Aug 02,2023 20:36

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ఎన్‌సిసి డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ విఎం రెడ్డి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ బుధవారం జరిగింది. రాష్ట్రంలో 60 వేలమంది ఎన్‌సిసి క్యాడెట్లు వున్నారని సిఎంకు విఎం రెడ్డి వివరించారు. రాష్ట్రంలో ఎన్‌సిసి విస్తరణకు ఎక్కువ అవకాశాలు వున్నాయని, ప్రభుత్వం నుండి సహకారం అందించాలని కోరారు. అలాగే ఎన్‌సిసి అందించే సేవలపై చర్చించారు. ప్రతి జిల్లాలో ఎన్‌సిసి దళాలు విపత్తులు ఎదురైనప్పుడు సేవలు అందించేందుకు సిద్ధం చేసి వుంచుతామని తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థులకు సమర్ధవంతమైన శిక్షణ అందించేందుకు వీలుగా సెంట్రల్‌ ట్రైనింగ్‌ అకాడమీ ఏర్పాటు చేస్తే అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం సమకూరుస్తుందని సిఎం తెలిపారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ వింగ్‌ క్యాడెట్ల శిక్షణ అందించాలని కోరారు. సమావేశంలో ఎన్‌సిసి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కల్నల్‌ సంజరు గుప్తా, గ్రూప్‌ కమాండర్‌ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.