Dec 27,2022 09:38
  • వ్యయమే కారణమంటున్న బ్యాంకర్లు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : సేవలను విస్తరిస్తున్నామని ఒకవైపు చెబుతూనే మరోవైపు ప్రజలకు అవసరమైన ఎటిఎం (ఆటోమేటెడ్‌ టెల్లర్‌ మిషన్‌)లను బ్యాంకులు గణనీయంగా తగ్గిస్తున్నాయి. గత ఏడాది మార్చి లో రాష్ట్ర వ్యాప్తంగా 10,330 ఎటిఎంలు ఉరడగా, ప్రస్తుతం 10,091కి పడిపోయింది. అంటే ఒకటిన్నర సంవత్సరంలోనే 239 తగ్గిపోయినట్లు తేలింది. 2019 మార్చి నాటికి రాష్ట్రంలో 9,600 ఎటిఎంలు ఉన్నాయి. అప్పటి నుంచి గతేడాది మార్చి వరకు పెరుగుతూనే ఉన్నాయి. ఆ తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టడం ప్రారంభమైంది. ఈ ఏడాది మార్చికి 10,187 ఎటిఎంలు ఉండగా, జూన్‌ నాటికి 10,095 సెప్టెంబర్‌ నాటికి 10,091 ఉన్నట్లు లెక్క తేలింది. ఇలా తగ్గిపోవడానికి బ్యాంకర్లు అనేక కారణాలు చెబుతున్నారు. ప్రధానంగా నిర్వహణ భారం పెరిగిపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎటిఎం సక్రమంగా పనిచేయాలంటే ఎసి తప్పనిసరి. 24/7 ఎసి పనిచేయాలంటే విద్యుత్‌ బిల్లుల భారం పెరుతోందని వారు అంటున్నారు. సెక్యూరిటీ గార్డుల నియామకం కూడా భారంగానే ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం అనేక ఎటిఎంలను సెక్యూరిటీ గార్డులు లేకుండానే నిర్వహిస్తున్నారు.ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ నగదు లావాదేవీలు గణనీయంగా పెరిగిపోయాయి. 10 రూపాయల కన్నా ఎక్కువగా జరిగే చెల్లింపులను కూడా ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యాప్‌ల ద్వారానే చెల్లిస్తున్నారు. మధ్య తరగతి ప్రజలు కూడా చేతిలో నగదు ఉంచుకోవడం తగ్గించి వేశారు. ఎటిఎంల సంఖ్య తగ్గించడానికి ఇదీ ఒక కారణంగా చెబుతున్నారు.