Feb 14,2023 16:32

ప్రజాశక్తి-కాకినాడ : కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా, సంక్షేమ పథకాలు, సబ్సిడీలపై కోతలు విధించి ప్రజలపై అదనపు భారాలు వేసినందుకు, అదానీ అవినీతికి నిరసనగా ఈ నెల 24వ తేదీన జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించాలని సిపిఎం జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. మంగళవారం స్థానిక సుందరయ్య భవన్‌లో దువ్వ శేష బాబ్జీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.వి.నాగేశ్వరరావు మాట్లాడారు. మోడీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి భారీ కోతలు విధించిందన్నారు. ఎరువులపై సబ్సిడీలు తగ్గించి ధరలు పెంచిందని విమర్శించారు. కౌలు రైతులను కనీసం గుర్తించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిరాకరించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అండగా ఉన్న ఉపాధి హామీ పథకానికి భారీ కోతలు విధించారనీ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను ఎత్తివేశారని, బడ్జెట్‌లో సంక్షేమ నిధులు తగ్గిపోయాయని, ప్రజాపంపిణీ ద్వారా సరఫరా అయ్యే సబ్సిడీ బియ్యాన్ని రద్దు చేశారని ఆయన తెలిపారు. ధరల పెరుగుదలతో సతమతమవుతున్న జనంపై భారాలు మోపేదిగా ఈ బడ్జెట్‌ ఉందన్నారు. మన రాష్ట్రానికి ప్రత్యేక హౌదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయలేదన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను ఆపలేదన్నారు. అదానీ కుంభకోణం అంతర్జాతీయంగా భారతదేశానికి తలవంపులు తెచ్చిందన్నారు. చిన్న మదుపుదార్లు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎల్‌ఐసిని ముంచేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆస్తుల్ని, ప్రకృతి వనరుల్ని అదానీపరం చేయడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. ఫిబ్రవరి 24వ తేదీన జిల్లా, మండల కేంద్రాలలో ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. సిపిఎం జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌ జిల్లా కార్యకలాపాల నివేదికను ప్రవేశపెడుతూ భవిష్యత్‌ కర్తవ్యాలను గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు జి.బేబీరాణి, కరణం ప్రసాదరావు, సిపిఎం శాఖ కార్యదర్శులు, పూర్తి కాలం కార్యకర్తలు పాల్గొన్నారు.