
పరుచూరి గోపాలకృష్ణ శిష్యుడు, 'లాంగ్ లాంగ్ ఎగో' అనే డైలాగుతో గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటుడు రమణారెడ్డి. ఆయన పలు చిత్రాల్లో నటించారు, దర్శకత్వం కూడా చేశారు. తాజాగా ఆయన తెరకెక్కించిన సినిమా 'డెడ్‌లైన్'. ఈ సినిమాలో తన పేరును బొమ్మారెడ్డి వి.ఆర్.ఆర్. అని తెరమీద వేసుకుంటున్నారు. అజయ్ ఘోష్, అపర్ణా మాలిక్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని తాండ్ర గోపాల్ నిర్మించారు. సోమవారం హీరోయిన్ విజయశాంతి 'డెడ్‌లైన్' టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు రమణారెడ్డి నటుడిగా ఉన్నప్పటి నుండి తనకు పరిచయమని, అతనితో కలిసి కొన్ని సినిమాల్లో నటించానని ఆమె అన్నారు. ప్రస్తుత కాలంలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక అకృత్యాల నేపథ్యంలో చక్కటి సందేశంతో, డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఈ మూవీని తెరకెక్కించినట్లు బొమ్మారెడ్డి వి.ఆర్.ఆర్ తెలిపారు.