Jan 22,2023 07:22
  •  రబీలో వింత పరిస్థితి శ్రీ అంతర్జాతీయంగా ధరలు తగ్గుముఖం
  •  సబ్సిడీలకు కేంద్రం కోత పెడుతుందన్న భయం
  • సరఫరాను డౌన్‌సైజ్‌ చేస్తున్న కంపెనీలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఎరువుల విషయంలో రబీలో వింత పరిస్థితి నెలకొంది. నిల్వలు దండిగా ఉన్నాయని ఒక వైపు ప్రభుత్వం చెబుతుండగా ఇంకో వైపు అదనుకు రైతులకు కావాల్సిన ఎరువు అందుబాటులో ఉండట్లేదు. రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె)లో తగినంతగా అన్ని ఎరువుల నిల్వలూ ఉన్నాయని చెబుతుండగా, క్షేత్ర స్థాయిలో చాలా చోట్ల అందుకు పూర్తి భిన్నంగా నిల్వలు నిండుకున్నాయి. రబీ పంటల సాగు జనవరి మూడోవారం పూర్తయినా ఏమంత పుంజుకోలేదు. ఈ మారు సేద్యం ఆలస్యమైంది. ఇప్పటికి 56 శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. పంటల సాగు అస్తుబిస్తుగా ఉండగా ఎరువులకు కటకట ఏర్పడటం కొత్త ధోరణి.

  • రాయితీ తగ్గిస్తే నష్టం

కరోనా ప్రభావంతో రెండేళ్ల నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ఉత్పత్తికి ఉపయోగించే ముడి వస్తువుల ధరలు పెరిగాయి. మన దేశం చాలా మట్టుకు ముడిసరుకులను, డిఎపి వంటి ఎరువుల్లో ఎక్కువ భాగాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. మన ప్రభుత్వ, సహకార సంస్థల్లో ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆ సంస్థల సామర్ధ్యాన్ని తగ్గించి, మూసేసిన వాటిని తెరవకుండా, కేంద్ర ప్రభుత్వం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది. దాంతో ఎరువుల ధరలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ధరలకనుగుణంగా కేంద్రం సబ్సిడీలు భరించట్లేదు. ఒక్క యూరియాకే ఒక మేరకు సబ్సిడీ, ధరల నియంత్రణ ఉంది. డిఎపికి ఒక స్థాయిలో సబ్సిడీ కొనసాగిస్తోంది. కాంప్లెక్స్‌లకు పోషకాధారిత సబ్సిడీ (ఎన్‌బిఎస్‌) అమలు చేస్తూ, పెరిగిన ధరలతో సమానంగా కాకుండా ఎప్పటికప్పుడు నిష్పత్తి కొలతల ఆధారంగా రాయితీ నిర్ణయిస్తోంది. సబ్సిడీలను కంపెనీలకు నేరుగా ఇవ్వకుండా నగదు బదిలీ (డిబిటి) తెచ్చి ఏ రోజు అమ్మకాలకు ఆ రోజు సబ్సిడీ నిధులను కంపెనీలకు జమ చేస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ధరలు తగ్గుముఖం పట్టడంతో ఎరువుల ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయని, ఏప్రిల్‌ నాటికి ఇప్పుడున్న ధరల కంటే తగ్గుతాయని మార్కెట్‌ అంచనాలున్నాయి. ధరలు తగ్గడంతో కేంద్రం తానిచ్చే సబ్సిడీలను తగ్గించుకునే అవకాశం ఉంది. అధిక ధరలకు దిగుమతి చేసుకొని, ఉత్పత్తి చేస్తే, ఒకవేళ ప్రభుత్వం సబ్సిడీ తగ్గిస్తే, తాము నష్టపోవాల్సి వస్తుందని కంపెనీలు సరఫరాను తగ్గిస్తున్నాయని తెలుస్తోంది. అందుకే కృష్ణపట్నం, కాకినాడ, ఇత్యాది పోర్టుల్లో నిల్వలు పెట్టి కూడా సరిగ్గా సరఫరా చేయట్లేదని సమాచారం.

  • ఆర్‌బికెలదో సమస్య

ఆర్‌బికెలలో ఎరువులు విక్రయిస్తున్నారు. ప్రతి కేంద్రంలో కనీసం 5 టన్నుల స్టాక్స్‌ ఉండాలని నిర్దేశించారు. కాగా ఎపి మొత్తం ఎరువుల వినియోగంలో ఆర్‌బికెలలో అమ్మేది మహా అయితే 10-20 శాతం. యూరియా కేటాయింపుల్లో ఎక్కువ వాటా ఆర్‌బికెలు తీసుకోవడంతో ప్రైవేటు వ్యాపారులు గుర్రుగా ఉన్నారు. డిఎపి, కాంప్లెక్స్‌ ధరలు పెరగడంతో రైతులు ఏదోక ఎరువు వేయాలని తక్కువకు లభించే యూరియా బాట పడుతున్నారు. ఇంతకాలం కంపెనీల ఒత్తిడితో ఏ ఎరువుకు డిమాండ్‌ ఉంటే దానికి అవసరం లేకపోయినా ఇతర ఎరువులను కంపెనీలు రైతులకు బలవంతంగా అంటగడుతున్నాయి. యూరియాకు డిమాండ్‌ ఉండటంతో ఇతర ఎరువులను లింక్‌ పెట్టి లాభాలు సంపాదించాలని చూస్తున్నాయి. ప్రభుత్వం ఆర్‌బికెలలో యూరియా అమ్ముతుండటంతో ఎరువులకు కృత్రిమ కొరత సృష్టించి రేట్లు పెంచేస్తున్నారు. ఇదిలా ఉండగా, పై నుంచి సరైన పర్యవేక్షణ లేక ఆర్‌బికెలలో డిబిటి సరిగ్గా నడవట్లేదు. అమ్మకాల తాలూకు అమౌంట్‌ మార్క్‌ఫెడ్‌కు సకాలంలో చేరట్లేదు. దాంతో కంపెనీలు ఆర్‌బికెలకు ఎరువులను సరిగ్గా సరఫరా చేయట్లేదు.