May 15,2023 11:12
  • అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్‌
  • డౌనూరులో ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు ప్రయత్నం

ప్రజాశక్తి- అనకాపల్లి ప్రతినిధి : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు గిరిజన ప్రాంతంలో పండిస్తోన్న కాఫీకి అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గిరిజనుల నుంచి సేకరించే కాఫీ పరిమాణం పెంచాలనే, దానికయ్యే ప్రాసెసింగ్‌ ఖర్చును తగ్గించుకోవాలనే యోచనలో గిరిజన సహకార సంస్థ (జిసిసి) ఉంది. పాడేరు ఏజెన్సీలో గిరిజన రైతులు పండిస్తున్న కాఫీని భవిష్యత్తులో ఎక్కువ మొత్తంలో సేకరించేందుకు ప్రణాళికలు రూపొందించింది. గతేడాది (2022-23) ప్రయివేటు వ్యాపారుల కంటే ఎక్కువ ధర చెల్లించింది. ఎక్కువ పరిమాణంలో కాఫీని కొనుగోలు చేసింది. మంచి ఫలితాలు సాధించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 150 టన్నుల కాఫీని సేకరించిన జిసిసి 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.20 కోట్ల విలువైన వెయ్యి టన్నులు కొనుగోలు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో పాడేరు ఏజెన్సీలోని ఆర్గానిక్‌ కాఫీకి మంచి డిమాండ్‌ ఉంది. దీంతో, గిరిజనులకు చెల్లించే ధర పెంచి కొనుగోలు చేసినా, జిసిసి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. గత ఏడాది పార్చుమెంట్‌ కాఫీ కిలోకు రూ.285, చెర్రీ కాఫీ కిలోకు రూ.145 చొప్పున చెల్లించింది. రూ.20 కోట్ల టర్నోవర్‌తో సాధించిన కోటిన్నర లాభంలో రూ.50 లక్షలు వరకు సిఎస్‌ఆర్‌ కింద కాఫీ గింజలు ఆరబెట్టుకోవడానికి టార్పాలిన్లను గిరిజనులకు అందజేయాలని ఆలోచిస్తోంది.
 

                                                                          కొత్త ప్రయత్నాలు

కాఫీ ప్రాసెసింగ్‌కు పెడుతున్న ఖర్చును తగ్గించుకొనేందుకు డౌనూరులో ఇంటిగ్రేటెడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను పెట్టేందుకు జిసిసి ప్రయత్నిస్తోంది. ప్రాసెసింగ్‌, రోస్టింగ్‌, గ్రైండిగ్‌ చేయడం ద్వారా ప్రాసెసింగ్‌ ఖర్చు తగ్గించుకోవడానికి ప్రణాళికలు రూపొందించింది. కాఫీకి మార్కెట్లో మంచి ధర, మరింత నాణ్యమైన కాఫీని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. యూనిట్‌ ఇక్కడ ప్రారంభిస్తే స్థానిక గిరిజనులకు ఉపాధి లభిస్తుంది. బెంగళూరులో ప్రాసెసింగ్‌ చేయాల్సిన అవసరం ఉండదు. తద్వారా ఖర్చు తగ్గించుకోవాలని, కాఫీ పండిస్తున్న గిరిజనులకు లాభాలను వివిధ రూపాల్లో ఇవ్వాలని జిసిసి యోచిస్తోంది. ఎరువులు ఉపయోగించకుండా పండిస్తున్న కాఫీకి జిసిసి ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ ఇస్తోంది. ఇప్పటివరకు చింతపల్లి మండలంలోని 2,210 ఎకరాలు, జికె.వీధి మండలంలోని 3,435 ఎకరాల్లో కాఫీని సాగు చేస్తున్న 1300 మంది రైతులకు చొప్పున ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ ఇచ్చింది.
 

                                                                   త్వరలో ప్రాసెసింగ్‌ యూనిట్‌

డౌనూరులో ఐదెకరాల స్థలంలో నాలుగు కోట్ల విలువైన కాఫీ ఇంటిగ్రేటెడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను వీలైనంత తొందరగా ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాం. ఈ యూనిట్‌ వల్ల కాఫీ గ్రేడింగ్‌లో మరింత నాణ్యత పెరిగి అంతర్జాతీయ మార్కెట్లో కాఫీకి గిరాకీ పెరుగుతుంది. జిసిసికి ప్రాసెసింగ్‌ ఖర్చు తగ్గుతుంది. వచ్చిన లాభాలను కాఫీ రైతుల అవసరాలకు వినియోగించవచ్చు.
                                                                                            - జి.సురేష్‌ కుమార్‌, జిసిసి ఎమ్‌డి