Apr 30,2023 06:28
  • మేడే స్ఫూర్తితో సమరశీల పోరాటాలు

ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది. మోడీ విజన్‌ విఫలమైంది. అభివృద్ధి పథంలో నడుస్తుందని బాకా వాయించుకుంటున్న మన దేశ ఆర్థిక వ్యవస్థ గత నాలుగు సంవత్సరాలుగా మందకొడిగా సాగుతున్నది. మోడీ విజన్‌ దేశాన్ని మతోన్మాదం వైపు మళ్లించింది. 2024 ఎన్నికలు సమీపిస్తుండటంతో తిరిగి విజన్‌ 2047 అంటూ కొత్తరాగం అందుకున్నారు. ఆర్థిక మాంద్యం, అధిక ధరలు, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు తీవ్రతరమవుతున్నాయి. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానంతో సంపద అదానీ లాంటి కొద్దిమంది దగ్గర అతి కొద్ది కాలంలో కుప్పలు కుప్పలుగా పోగుబడింది. ప్రపంచంలోనే కొద్ది మంది భారతీయులు అపర కుబేరులుగా మారిపోయారు. తలసరి ఆదాయంలో ప్రధాన దేశాల్లో భారతదేశం వెనుకబడింది. ఈ స్థితిలో యువతరం భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన కొనసాగుతున్నది. పరిష్కారం కోసం అన్వేషణ సాగుతున్నది. పెట్టుబడిని ప్రోత్సహిస్తే సంపద పెరిగి అందరికీ లాభం జరుగుతుందని కొందరు వాదిస్తున్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేరుతో పాలకులే శ్రమశక్తిని అణచివేస్తున్నారు. అందుకనుగుణంగా చట్టాలనే మార్చివేశారు. చారిత్రాత్మక మేడే సాధించిన విజయాలను కూడా చెత్తకుప్పలో వేస్తున్నారు. ఎనిమిది గంటల పనికి బదులుగా 12 గంటలు పని చేయాలని నిర్బంధిస్తున్నారు. నేటి ఆర్థిక సంక్షోభానికి ఇదే మూల కారణం. కాని సంక్షోభాన్ని అధిగమించడానికి పెట్టుబడిదారులు పాలకులను శాసించి శ్రమను మరింతగా దెబ్బకొడుతున్నారు. ఈ సమాజం ఒక విష వలయంలో ఇరుక్కుపోతోంది. దీనికి ప్రత్యామ్నాయం శ్రమను ప్రోత్సహించడమే. శ్రమను ప్రోత్సహిస్తే కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తుంది. శ్రమకు, పెట్టుబడికి మధ్య జరిగే ఈ పోరాటంలో ఎవరు గెలుస్తారు అన్న దాని మీద భారతదేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
మన రాష్ట్రాన్ని మేం అభివృద్ధి చేశామంటే మేము చేశామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌, తెలుగుదేశం పోటీ పడి ప్రచారం చేసుకుంటున్నాయి. మోడీ విజనే తన విజన్‌ అంటున్నారు చంద్రబాబు. తాము పెట్టుబడులు తేవడం వల్లే అభివృద్ధి జరిగిందని ఇద్దరూ బాకాలూదుకుంటు న్నారు. వీళ్లిద్దరిలో ఎవరూ కూడా శ్రామికుల కష్టాన్ని గుర్తించడం లేదు. రాష్ట్రంలో రైతులు, కూలీలు, కార్మికులు, వృత్తిదారులు తాము పొందుతున్న ఆదాయాలకు పదింతలు సమాజానికి, ప్రభుత్వాలకు ఇస్తున్నారు. శ్రమను ధారపోయడమే కాదు పన్నులు కూడా అత్యధికంగా కట్టి జిఎస్‌టి దోపిడీకి గురవుతున్నదీ వీరే. శ్రమ దోపిడీకే కాదు సామాజిక, లింగ, ప్రాంతీయ వివక్షతలకు కూడా ఈ వర్గాలు గురవుతున్నాయి. కుల వివక్షత రాష్ట్రంలో విస్తారంగా అమలవు తోంది. కులాన్ని బట్టి వేతనాలు ఇప్పటికీ అమలవుతున్నాయి. బిజెపి అధికారంలోకి వచ్చాక అగ్రకుల దురహంకారం ఇంకా పెరిగింది. వైసిపి, టిడిపి ఏ పార్టీ కూడా కుల వివక్షతపై పోరాడటం లేదు. కులాన్ని ఒక ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుంటున్నారు. సోషల్‌ ఇంజనీరింగు పేరుతో కులాల మధ్య కుంపటి పెట్టి శ్రామిక జనాలను చీల్చి పెట్టుబడి దారులకు ఊడిగం చేస్తున్నారు. అన్ని రకాల అసమానతలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు సాగించేందుకు మేడే స్ఫూర్తినిస్తుంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం లక్ష్యంగా ఈ పోరాటాలు సాగాలి.

