- పలు సాకులతో 10,432 మందికి నో
- ఇకెవైసి, ఆధార్ అనుసంధానంలో సమస్యలు
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : వైఎస్‌ఆర్ మత్స్యకార భరోసా పథకం కింద 2023-24 ఆర్థిక సంవత్సరంలో అందించనున్న పరిహారానికి అర్హుల ప్రాథమిక జాబితా సిద్ధమైంది. గత నెల 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజులపాటు సముద్రంలో చేపల వేటను నిషేధిస్తూ ప్రభుత్వం గత నెల ఆరున ఉత్తర్వులు జారీ చేసింది. వేట నిషేధ సమయంలో ఒక్కో మత్స్యకారునికి రూ.పది వేలు చొప్పున పరిహారం అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 17న ఎన్యుమరేషన్ (గణన) చేపట్టారు. మత్స్యకారుల నుంచి వివరాలు సేకరించిన అధికారులు... ప్రభుత్వం పేర్కొన్న నిబంధనల పేరిట వడపోత ప్రక్రియ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,37,033 మంది చేపల వేటలో ఉన్నట్లు గుర్తించారు. వారిలో 10,432 మందిని అనర్హులుగా గుర్తించారు. పలురకాల వెరిఫికేషన్ల అనంతరం ప్రాథమికంగా 1,26,601 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో 1,21,616 మంది బ్యాంకు ఖాతాలు మాత్రమే మనుగడలో ఉన్నాయి. ప్రస్తుతం వీరికి మాత్రమే పరిహారం అందనుంది.
ఏటా మాదిరిగానే ఈ సంవత్సరమూ మత్స్యకారులకు పూర్తి స్థాయిలో పరిహారం అందే అవకాశాలు కనిపించడం లేదు. బ్యాంకు ఖాతాలకు ఆధార్ నంబరు అనుసంధానం కాకపోవడం, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ)లో వీరి వివరాలు సరిగా నమోదు కాకపోవడంతో తిరస్కరణకు గురవుతున్నాయి. ప్రస్తుతం అర్హులుగా గుర్తించిన 1,26,601 మందిలో 9,031 మంది వివరాలు నమోదు కాలేదు. దీన్ని గుర్తించిన అధికారులు మత్స్యకారులను బ్యాంకులకు తీసుకెళ్లి వారితో ఎన్‌పిసిఐ ప్రక్రియ చేయించాలని మత్స్యశాఖ, సచివాలయ సిబ్బందికి సూచించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలోనూ ఇకెవైసి, ఎన్‌పిసిఐ సమస్యలతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2,500 మంది మత్స్యకారులకు నేటికీ వారి ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. దీంతో, ఈ సంవత్సరమైనా తమకు డబ్బులు వస్తాయో లేదోనన్న ఆందోళన వారిలో నెలకొంది.
చేపల వేటలో ఉన్నా అనర్హులే
వైఎస్‌ఆర్ మత్స్యకార భరోసా అందించేందుకు ప్రభుత్వం పలు మార్గదర్శకాలను సూచిస్తూ గత నెల ఆరున ఉత్తర్వులు వెలువరించింది. వీటిలో ప్రధానంగా వేట సాగించే వారు 18 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలని సూచించింది. ఇందులో 50 ఏళ్లు దాటిన వారికెవరికీ భరోసా ఇవ్వడం లేదు. సముద్రంలో చేపల వేటతో మత్స్యకారులకు చూపు మందగించడంతో 2018 నుంచే వారికి 50 ఏళ్లకే పింