బహిరంగ సభల్లో మాట్లాడడం రాజకీయ కార్యకలాపాలలో ఒక భాగం. రాహుల్ గాంధీ బహిరంగ సభలో చేసిన ప్రసంగంలోని కొన్ని మాటలను పట్టుకుని ఆయనపై క్రిమినల్ పరువు నష్టం దావా వేసి రెండేళ్లు జైలు శిక్ష పడేలా చేశారు. నేడు రాహుల్ విషయంలో జరిగినట్టే రేపు ఎవరికైనా జరగొచ్చు. పరువు నష్ట నేరంగా పరిగణించే వలస పాలకుల కాలం నాటి పరువు నష్ట చట్టం, ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద రెండేళ్ళ జైలు శిక్షతో ఆరేళ్లపాటు ప్రతినిధులను అనర్హులుగా ప్రకటించవచ్చు. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛను భయానకంగా మారుస్తుంది.
1860లో రూపొందించబడిన భారతీయ పరువు నష్టం చట్టాన్ని ఎవరిపైనైనా ప్రయోగించడం బ్రిటిష్ కాలంలో కన్నా ఘోరంగా మారింది. సూరత్‌లో ఒక మేజిస్ట్రేట్ ఒక పార్లమెంటేరియన్‌ను పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఎంపీ సభ్యత్వానికే అనర్హుడిగా ప్రకటించేందుకు వీలు కల్పించేలా గరిష్ట శిక్ష విధించారు. అటువంటి న్యాయాధికారుల కొరత లేని దేశంలో, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అస్థిరపరిచేలా పరువునష్టాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించకూడదు.
2016లో, వాక్ స్వాతంత్య్రానికి ఆటంకం కలిగించే పరువు నష్టాన్ని నేరంగా పరిగణించడాన్ని తొలగించాలన్న డిమాండ్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పిటిషనర్లలో సుబ్రమణ్య స్వామి, అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. దీపక్ మిశ్రా, పి.సి.పంత్‌లతో కూడిన ధర్మాసనం రాజ్యాంగ ధర్మాసనానికి వదిలేయాల్సిన అంశంపై పెద్దగా ప్రాధాన్యం లేకుండా నిర్ణయం తీసుకుందన్న విమర్శలు వచ్చాయి. శ్రీలంక కూడా పరువు నష్టాన్ని నేరంగా పరిగణించని సమయంలో భారత సుప్రీంకోర్టు ఇటువంటి తిరోగమన వైఖరి తీసుకుంది. ప్రజాస్వామ్యానికి జీవనాడి అయిన వాక్ స్వాతంత్య్రాన్ని వ్యక్తి గౌరవం పరిరక్షణ పేరుతో పరిమితులు విధించారు. పరువు నష్టం పౌర చట్టం ప్రకారం పరిష్కరించబడుతుంది కాబట్టి పరువు నష్టాన్ని నేరంగా పరిగణించరాదన్న డిమాండ్ సహేతుకమైనది.
హెన్రీ VIII కోర్ట్ ఆఫ్ స్టార్ ఛాంబర్ అధికార ధిక్కారాన్ని నిరోధించడానికి అపవాదు క్రిమినల్ నేరాన్ని ప్రవేశపెట్టింది. బ్రిటిష్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం అధికారాన్ని అగౌరవపరచడం దేశద్రోహం. మన న్యాయ వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా ఉండాలంటే, దేశద్రోహం, పరువు నష్టం వంటి పురాతన నేరాలను శిక్షాస్మృతి నుండి తొలగించాలి.
2019లో లోక్‌సభకు ఎన్నికైన వారిలో 30 శాతం మంది అవినీతి, హత్య వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారున్నారని సర్వేలు తెలియజేస్తున్నాయి. వాక్య నిర్మాణంలో లోపం వల్ల రాహుల్ గాంధీని క్రిమినల్ పరువునష్టం కేసులో ఇరికించి ఆయనను పదవీచ్యుతుణ్ణి చేశారు. అంతకన్నా దారుణమైన విషపూరితమైన ప్రకటనలు చేసినవారిపై చట్టపరమైన ఎలాంటి చర్యలు ఉండవు. విమర్శను, హాస్యాన్ని నేరంగా పరిగణించే ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ గాంధీకి విధించిన శిక్ష అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రజాస్వామ్య ప్రపంచ సూచీలో అవమానకరంగా అట్టడుగున ఉన్న భారతదేశ స్థాయిని మరింత తగ్గించడానికి ఇటువంటి చర్యలు దోహదం చేస్తాయి.
నేరం, శిక్ష సరిపోలాలి. రాహుల్ గాంధీ విషయంలో ఒక స్పష్టమైన లక్ష్యంతో నేరం తీవ్రతకు మించిన శిక్ష విధించబడింది. ప్రజాప్ర తినిధులకేే ఇటువంటి పరిస్థితి దాపురిస్తే, ఇక సామాన్యుల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించు కోవచ్చు. ఎం.ఎఫ్. హుస్సేన్, ఖుష్బు అనవసరంగా పరువు నష్టం కేసుల్లో చిక్కుకున్నారు. ఖుష్బుపై వివిధ కోర్టుల్లో 23 కేసులు దాఖలయ్యాయి. ఒక వ్యాఖ్య కారణంగా నేను ఐదు కోర్టులలో పరువు నష్టం కేసును ఎదుర్కొంటున్నాను. తుది తీర్పు కంటే ప్రతివాదిగా కోర్టుల ద్వారా వెళ్లడం బాధాకరమైన అనుభవం.
పీనల్ కోడ్ నుంచి ఆర్టికల్ 499ని తొలగించాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ...తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయారు. తన తండ్రి ప్రధానిగా ఉన్నప్పుడు పరువు నష్టం చట్టం పరిధిని పెంచే ఎత్తుగడ జరిగింది. బోఫోర్స్‌పై నిప్పులు చెరిగిన తర్వాత రాజీవ్ గాంధీ తనను తాను రక్షించుకోవడానికి, ప్రెస్‌ను తటస్థీకరించడానికి కనుగొన్న మార్గం. లోక్‌సభలో విపక్షాలు బలంగా ఉండటంతో బిల్లును ఆమోదించినప్పటికీ, దానిని ఉపసంహరించుకున్నారు. రాజీవ్ గాంధీ అపఖ్యాతి పాలైన తపాలా బిల్లు విషయంలోనూ అదే జరిగింది.
అనుసరించే వారే కాదు, తవ్వే వారు కూడా ఒక్కోసారి గోతిలో పడిపోతుంటారు. అనర్హత వేటు తీర్పు తక్షణం అమల్లోకి రాకుండా ఆర్డినెన్స్‌ను చించివేసిన వ్యక్తి రాహుల్ గాంధీ. అప్పటి చట్టం ఉంటే రాహుల్ గాంధీకి ఈ గతి ఉండేది కాదు.
పొరపాటున నోరు జారడం వల్ల వచ్చిన సమస్య ఇది. ఈ లోపం తీవ్రమైన సంక్షోభాన్ని కలిగించకూడదు. ఏం జరుగుతుందోనని భయపడకుండా మాట్లాడగలగాలి. ప్రాణాలకు రక్షణ, ఆస్తులకు రక్షణ మాదిరిగా పోలీసు స్టేషన్, క్రిమినల్ కోర్టుల్లో ప్రతిష్టను కాపాడలేం. ఎవరైనా చెప్పిన దాని ఆధారంగా పరువు పోగొట్టుకున్నారని ఆరోపించిన వారు గౌరవ మూల్యం చెల్లించి సివిల్ కోర్టును ఆశ్రయించాలి.
ప్రజాప్రతినిధులకు వర్తించే అనర్హత చట్టంలోని అసమంజసమైన కఠినత్వాన్ని తగ్గించడమే కాకుండా వాక్ స్వాతంత్య్ర ప్రయోజనాలను కాపాడేందుకు కూడా ఇది అవసరం. అమెరికాలో పరువు నష్టం నేరం కాదు. బ్రిటన్‌లో లిఖిత పూర్వకంగా వున్నది తప్ప మౌఖికంగా వున్నది నేరపూరితం కాదు.
కోర్టు ఆదేశాలను అనుసరించి అనర్హత అంటే తెలిసిన విషయమే. కానీ రాహుల్ గాంధీ విషయంలో తొందరపాటున జరిగింది. రాహుల్ గాంధీని నిష్పక్షపాత న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించే అవకాశం ఉన్న కేసులోనే ఆయనకు శిక్ష పడింది. మేజిస్ట్రేట్ తొందరపాటు దేశ వ్యవహారాలను ప్రభావితం చేయకూడదు.
అనర్హతకు కారణం నేరం కాదు శిక్షే. ముప్పై రోజుల పాటు శిక్షపై స్టే విధించారు. ప్రస్తుతం అమలులో లేని శిక్ష కారణంగా రాహుల్ గాంధీ అనర్హుడయ్యారు. అనర్హత వేళ రాష్ట్రపతి ఎన్నికల సంఘంతో సంప్రదించి నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేయాలి. స్పీకర్ గానీ, లోక్‌సభ సెక్రటేరియట్ గానీ పట్టించుకోవడం లేదు. స్పీకర్ లేని అధికారాన్ని వినియోగించుకున్నారు. పార్లమెంటు కార్యకలాపాల్లోకి చొరబడిన ఫాసిస్ట్ వైరస్ లక్షణమిది.

వ్యాసకర్త : సెబాస్టియన్ పాల్ పార్లమెంటు మాజీ సభ్యుడు