  • అదానీ నమూనా అభివృద్ధి వట్టి గాలిబుడగ

పెట్టుబడిదారీ విధానం కూడా సంపద సృష్టిస్తుంది. అయితే పెరిగే సంపద కొద్దిమంది చేతుల్లోకి పోతుంది. అత్యధికులు బికారులవుతున్నారు. సంపద పంపిణీలో ఉన్న అసమానతలే ఇందుకు కారణం. ప్రభుత్వాలు తమ అనుంగులకు అనుకూలంగా ఆదాయాన్ని పున:పంపిణీ చేస్తాయి. ఫలితంగా నిరుద్యోగం, పేదరికం పెరుగుతున్నాయి. ఆశ్రిత పెట్టుబడితో పెట్టుబడిదారుల్లో కూడా ప్రభుత్వాధి నేతలకు దగ్గరగా ఉండే వారికి అనుకూలంగా విధానాలు చేస్తారు. కానీ అదానీ నమూనా దానికి కూడా భిన్నంగా ఉంది. అభివృద్ధి పేరుతో అదానీకి పెద్దపీట వేసి అశ్వమేధ యాగం చేస్తున్నారు మోడీ. సంపద సృష్టించడానికి బదులు ఉన్న సంపదను కాజేసే కొత్త పద్ధతులు కనిపెట్టారు. ఇప్పటికే ఉన్న పరిశ్రమలు, ప్రాజెక్టులపై ఆధిపత్యం, సూట్‌కేసు కంపెనీల ద్వారా షేర్‌ మార్కెట్‌ రిగ్గింగ్‌, ప్రకృతి వనరులపై ఆధిపత్యం, ప్రభుత్వ సంస్థలను సొంతం చేసుకోవడం వంటి పద్ధతులతో మెగాస్పీడుతో సంపద పోగేసుకుంటున్నారు. మన రాష్ట్రంలో కృష్ణపట్నం ఓడరేవు, గంగవరం పోర్టు అదానీ వశమయ్యాయి. విశాఖ ఉక్కును సొంతం చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు. వీటివల్ల అదనంగా పెట్టుబడి వచ్చేది లేదు.
ఉపాధి పెరిగేది లేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు బదులు మరొక ఉక్కు ఫ్యాక్టరీ పెడితే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. సంపద పెరుగుతుంది. కానీ ఆ పని చేయటం లేదు. మానిటైజేషన్‌ పేరుతో రైల్వేస్టేషన్లు, హైవేలు, పోర్టులు, విమానాశ్రయాన్ని కొనుగోలు కూడా చేయకుండానే లీజ్‌ పద్ధతిపై దీర్ఘకాలం పెత్తనం చేస్తారు. ఐటీలో అదానీకి అనుభవం లేకున్నా విశాఖ పరిసరాల్లో 400 ఎకరాలు డేటా సెంటర్ల కోసం కేటాయించారు. పెట్టుబడి లేకుండానే లాభాలు దోచుకోవడం మోదానీ నమూనా అభివృద్ధి. పెట్టుబడిదారీ వికృత పద్ధతులకు దృష్టాంతమిది.

  • ప్రజల ఆదాయాలు పెంచే విజన్‌ కావాలి

రాష్ట్ర ప్రజల ఆస్తులు, ఆదాయాలు పెంచడానికి బదులుగా కార్పొరేట్‌ కంపెనీల ద్వారా ఉత్పత్తి పెంచి విదేశాలకు ఎగుతమతి చేసి సంపద పెంచాలని పాలక వర్గాలు అంటున్నాయి. కానీ నేటి సంక్షోభ పరిస్థితులలో మన వస్తువులకు ప్రపంచ మార్కెట్లో గిరాకీ దొరకదు. రాజీవ్‌ గాంధీ హయాంలో జరిగిన పొరపాటు అదే. ఆ తర్వాత 1990లలో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాం. దాని నుండి బయటపడటానికి సంస్కరణల పేరుతో ప్రైవేటీకరణ విధానాలు అమలు చేశారు. అవే నాడు వినాశకరంగా మారాయి. అనుభవం నుండి నేర్చుకొని ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేస్తేనే అభివృద్ధి సాధ్యం.

  • కమ్యూనిస్టుల విజన్‌తోనే రాష్ట్రాభివృద్ధి

1946లోనే ''విశాలాంధ్రలో ప్రజారాజ్యం'' పేరుతో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిపై ఒక సమగ్రమైన విజన్‌ను పుచ్చలపల్లి సుందరయ్య ప్రజల ముందుంచారు. ఆ విజన్‌ ఇప్పటికీ అమల్లోకి రాలేదు. కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తేనే ఆ విజన్‌ అమలవుతుంది. 2014లో ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం రాష్ట్ర భవిష్యత్తుపై అనేక మందిలో ఆందోళన పెరిగింది. చంద్రబాబు నాయుడు అనుభవం రీత్యా త్వరగా అభివృద్ధి చేస్తారని పట్టం కట్టారు. ఆయన గత కాలపు సంస్కరణల వారసత్వాన్ని కొనసాగించి అభివృద్ధిని కేంద్రీకరించటంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగి 2019లో ఓడిపోయారు. ప్రజల అసంతృప్తిని సంక్షేమ కార్యక్రమాల వైపు మళ్ళించి జగన్‌ మోహన్‌ రెడ్డి గెలుపొందారు. గత నాలుగు సంవత్సరాలుగా నవరత్నాల పేరుతో సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా ఉంది. పెట్టుబడిదారీ వ్యవస్థ వైఫల్యంతో మరో ప్రత్యామ్నాయం కోసం యువతలో అన్వేషణ సాగుతోంది. వారికి మార్గం చూపించగలిగింది సోషలిజమే.

