతుంది. నిద్ర తక్కువ అయినప్పుడు, శక్తి కోసం ఫుడ్‌ ఎక్కువగా తీసుకుంటారు. ఇది బరువు పెరగడానికి కారణం కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ స్లీప్‌ సైకిల్‌పై దృష్టిపెట్టాలి. కనీసం 6 నుంచి 7 గంటలు నిద్రపోవాలి. నిద్రవేళలు రోజూ ఒకేలా ఉండటం మంచిది. ఆల్కహాలిక్‌ డ్రింక్స్‌ రోజూ తాగడం వల్ల బరువు పెరగవచ్చు. అందుకే ఆల్కహాల్‌ తక్కువగా తీసుకోవాలి. వీలైతే పూర్తిగా మానేయడం మంచిది. ధూమపానం కూడా ఆరోగ్యానికి హానికరం అనేది తెలిసిందే. అయితే పొగ తాగడానికి, టైప్‌ 2 డయాబెటిస్‌కు అవినాభావ సంబంధం ఉందని అనేక అధ్యయనాలు తేల్చాయి. పొగ తాగే వారికి మధుమేహం వచ్చే అవకాశాలు 40 శాతం పైగా పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది. తక్కువ సమయంలో బరువు తగ్గేందుకు సూచించే ఆహారాలను ఫ్యాడ్‌ డైట్స్‌ అంటారు. వీటిలో ఎలాంటి పోషకాలు ఉండవు. ఇవి అనారోగ్యకరమైనవి. దీర్ఘకాలంలో శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఈ ఆహారంలో పూర్తి స్థాయిలో పోషకాలు లేకపోవడం వల్ల... రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులకు గురవుతాయి. దాంతో డయాబెటిస్‌ ముప్పు పెరుగుతుంది. అందుకే బరువు తగ్గాలని చూసేవారు ఇలాంటి ఆహారాలు మానుకోవాలి. వీటికి బదులుగా ఆకుకూరలు ఎక్కువగా తినడం, జంక్‌ ఫుడ్‌కు నో చెప్పడం, వ్యాయామం చేయడం వంటి వాటిపై దృష్టి పెట్టాలి.
అందుబాటులో వున్న అనేక నివారణా మార్గాల ద్వారా షుగర్‌ వ్యాధికి చెక్‌ పెడదాం.

ramanaya

 

 

 

 

వ్యాసకర్త: ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డా|| ఎం.వి.రమణయ్య