అవిశ్వాసానికి మద్దతా ? లేక మోడీకి లొంగుబాటా ? : వైసిపి, టిడిపిలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సూటి ప్రశ్న
విజయవాడ : ఎపి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బిజెపికి లొంగిపోకుండా, పార్లమెంటులో పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వైసిపి-టిడిపిలు బలపరచాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. వి.శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ... వైసిపి-టిడిపిలు అవిశ్వాస తీర్మానాన్ని బలపరుస్తారా ? లేకపోతే అనాగరిక వ్యక్తికి లొంగిపోతారా ? అని ప్రశ్నించారు. ఇండియా పేరుతో ఏర్పడిన ప్రతిపక్ష కూటమి ఎన్‌డిఎ మోడి ప్రభుత్వం మీద పార్లమెంటులో గురువారం అవిశ్వాస తీర్మానాన్ని పెట్టిన విషయం అందరికీ విదితమేనని అన్నారు. ఈ అవిశ్వాస తీర్వానానికి దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు పక్కనే ఉన్న బిఆర్‌ఎస్‌తో సహా అందరూ మద్దతునిస్తే ... మన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసిపి-టిడిపి 25మంది ఎంపిలు మాత్రం ఏకగ్రీవంగా బిజెపి ప్రభుత్వానికి మద్దతిస్తూ అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించడం... అవమానకరమన్నారు. దేశంలో బిజెపి ప్రభుత్వం ఎక్కువ అన్యాయం చేసింది ఎపి రాష్ట్రానికేనన్నారు. ఎపి ప్రజలు బిజెపికి పుట్టగతులు లేకుండా చేశారని... అలాంటి బిజెపి ప్రభుత్వానికి సిగ్గు లేకుండా ఎలా మద్దతిస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై ఎపి ప్రజలకు వైసిపి-టిడిపిలు వివరణ ఇవ్వాల్సిన అవసరముందన్నారు. మణిపూర్ ఘోరాలపై విదేశాల్లో సైతం స్పందిస్తుంటే... దానిపై చర్యలు తీసుకోవాలంటూ నినదిస్తుంటే ... విజయసాయిరెడ్డి ఏమీ జరగనట్లు అంతా బాగుందని అనడం సిగ్గుచేటన్నారు. తెలుగు ప్రజలకు విజయసాయిరెడ్డి క్షమాపణ చెప్పాలని వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఎపికి ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచిన బిజెపి ప్రభుత్వానికి మద్దతివ్వడమే కాకుండా దాన్ని వెనకేసుకొస్తున్నారని... బిజెపి కి వీరంతా బి టీమ్ నా ? లేక వారికి శాటిలైట్స్‌గా పనిచేస్తున్నారా ? అని మండిపడ్డారు. ఇంత దుర్మార్గంగా వైసిపి-టిడిపిలు పోటీపడిమరీ బిజెపికి వంతపాడుతున్నారని దుమ్మెత్తిపోశారు. విజయసాయిరెడ్డిలాగా ప్రకటన చేయకపోయినా... టిడిపి మౌనంగా గోడపై పిల్లి కూర్చున్నట్లు కూర్చుంటూ.. దోబూచులాటతో తెలుగు ప్రజల చెవుల్లో పూలు పెట్టాలనుకోవడం అవివేకమన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నారా ? లేక మద్దతిస్తున్నారా ? అనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ వారు బహిరంగంగా, స్పష్టంగా చెప్పాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటులో అన్ని పార్టీల నేతలు నిలబడి మాట్లాడితే... టిడిపి వారు మాత్రం ఎలా కూర్చున్నారని అడిగారు.