  • సామాజిక న్యాయం భూపంపకంతోనే సాధ్యం

మన రాష్ట్రంలో భూమిలేని పేద కుటుంబాలు 45 లక్షలు ఉన్నాయి. వ్యవసాయానికి అనువుగా ఉండే కోటి 20 లక్షల ఎకరాల భూమి ఖాళీగా ఉంది. దీన్ని కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెడుతున్నారు. వారు పరిశ్రమలు పెట్టరు. ఉద్యోగాలు ఇవ్వరు. ఆ భూములను బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు తీసుకొని ఎగ్గొట్టి బ్యాంకుల్ని దివాళా తీయిస్తున్నారు. మన రాష్ట్రంలో కామందులు బ్యాంకులకు పడ్డ బకాయి లక్ష కోట్లపైనే ఉంది. రైతు భరోసా కేంద్రాలను ప్రైవేటు సర్వీసు కంపెనీల పరం చేసేందుకు జగన్‌ ప్రభుత్వం పూనుకుంటున్నది. దొడ్డిదారిన కార్పొరేట్‌ కంపెనీలకు గేట్లు తెరుస్తున్నారు. ఇలాంటి మోసగాళ్లకు భూములు కట్టబెట్టే బదులుగా వ్యవసాయంపై ఆసక్తి ఉండి కష్టంచేసే పేదలకిస్తే బంగారం పండిస్తారు. వారికి ప్రభుత్వ ప్రోత్సాహం కావాలి. బ్యాంకులు పంట రుణాలు ఇవ్వాలి. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించే పద్ధతిలో రైతులకు శిక్షణ ఇవ్వాలి. ఆధునిక యంత్రాలు సహకార సంఘాల ద్వారా సరఫరా చేయాలి. ఇరిగేషన్‌ సౌకర్యం అభివృద్ధి చేస్తే కనీసం ఒక పంటకు నీటిపారుదల సౌకర్యం కల్పించవచ్చు. రెండో పంట ఆరుతడి లేదా మెట్ట పంట వేయొచ్చు. మార్కెట్లో ప్రభుత్వ రంగ సంస్థలు జోక్యం చేసుకొని గిట్టుబాటు ధర గ్యారెంటీ చేయవచ్చు. ఉదాహరణకి ఎకరాకు 40 బస్తాలు పండితే బస్తాకు రూ.2100 ఇస్తే, రూ.85 వేల ఆదాయం వస్తుంది. ఇప్పుడు వస్తున్న ఆదాయం మీద ఇది రూ.35 వేలు ఎక్కువ, సంవత్సరానికి రెండు పంటలు పండితే రెండున్నర ఎకరాల మీద ఒక కుటుంబానికి సంవత్సరానికి రూ. లక్ష 87 వేలు వస్తుంది. రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది. తద్వారా గ్రామీణ ప్రజల సౌకర్యాలు పెరుగుతాయి. కొనుగోలు శక్తి పెరుగుతుంది. బట్టలు, చెప్పులు, సబ్బులు, వాహనాలు వగైరా కొంటారు. పిల్లలకు చదువు చెప్పిస్తారు. పెద్దలకు వైద్యం చేయిస్తారు. ఉదాహరణకు మన రాష్ట్రంలోని పేదలు తమ పిల్లలకు కనీసం ఒక కాటన్‌ చొక్కా కొనుగోలు చేస్తే టెక్స్‌టైల్‌ పరిశ్రమలో లక్ష మందికి ఉపాధి కలుగుతుంది. అంటే ఐటిఐ, పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌ చదువుకున్న అనేకమందికి ఉద్యోగాలు దొరుకుతాయి. పత్తి పంటకు డిమాండ్‌ పెరిగి రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది. పాలు, పండ్లు, కూరగాయలకు డిమాండ్‌ పెరుగుతుంది. చిన్న చిన్న వ్యాపారాలు పెరుగుతాయి. ప్రతి ఒక్కరికి పని దొరుకుతుంది. అప్పుడే వ్యవసాయం నిజమైన పండుగవుతుంది. దీనివల్ల వలసలు తగ్గి ఆయా ప్రాంతాలకు పరిశ్రమలు నడిచి వస్తాయి. గ్రామాలకు, పట్టణాలకు మధ్య అగాధం తగ్గిపోతుంది. పట్టణాల్లో ఉండే సౌకర్యాలు గ్రామాలకు వస్తాయి. వ్యవసాయం పునాదిగా పరిశ్రమలు పెరిగితే ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం వస్తుంది. ఈ వ్యవస్థ మీద ఆధారపడి సర్వీస్‌ రంగం పెరుగుతుంది. బ్యాంకింగ్‌, రిటైల్‌ వ్యాపారం, రియల్‌ ఎస్టేట్‌, టూరిజం, హోటల్‌ బిజినెస్‌ ఇలా అన్ని రంగాలు అభివృద్ధి అవుతాయి. ఐటీ, సినిమా, మీడియా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి అవకాశం ఉంది. వ్యవసాయం, పరిశ్రమలు అభివృద్ధి కాకుండా అంతర్గత మార్కెట్‌ పెరగదు. మోడీ తరహా అభివృద్ధి విదేశీ మార్కెట్లపై ఆధారపడి ఉంటుంది. విదేశీ పెట్టుబడి కోసమే ఇక్కడ ప్రాథమిక సౌకర్యాల కల్పనపై కేంద్రీకరిస్తున్నారు. దీని వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరగవు. దేశీయ సంపదా పెరగదు.

