న్యూయార్క్ : అనేక ఆహార ఉత్పత్తుల్లో చక్కెర స్థానంలో వాడుతున్న కృత్రిమ తీపి పదార్ధాల వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) హెచ్చరించింది. పైగా ఇవి బరువు తగ్గడానికి ఏ విధంగానూ దోహదపడవని తెలిపింది. ఇందుకు సంబంధించి సోమవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అందుబాటులో వున్న సాక్ష్యాధారాలను సమీక్షించిన మీదట ఈ కృత్రిమ తీపి పదార్ధాలు పిల్లల్లో గానీ పెద్దల్లో గానీ బరువును తగ్గించడంలో ఎలాంటి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇవ్వబోవని స్పష్టం చేసింది. పైగా వీటిని దీర్ఘకాలికంగా వాడడం వల్ల కార్డియోవాస్కులార్ వ్యాధులు, టైప్ టూ డయాబెటిన్ ముప్పు బాగా పెరుగుతుందని హెచ్చరించింది. పెద్దల్లో మరణానికి కూడా దారి తీస్తుందని పేర్కొంది. డైట్ సోడా, కాఫీ వంటి వాటిల్లో లక్షలాదిమంది వీటిని వాడుతున్నారని, కానీ దీర్ఘకాలంగా వాడడం వల్ల ఆరోగ్యపరంగా ఏ మేరకు మంచిదనేది వివాదాస్పదమైన అంశంగా వుంది. సాధారణ చక్కెర స్థానంలో కృత్రిమ తీపి పదార్ధాలను ఉపయోగించడం బరువు తగ్గడానికి ఏ మాత్రమూ ఉపయోగపడదని పోషకాహార, ఆహార భద్రతా విభాగ డైరెక్టర్ ఫ్రాన్సెస్కో స్పష్టం చేశారు.










