ఏలూరు: ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ బకాయిలు తక్షణం విడుదల చేయాలని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు కోరారు. ఏలూరులోని ఏపీ ఎన్జీవోల సమావేశంలో పాల్గన్న ఆయన మాట్లాడారు. ఆగస్టు 21, 22 తేదీల్లో విజయవాడలో జరిగే 21వ కౌన్సిల్ సమావేశాల్లో ఉద్యోగులందరూ పాల్గని జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు సరిపోక ఇబ్బందులు పడుతున్నారన్నారు.వారి వేతనాలు పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీకల్లా పింఛన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఓపీఎస్ వచ్చే వరకు ఏపీ ఎన్జీవో ఉద్యమిస్తుందని తెలిపారు. గతంలో నుంచి ఉద్యోగుల కౌన్సిల్ సమావేశాలకు ముఖ్యమంత్రులు హాజరు కావడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్, మంత్రులు ఈ సమావేశానికి హాజరుకానున్నట్టు బండి శ్రీనివాసరావు తెలిపారు.