  • వ్యవసాయం, పరిశ్రమలే పునాది

ఆర్థిక వ్యవస్థలో - వ్యవసాయం, పరిశ్రమలు, సర్వీస్‌ రంగం - మూడు ముఖ్యమైన రంగాలు ఉన్నాయి. వీటికి అనుసంధానంగా ప్రాథమిక సౌకర్యాల (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) కల్పన ఉంటుంది. మనది ప్రధానంగా వ్యవసాయక రాష్ట్రం. కీలకమైన భూమి అత్యధిక భాగం భూస్వాముల చేతుల్లో ఉంది. వారు నేరుగా సేద్యం చేయరు. పెట్టుబడి పెట్టరు. భూమిని కూలీలు, పేద రైతులకు కౌలుకి ఇస్తారు. పేద రైతులు అప్పులు చేయాలి. బ్యాంకులు రుణాలు ఇవ్వవు. ప్రభుత్వం సహాయం చేయదు. అందువల్ల వారు కేవలం రెక్కల కష్టంతోనే ఉత్పత్తి చేస్తారు. అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతు ఆధారంగా వ్యవసాయ అభివృద్ధి చేయడానికి బదులుగా వ్యవసాయ రంగంతో ఏమాత్రం సంబంధం లేని కార్పొరేట్‌ కంపెనీలకు ఈ రంగాన్ని అప్పగించేందుకు మోడీ ప్రయత్నించారు. దీనికి జగన్‌, చంద్రబాబు ఇద్దరూ మద్దతునిచ్చారు. ఈ విధానం అమల్లోకి వస్తే రైతులు భూములు కోల్పోతారు. కౌలుదారులకు భూమి దొరకదు. వ్యవసాయ కూలీలకు ఉపాధి ఉండదు. గ్రామీణ ప్రాంతాల నుండి వలసలు పెరుగుతాయి. పట్టణీకరణ విస్తరిస్తుంది. తత్ఫలితంగా భూ పరిమితి చట్టాలు గల్లంతవుతాయి. భూకేంద్రీకరణ పెరుగుతుంది. నూతన తరహా పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యవసాయ రంగంలోకి ప్రవేశిస్తుంది. ఈ పరిణామం అత్యధిక ప్రజల ప్రయోజనాలను దెబ్బ కొడుతుంది.

  • సంక్షేమం అభివృద్ధీ రెండూ అవసరమే

సంక్షేమం, అభివృద్ధికి పోటీ పెట్టి ఉచితాలు ఇచ్చినందువల్ల సంపద వృధా అయ్యి అభివృద్ధి దెబ్బ తింటుందని, ప్రజలు సోమరిపోతులవుతున్నారని కొంతమంది వాదిస్తున్నారు. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. సంక్షేమం అభివృద్ధికి తోడ్పడేదే. ప్రజలకు ఏ రూపంలో ఆదాయం వచ్చినా అది కొనుగోలుశక్తిగా మారుతుంది. ఉత్పత్తి పెరుగుదలకు తోడ్పడుతుంది. సంక్షేమ కార్యక్రమాలకు ఉచితాలని పేరు పెట్టడం అన్యాయం. ఇది సామాన్య ప్రజల హక్కు. తాము పోగొట్టుకున్న ఆదాయంలో అతి కొద్ది భాగమే సంక్షేమ కార్యక్రమాల రూపంలో తిరిగి పొందుతున్నారు. ఇవి ఎవరి దయా దాక్షిణ్యాలపై నడిచేవి కావు. తమ స్వంత డబ్బే పంపిణీ చేస్తున్నట్లుగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రచారం చేసుకుంటోంది. తాజాగా చంద్రబాబు నాయుడు రిపబ్లిక్‌ టీవీ ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ మోడీ అమలు చేస్తున్న విజన్‌ 2047ను బలపరుస్తున్నట్లుగా ప్రకటించారు. అదే మోడీ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేస్తున్నారు. ఉచిత పథకాల పేరుతో సంక్షేమ పథకాలపై దాడి చేస్తున్నా జగన్‌, చంద్రబాబు ఇద్దరూ మాట్లాడటం లేదు.