ఎపి రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలు ఏం జరిగాయన్న విషయమై పార్లమెంటులో నిన్నటికి ముందుగా కేంద్ర మంత్రి మాట్లాడారని గుర్తు చేశారు. కనీసం ఒక్క హామీనైనా రాష్ట్రానికి చేశామని వారు చెప్పలేకపోయారని అన్నారు. అలాంటి వారి తరపున వైసిపి నేత విజయసాయిరెడ్డి వకాల్తా పుచ్చుకొని మాట్లాడటం శోచనీయమన్నారు. ఆయన మించిన ఘనుడు ఆచంట మల్లా అన్నట్లు ... ప్రభువును మించిన ప్రభువు భక్తిని విజయసాయిరెడ్డి ప్రదర్శిస్తున్నారని శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. విభజన చట్టంలో ఉన్న కడప ఉక్కు ఫ్యాక్టరీని పనికిరాదు అంటూ ... కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే నోరు మెదపకుండా తెలుగువారిని తలదించుకునేలా వైసిపి-టిడిపి లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కడప ఉక్కు ఫ్యాక్టరీని పెట్టకుండా రాయలసీమని ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని, రాజధాని నిధులు ఇవ్వలేమని, కడప ఉక్కు ఫ్యాక్టరీ కూడా సాధ్యం కాదని బిజెపి ప్రకటించిందని తెలిపారు. రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని చెప్పారు. పంచపాండవుల మంచపు గోడలా ... రైల్వే జోన్‌కు ఓ లెక్కగట్టి అంతకంటే తక్కువ ఇస్తున్నామని చెప్పి.. ఇప్పటివరకు బిజెపి ప్రభుత్వం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని అన్నారు. రూ.100 కోట్లకు రూ.10 కోట్లు అని చెప్పి పైసా కూడా విడుదల చేయలేదన్నారు. ఇన్ని జరిగినప్పటికీ వైసిపి-టిడిపిలు పార్లమెంటులో తలదించుకున్నాయని.. ఇందుకు సిగ్గుపడాలన్నారు. '' తెలుగు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులేనా మీరు ? '' అని నిలదీశారు. '' మీ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడతారా ? '' అని ఘాటుగా ప్రశ్నించారు. కేంద్రీయ విద్యాలయాలకు రూ.420 కోట్లు అవసరమైతే ... కేవలం రూ.39 కోట్లను మాత్రమే బిజెపి మంజూరు చేసిందన్నారు. రాష్ట్రం విడిపోయి పదేళ్లయినా ఇంతవరకు సొంత క్యాంపస్ కూడా లేదని చెప్పారు. అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీకి రూ.470 కోట్లు అంచనా అయితే దానికి రూ.125 కోట్లు మంజూరు చేశారని అన్నారు. అక్కడ ఆడపిల్లలకు రక్షణ గోడ కూడా లేక వారంతా ఆందోళనకు దిగారని చెప్పారు. వైసిపికి 25మంది ఎంపీలున్నారని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికితే ఏం ప్రయోజనముండబోదని వి.శ్రీనివాసరావు మండిపడ్డారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రోజుకు 11 వేల టన్నుల సామాగ్రి అవసరం అయితే ప్రస్తుతం 2, 3 వేల టన్నులిస్తున్నారని అంటే రోజుకు ఒక్క షిఫ్ట్ కూడా నడవడం లేదని అన్నారు. నిర్వాసితుల భూములను తీసుకొని పోర్టు పెట్టారనీ.. ఆ పోర్టును అదానీకి అప్పజెప్పి నాశనం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం పెట్టిన గంగవరం పోర్టును రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని జాతీయం చేయాలని డిమాండ్ చేశారు. కనీసం ఉక్కు ఉద్యోగులకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని అన్నారు. రాష్ట్రానికి బిజెపి ఇంతగా... అన్యాయం చేస్తే ... మణిపూర్ దురాగతాల్లో మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే... వైసిపి-టిడిపి లు మాట్లాడకుండా బిజెపికి తాళం వేస్తున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మణిపూర్ ఘటనలపై మౌనం వహించిన ప్రధాని ఉన్నందుకు భారతదేశం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. పార్లమెంటులో పెట్టే అవిశ్వాస తీర్మానం న్యాయసమ్మతమైందని వి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి గద్దె పై కూర్చునే అర్హత మోడీకి లేదన్నారు. ఇలాంటి అనాగరికమైన వ్యక్తి గద్దె మీద కూర్చుంటే భారతదేశం ప్రతిష్ట నవ్వులపాలైపోతుందని అన్నారు. వైసిపి-టిడిపిలు అవిశ్వాస తీర్మానాన్ని బలపరుస్తారా ? లేకపోతే అనాగరిక వ్యక్తికి లొంగిపోతారా ? అని అడిగారు. లొంగుబాటు పార్టీలుగా ఉండిపోతే.. వారికి స్వతంత్రమేముంది ? వ్యక్తిత్వమేముంది ? అని అడిగారు. ఇప్పటికైనా వైసిపి-టిడిపిలు అవిశ్వాస తీర్మానాన్ని బలపరచాలని శ్రీనివాసరావు కోరారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఈనెల 31వ తేదీన జిల్లా కలెక్టరేట్ల వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నాలు చేపడతామని వి.శ్రీనివాసరావు ప్రకటించారు.










