Feb 05,2023 06:29

'150 ఏళ్ల కిందట అయితే సతీ సహగమన ఆచారం మేరకు నేను కూడా నా భర్త చితిని ఎక్కాల్సి వచ్చుండేది' అన్నారు తొలి భారతీయ మహిళా ఇంజనీరు అయ్యలసోమయాజుల లలిత. 1964లో జరిగిన మొదటి 'విమెన్‌ ఇంజనీర్స్‌ సొసైటీ' సమావేశంలో ఆమె ఈ మాట అన్నారు. ఈ మాటలో 'హమ్మయ్య... నేను ఆ కాలంలో లేను కాబట్టి బతికిపోయా' అన్న భావన వుంది. ఈ సమావేశం జరిగి... సుమారు అరవై ఏళ్లు. 'ఆకాశంలో సగం... అవనిలో సగం... అంతరిక్షంలో సగం' అన్న ఆకాంక్ష అవకాశాలలో శూన్యంగా మారింది. జనాభాలో సగభాగంగా వున్న వారి కంఠశోష... నినాదాలకే పరిమితమైంది. మగ పిల్లలకు పుట్టినరోజునాడు కార్లు, రోబో బొమ్మలు, భవన నిర్మాణ సెట్స్‌ బహుమతి ఇస్తే...ఆడపిల్లలకు మాత్రం పుట్టిన రోజునాడు వంటపాత్రల సెట్స్‌, బుట్టబొమ్మలు వంటివి ఇస్తుంటారు. మనకు తెలియకుండానే మనలో అంతర్లీనంగా లింగ వివక్ష ప్రవహిస్తూనే వున్నది. అంతరిక్షానికి వెళ్లినా... పాలించే సత్తా వున్నా... వంటగది వారసత్వం మాత్రం నత్త నెత్తి మీది గూడులా వెన్నంటే వస్తోంది. 'సిపాయినై తుపాకి చేతపట్టి/ దేశరక్షణకు సమిధను కావాలని వుంది/ ఆకాశంలోని నక్షత్రాలను నేలకు దింపి/ చీకటి బతుకుల్లో వెలుగులు నింపాలని వుంది' అంటారు డాక్టర్‌ వాసా ప్రభావతి.
సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌ మరియు మ్యాథమెటిక్స్‌ (స్టెమ్‌) రంగాలు జాతీయ ఆర్థిక వ్యవస్థలకు కీలకమైనవైనప్పటికీ, ఇప్పటివరకు చాలా దేశాలు, వాటి అభివృద్ధితో సమానంగా 'స్టెమ్‌'లో లింగ సమానత్వాన్ని సాధించలేకపోయాయి. ఐరాస నివేదిక ప్రకారం.. భారత్‌లోని స్టెమ్‌ నిపుణుల్లో కేవలం 14 శాతం మాత్రమే మహిళలు వుంటే, వైజ్ఞానిక పరిశోధనా రంగంలో ప్రపంచ వ్యాపితంగా మహిళలు 30 శాతం కంటే తక్కువగా ఉన్నారు. ఇస్రో వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో కూడా మహిళలు 8 శాతానికి మించి లేరు. ఇక అటువంటి సంస్థలకు నేతృత్వం వహించే డైరెక్టర్లుగా, ఛైర్‌పర్సన్స్‌గా మహిళలను ఊహించలగమా? పురస్కారాలు, ప్రోత్సాహాల విషయంలో కూడా మహిళల పట్ల చిన్నచూపే. సైన్స్‌ నోబెల్‌ బహుమతి గెలుచుకున్నవారిలో పట్టుమని 20మంది కూడా మహిళలు లేరు. ప్రతిష్ఠాత్మకమైన సైన్సు అకాడమీ ఫెలోషిప్పుల్లో సైన్సును వృత్తిగా ఎంచుకుని దీటైన పరిశోధనలు చేస్తున్న మహిళా శాస్త్రవేత్తలు వున్నప్పటికీ వారు గుర్తింపునకు నోచుకోవడంలేదు. స్త్రీ-పురుషుల మధ్య సమానత్వం 2030 నాటికి సాధించాలనే లక్ష్యాన్ని భారత్‌ చేరుకునే అవకాశం లేదని ఐరాస మహిళల విభాగం యూఎన్‌ విమెన్‌ తాజాగా అంచనా వేసింది. పరిస్థితులు ఇప్పటిలాగే కొనసాగితే మహిళలకు వ్యతిరేకంగా చట్టాల్లో కనిపిస్తున్న వివక్షను తొలగించడానికి, సమానత్వాన్ని సాధించడానికి 268 ఏళ్లు పడుతుందని 'యూఎన్‌ విమెన్‌' తాజా నివేదిక వెల్లడించింది.
శాస్త్ర సాంకేతిక రంగాల్లో లింగ వివక్ష తొలగించాల్సిన అవసరం ఉంది. అవకాశం ఇవ్వాలేగాని తాము ఎవ్వరికీ తీసిపోరని, కృషిలో, మేధస్సులో అగ్రగామిగా నిలుస్తారని- ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా ముందుకు నడిచి విజయాలు సాధించిన మహిళా శాస్త్రవేత్తల జీవితాలు మనకు చెబుతున్నాయి. స్త్రీలకు వైజ్ఞానిక రంగ అవసరం ఎంత వుందో... అంతకంటే ఎక్కువగా వైజ్ఞానిక రంగానికి వారి అవసరం ఉంది. ప్రపంచంలో సగభాగం వున్న మహిళలు, బాలికలకు సమాన ప్రాతినిధ్యం లేకుండా సైన్సే కాదు... ఏ రంగమూ పురోగమించలేదు. స్త్రీ పురుష సమానత్వం సమాజంలో వారి హక్కు. 'విద్య నేర్చిన వివేకవతినై/ అసెంబ్లీ పార్లమెంటుల్లో అడుగుపెట్టి/ చట్టాలను సవరించి అన్యాయాన్ని ఉరితీసి/ దేశంలో కొత్త సంస్కారం విరజిమ్మాలని వుంది' అంటారు ఓ రచయిత్రి. కోవిడ్‌తో పాటు క్లిష్టమైన వాతావరణ సంక్షోభంతో ప్రపంచం పోరాడుతూనే వుంది. ఈ సమయంలో మహిళలు, బాలికల సమాన భాగస్వామ్యం, నాయకత్వం చాలా అవసరం. అందులో భాగంగానే ఫిబ్రవరి 11ను 'సైన్స్‌లో మహిళలు, బాలికల అంతర్జాతీయ దినోత్సవం' నిర్వహిస్తున్నారు. అయ్యలసోమయాజుల లలిత తెగువ, ధైర్యం నేటి మహిళకు స్ఫూర్తి పథం కావాలి. పరిశోధనలు, ఆవిష్కరణల్లో మహిళల సహకారాన్ని గుర్తించి మూస పద్ధతులను పగులగొట్టి, సైన్స్‌లో మహిళలు, బాలికల పట్ల వివక్షను ఓడించాలి.