Sep 08,2022 06:38

భూమిని కౌలుకు తీసుకొని సాగుచేస్తున్నా, సాగుదారుగా గుర్తింపు లేకపోవటం వలన కౌలుదారులు రైతుగా పొందవలసిన
ఏ మేలు అందుకోలేకపోతున్నారు. కౌలు ఒప్పందాలన్నీ నోటి మాట మీదే ఇప్పటికీ జరుగుతున్నాయి. కౌలు రైతులు భూమి సాగుచేస్తున్నా పంట రుణాలు, రైతు బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీలు, పంట నష్ట పరిహారం-ఇలా రైతులకు అందే ఏ సహాయం వారికి అందడంలేదు. కౌలు కాగితమో, రికార్డులలో పేరో ఉంటేనే ఏ మేలైనా వారికి దక్కేది. నకిలీ విత్తనాలు, ప్రకృతి బీభత్సాలు, గిట్టుబాటు ధర లేకపోవడం మొదలైన అంశాల వలన కౌలు రైతులూ నష్టపోతున్నారు. సొంత భూమి కలిగి సేద్యం చేస్తున్న వారికయ్యే సగటు ఖర్చులతో పోల్చితే కౌలుదారులకు రెట్టింపు పెట్టుబడి అవుతుంది.
భారతదేశంలో 60 శాతం పైగా జనాభాకు ప్రధాన ఆధారమైన వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నది. గత మూడు దశాబ్దాలుగా అమలు జరుగుతున్న ఆర్థిక సంస్కర ణలు వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని ఊబిలోకి నెట్టాయి. అనేక రాష్ట్రాలలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోవటం, సబ్సిడీలలో కోత, గిట్టుబాటు ధర లభించక పోవటం, నీటిపారుదల రంగంపై నిర్లక్ష్యం మొదలగు అంశాల న్నీ సంక్షోభాన్ని తీవ్రతరం చేశాయి. ఈ రెండు దశాబ్దాలలో విస్తృతంగా పెరిగిన కౌలురైతాంగం కూడా ఎటువంటి రక్షణ లు లేక తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నది. స్వంత భూమి కలిగిన రైతులే సేద్యం లాభసాటిగా లేక సంక్షోభం ఎదుర్కొం టుంటే, కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా రూపొందింది.
ఆంధ్రప్రదేశ్‌లో 26 జిల్లాలలో సుమారు 35 లక్షల మంది కౌలు రైతులు ఉంటారని అంచనా. పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు వంటి జిల్లాలలో 70 శాతం సాగుభూమిని కౌలురైతులే పండిస్తున్నారు. భూమిని కౌలుకు తీసుకొని సాగుచేస్తున్నా, సాగుదారుగా గుర్తింపు లేకపోవటం వలన సాగుదార్లుగా పొందవలసిన ఏ మేలు అందుకో లేకపోతున్నారు. కౌలు ఒప్పందాలన్నీ నోటి మాట మీదే ఇప్పటికీ జరుగుతున్నాయి. కౌలు రైతులు భూమి సాగుచేస్తున్నా పంట రుణాలు, రైతు బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీలు, పంట నష్ట పరిహారం-ఇలా రైతులకు అందే ఏ సహాయం వారికి అందడంలేదు. కౌలు కాగితమో, రికార్డులలో పేరో ఉంటేనే ఏ మేలైనా వారికి దక్కేది. నకిలీ విత్తనాలు, ప్రకృతి బీభత్సాలు, గిట్టుబాటు ధర లేకపోవడం మొదలైన అంశాల వలన కౌలు రైతులుా నష్టపోతున్నారు. సొంత భూమి కలిగి సేద్యం చేస్తున్న వారికయ్యే సగటు ఖర్చులతో పోల్చితే కౌలుదారులకు రెట్టింపు పెట్టుబడి అవుతుంది. కొన్ని ప్రాంతాలలో, కొన్ని పంటలకు భూయజమానికి కౌలు ముందే చెల్లించవలసి ఉంటుంది.
కౌలురైతు - సామాజిక ఆర్థిక కారణం
సాగునీటి పారుదల ప్రాంతాలలోని పెద్ద రైతులు 1970, 80 దశకాలలో వ్యవసాయ రంగంలో హరిత విప్లవం వలన లబ్ధి పొంది ఆపై అధిక లాభసాటైన వ్యవసాయేతర రంగాలకు వలసపోయారు. ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో అనేక మంది రైతులు సాగును వదిలి ఇతర రంగాలకు మళ్లి, భూములను కౌలుకు ఇచ్చారు. రైతుబిడ్డలు చదువుకుని తమ గ్రామంలో కాకుండా విదేశాలలో, పెద్దపెద్ద నగరాలలో స్ధిరపడి తమ భూములు కౌలుకు ఇస్తున్నారు. ఆదాయపు పన్ను మినహాయింపు తదితర కారణాల వలన కొంతమంది సంపన్నులు స్థిరాస్తులుగా భూములు కొనుగోలు చేసి కౌలుకిస్తున్నారు. కౌలు రైతులలో 80 శాతం వెనుకబడిన తరగతులు, దళిత కుటుంబాలకు చెందిన వారే. ఈ సామాజిక కోణాన్ని విశాల దృక్ప థంతో రాజకీయ పార్టీలు, ప్రభుత్వం, అధికారులు అర్థం చేసుకోవాలి.