  • ఆధునిక టెక్నాలజీ అందరికీ అందాలి

కమ్యూనిస్టులు ఆధునిక టెక్నాలజీకి వ్యతిరేకమన్న అపోహ కొందరిలో పుంది. కాని నేడు ఏ రాష్ట్రం కన్నా కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న కేరళలో డిజిటల్‌ టెక్నాలజీ విస్తరణ ఎక్కువగా ఉంది. ప్రపంచంలోనే కమ్యూనిస్టు చైనా టెక్నాలజీలో ముందంజలో ఉంది. మన దేశంలో ప్రస్తుతానికి కార్పొరేట్‌ శక్తులకి మాత్రమే ఈ పరిజ్ఞానం అందుబాటులో ఉంది. టెక్నాలజీ అవసరమైన రంగాల్లో ప్రైవేటు పెట్టుబడిని ఆహ్వానించవచ్చు. కమ్యూనిస్టులు ప్రైవేటు పెట్టుబడికి వ్యతిరేకం కాదు. దాని ఆధిపత్యానికి వ్యతిరేకం. పెట్టుబడి ఆధిపత్యంతో టెక్నాలజీ దోపిడీకి సాధనంగా మారింది. టెక్నాలజీ ఫలాలు అందరికీ అందాలనేది కమ్యూనిస్టుల లక్ష్యం.
టెక్నాలజీ అభివృద్ధి కోసం మండలానికి ఒక సమగ్ర శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, మార్కెట్‌ డిటైల్‌ కేటరింగ్‌ సెంటర్‌ ని ఏర్పాటు చేయాలి. ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులకు అందుబాటులోకి తీసుకు రావాలి. ఒక్క మాటల్లో చెప్పాలంటే వృత్తుల అప్‌గ్రెడేషన్‌ ప్రోగ్రాం నిర్వహించాలి. గ్రామాల్లో చేతి వృత్తిదారులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, వ్యవసాయేతర వృత్తు లు చేసుకునే వాళ్ళు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎందరో ఉన్నారు. వారి హక్కులకు భద్రత లేదు. ఉద్యోగాలకు గ్యారెంటీ లేదు. ఇలాంటి వాళ్ళ భద్రతకు, సంక్షేమానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలి. గిగ్‌ వర్కర్లు, ప్లాట్‌ఫారం వర్కర్ల పేరుతో చాలామంది తాత్కాలిక ఉద్యోగాలు చేస్తున్నారు. ఒకే వ్యక్తి ఒకేరోజు నాలుగు రకాల పనులు చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళని ''ప్రికేరియట్స్‌'' అంటారు. నివాస ప్రాంతాలు ప్రాతిపదికగా పనిచేసే ఇలాంటి వారందరి భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి. తద్వారా పట్టణ పేదల ఆదాయం పెరుగుతుంది.

 

  • పారిశ్రామికీకరణతోనే ఉద్యోగాలు

రాష్ట్రంలో పారిశ్రామికీకరణకు పుష్కలంగా అవకాశాలు న్నాయి. వ్యవసాయాధారిత పరిశ్రమలు, ఆక్వా, పౌల్ట్రీ, హార్టీకల్చర్‌ ఇత్యాది గ్రామీణ ఉత్పాదనకి సంబంధించిన ఐఓటీ టెక్నాలజీ, బయోటెక్నాలజీల కలయికతో ఉత్పత్తి పద్ధతులలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఉత్పాదకతను పెంచుకునే అవకాశాలు అనేకమున్నాయి. వీటన్నింటికీ సంబంధించిన ఒక ఉత్పత్తి పరిశోధనా కేంద్రం స్థాపించాలి. రాష్ట్రంలో ఎస్‌ఇజడ్‌, గ్రోత్‌ సెంటర్లు, ఇండిస్టియల్‌ కాంప్లెక్స్‌లు, క్యారిడార్లు పేరుతో పారిశ్రామికీకరణకు ప్రణాళికలు రూపొందించారు. కానీ అక్కడ అవి వాస్తవ రూపం ధరించలేదు. ఆ పేరుతో వేలాది ఎకరాలను రైతుల నుంచి బలవంతంగా గుంజుకున్నారు. ఆ భూమిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకొని ఎగ్గొట్టి బ్యాంకుల్ని ముంచేస్తున్నారు ఎలాంటి ఆర్థిక మోసాలు జరక్కుండా నివారించేందుకు కఠినమైన చట్టాలు తీసుకురావాలి. పరిశ్రమలు పెట్టకుండా ఐదేళ్లకు మించి భూములు ఖాళీగా ఉంటే వాటిని వెనక్కి తీసుకొని వ్యవసాయాభివృద్ధికి పేదలకివ్వాలి. ఎలాంటి ఉత్పత్తికి తోడ్పడకుండా భూములు ఖాళీగా ఉంచడం నేరంగా భావించాలి.