గ్రామాల్లో చిన్న, సన్నకార రైతులు, భూమి లేని వ్యవసాయ కూలీలు, పేదలు వ్యవసాయమే దిక్కుగా ఈ భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. వ్యవసాయాన్ని వదిలేస్తున్న భూ యాజమానుల నుండి సొంత భూమిలేని రైతులు, కూలీలు కూడా పొలాలను కౌలుకు తీసుకొని సేద్యం చేస్తున్నారు. పట్టా భూము లున్న రైతులకన్నా కౌలుదారుల సంఖ్య క్రమేణా పెరుగుతున్నది. మొత్తం సాగుభూమిలో 50 శాతంపైగా కౌలుదారులే సాగు చేస్తున్నారని వ్యవ సాయ శాస్త్రవేత్తలు నిర్వహించిన అనేక అధ్యయ నాలు వెల్లడి చేస్తున్నాయి. అయితే కౌలు రైతులకు ఎటువంటి హక్కులు లేకపోవడంవలన వీరికి బ్యాంకు రుణాలు లభించలేదు. కౌలు రైతుల కోసం ప్రత్యేక చట్టాలు చేయవలసిన అవసరం ఏర్పడింది.
2011-అధీకృత సాగుదారుల చట్టం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి ప్రభుత్వం కౌలు రైతుల కోసం 2011లో అధీకృత సాగుదారుల చట్టం ఆమోదించి, అమలు చేసింది. ఈ చట్టం ప్రకారం కౌలు రైతులకు ఎల్‌ఇసి కార్డులు ఇచ్చి, లక్ష రూపాయల వరకు రుణం ఇచ్చే అవకాశం బ్యాంకర్లకు ఉన్నది. ఎల్‌ఇసి కార్డు ఉన్నప్పుడే రుణం పొందడానికి, ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా నష్ట పరిహారం పొందడానికి అర్హులు అవుతారు. కాని ఆచరణలో రుణ అర్హత కార్డులు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయి. ఈ చట్టం ద్వారా 2011లో 5 లక్షల మందికి, 2012లో నాలుగు లక్షల మందికి, 2016లో 4 లక్షల మందికి, 2018-19లో ఆరు లక్షల మందికి రుణ అర్హత కార్డులు ఇచ్చారు. వీరిలో 40 శాతం మందికి మాత్రమే బ్యాంక్‌ల ద్వారా రుణాలు లభించాయి. ఈ రుణాలు కూడా ఎక్కువ భాగం జాయింట్‌ లైబిలిటీ గ్రూపుల ద్వారా ఇచ్చారు. ఎక్కువ సందర్భాలలో భూ యజమాని అప్పటికే ఆ భూమిపై రుణం పొంది ఉండడం వలన బ్యాంక్‌ అధికారులు కౌలు రైతుకు పంట రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఆ రుణాలు కూడా ఎకరానికి సగటున 5 వేలకు మించి ఇవ్వలేదు. చట్టం అమలుపై చిత్తశుద్ధి లోపించటం, రాజకీయ సంకల్పం లేకపోవడం, బ్యాంకర్ల భయా లు మొదలగు అంశాల వలన 2011-అధీకృత సాగుదారుల చట్టం తగిన ఫలితాలు ఇవ్వలేదు.
2019-కౌలు రైతుల చట్టం
వై.ఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం పాత చట్టాలను రద్దు చేసి 2019-కౌలు రైతుల చట్టం చేసింది. ఈ చట్టం వలన కౌలు రైతు పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లు అయింది. భూ యజమాని సంతకం తప్పనిసరి చేస్తూ చట్టంలో నిబంధనలు విధించటంతో సమస్య జటిలమైంది. భూ యజమానులు సంతకం పెట్టకపోవడంతో అధికారులు సిసిఆర్‌సి కార్డులు మంజూరు చేయడం లేదు. రాష్ట్రంలో దాదాపు 35 లక్షల మంది కౌలు రైతులు ఉండగా, ఈ సంవత్సరం 5,74,000 కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని, ఇప్పటకీ రాష్ట్రం మొత్తం 3 లక్షల కార్డులు మాత్రమే ఇచ్చారు. ఉదాహరణకు గుంటూరు విడిపోయిన జిల్లాలో లక్షమందికి పైగా కౌలు రైతులు ఉండగా 37,228 మంది రైతులకు సిసిఆర్‌సి కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటివరకు 12,418 కార్డులు మంజూరు చేయడం జరిగింది. రైతు భరోసాలో కూడా కౌలు రైతులకు అన్యాయం జరుగుతున్నది. భూమిలేని ఒ.సి కౌలు రైతులకు రైతుభరోసా ఇవ్వడం లేదు. ఈ సంవత్సరం కార్డు లేని కౌలు రైతులకు 'ఇ-క్రాపింగ్‌' కూడా చేయడం లేదు. దీని వలన కౌలు రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. సిసిఆర్‌సి కార్డులను భూ యజ మానులు తమ బంధువులకు, స్నేహితులకు, అను చరులకు ఇప్పిస్తున్నారు. వాస్తవంగా కౌలు చేస్తున్న వారిలో కొద్ది మందికే సిసిఆర్‌సి కార్డులు ఇస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం చేసిన కౌలుదారుల రక్షణ చట్టం ఘోరంగా విఫలమైంది. చట్టంలో అనేక నిబంధనలు మార్చాలి.
కౌలురైతులు - వివిధ కమిటీలు
1.
మారిన పరిస్థితులలో భూ యాజమాన్య హక్కులకు భంగం వాటిల్లకుండా భూకమతాల గరిష్ట పరిమితికి లోబడి కౌలుదారీ చట్టాన్ని చేయాలని, కౌలు రైతులకు బ్యాంక్‌ రుణాలతో సహా అన్ని సౌకర్యాలు అందించాలని... 2016లో ఆంధ్రప్రదేశ్‌లో సమ్మిళిత, సుస్థిర వ్యవసాయ అభివృద్ధి కోసం వేసిన ప్రొఫెసర్‌ రాధాకృష్ణ కమిషన్‌ చెప్పింది.
2. దేశంలో వ్యవసాయ భూమి కౌలులో సమత్వం, సమర్థత లక్ష్యంగా కౌలు చట్టాలు రూపొందించాలని...నీతి ఆయోగ్‌ ప్రొఫెసర్‌ టి.హక్‌ నేతృత్వంలో నియమించిన కమిటీ...అన్ని రాష్ట్రాలకు సూచించింది. వీరి సూచనల ప్రకారం కౌలు వలన భూమిపై యాజమాన్య హక్కులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. కౌలుదారు బ్యాంక్‌ రుణం, ఇతర రాయితీలు పొందవచ్చు.
3. వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వ్యవసాయంపై నియమించిన ప్రొఫెసర్‌ జయతీ ఘోష్‌ కమిషన్‌ కౌలురైతుల రక్షణకు అనేక సూచనలు చేసింది. ప్రభుత్వం వాటిని అధ్యయనం చేయాలి.
4. కౌలురైతుల గురించి వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులు అమలు జరపాలి.
రాష్ట్రంలో ఏం జరగాలి?
ఆంధ్రప్రదేశ్‌లో సాగు 70-80 శాతం కౌలురైతులపై ఆధార పడి ఉన్నది. కౌలు రైతులకు ప్రభుత్వం న్యాయం చేయ టం లేదు. గుంటూరు జిల్లాలో గత నాలుగు సంవత్సరాలలో ఆత్మ హత్యలు చేసుకున్న రైతులలో 90 శాతం కౌలురైతులే. కౌలు రైతులకు న్యాయం జరగాలంటే దిగువ అంశాలను పరిశీలించాలి.
1. కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి రాజకీయ సంకల్పం కావాలి. ప్రధాన రాజకీయ పార్ట్లీలు కౌలు రైతు సమస్యల పట్ల నిబద్ధత కలిగి ఉండాలి.
2. కౌలు రైతుల సమస్యలను సామాజిక కోణం నుండి దళిత, వెనుకబడిన తరగతుల రైతాంగానికి న్యాయం చేయటంగా చూడాలి.
3. 2019 కౌలు రైతు చట్టాన్ని సవరించాలి. కౌలు రైతులందరికి రైతు భరోసా ఇవ్వాలి.
4. భూయాజమాని సంతకం అవసరమనే నిబంధన తొలగించాలి.
5. గ్రామ సచివాలయాల ద్వారా కౌలు రైతులను గుర్తించి, సిసిఆర్‌సి కార్డులు ఇవ్వాలి.
6. భూమిని కౌలుకు ఇచ్చిన భూ యాజమానికి బ్యాంకు రుణం ఇవ్వకుండా చట్ట సవరణ చేయాలి.
7. కౌలు రైతాంగం కోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయి లో, జిల్లా స్థాయిలో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.

ks laksman rao

 

 

 

వ్యాసకర్త శాసనమండలి సభ్యులు కె.యస్‌.లక్ష్మణరావు,
సెల్‌ : 9440262072 /