  • రాష్ట్రంలో డిజిటల్‌ టెక్నాలజీ

విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అన్ని రంగాల్లో డిజిటల్‌ టెక్నాలజీ అవసరం. భూమి, యంత్రాలు లాగానే డేటా కూడా ఆస్తిగా మారింది. డేటా సేకరణ అతి పెద్ద వ్యాపారం. యువతరానికి ఉచిత డిజిటల్‌ సేవలు ఎరగా వేసి డేటా సేకరించి పెద్ద ఎత్తున కార్పొరేట్‌ కంపెనీలు లాభాలు పిండుకుంటున్నాయి. భారత దేశంలో ఒక సంవత్సర కాలంలో రమారమీ పదివేల కోట్ల ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. పేదలలో కూడా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఆధార్‌ అనుసంధాన యాప్‌లను వినియోగిస్తున్నారు. అమెరికాలో ఇప్పటికి 2701, చైనాలో 443, భారత దేశంలో 138 మాత్రమే ఉన్నాయి. చైనా జనాభాను దాటిన మనకి ఇప్పుడున్న సామర్థ్యం కన్నా కనీసం మూడు రెట్ల సామర్థ్యం కావాలి. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్సీ (ఏఐ) వంటి సేవల పెరుగుదలతో ఇది రానున్న రోజులలో పెరిగే అవసరమే కానీ తరిగేది కాదు. డేటా ప్రైవసీని కాపాడటానికి, జాతీయ భద్రత దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశ వ్యాపితంగా అవసరమయ్యే డిజిటల్‌ సేవలన్నింటికీ అవసరమైన డేటా సెంటర్లకు ఒక కారిడార్‌ని ఏర్పాటు చేయాలి. మన డేటా మన దేశంలోనే ఉండాలి. పోలింగుకు వాడే ఇవియం యంత్రాల పని పారదర్శకంగా ఉండాలి. ఇవి చోరీకి గురి కాకుండా భద్రత కల్పించాలి. వివిధ ప్రైవేట్‌ సంస్థలకు కూడా ఈ సేవలు అవసరమౌతాయి. అందుకనే అనుబంధిత క్లస్టర్లను కూడా ఏర్పాటు చేయాలి. ఈ కేంద్రాలన్నింటిలో 75 శాతం ఉద్యోగాలను ఒక అయిదు సంవత్సరాల పాటు మన రాష్ట్ర యువతకి కేటాయించాలి. తద్వారా మన రాష్ట్రం నుండి పెద్దఎత్తున సాగుతున్న మేథో వలసలను ఆపవచ్చు. మన రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగు కాలేజీల సంఖ్యకనుగుణంగా ఉద్యోగాల కల్పన లేదు. ఏ హైదరాబాద్‌కో, బెంగళూర్‌కో లేదా అమెరికాకో పోతున్నారు. ఇక్కడే ఐ.టి, డేటా సెంటర్లు అభివృద్ధి అయితే అది రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుంది. మన రాష్ట్రంలో చదువుకున్న యువతకి అవసరమైన నైపుణ్యంలో శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం వ్యవస్థాగత ఏర్పాట్లను చేయాలి.
మారిన ప్రపంచ పరిస్థితులు, కోవిడ్‌ మూలంగా పెరిగిన చిప్స్‌ కొరత వగైరా కారణాల రీత్యా, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ చిప్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. అమెరికా చైనా మీద పెడుతున్న ఆంక్షలను మనం పరిశీలించినప్పుడు శ్రీహరికోట తరహా కేంద్రాన్ని ఈ రంగానికిక్కడ ఏర్పాటు చేయాలి. రానున్న రోజులలో దేశీయ అవసరాలకి, ప్రపంచవ్యాపితంగా కూడా పెరుగుతున్న డిమాండును దృష్టిలో ఉంచుకొని కావాల్సిన చిప్స్‌ తయారీకి ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కారిడార్‌ను ఏర్పాటు చేయాలి.
శ్రమకు (మానసిక, శారీరక) ప్రోత్సాహమిస్తే, పెట్టుబడి అందుకు తోడయితే రాష్ట్ర అభివృద్ధికి చక్కని నమూనా అవుతుంది. యువత ఉన్నత భవిష్యత్తుకు తోడ్పడే ప్రత్యా మ్నాయ విధానాల కోసం పోరాడాలి.

vsr

 

 

 

 

 

 

 

 వ్యాసకర్త సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు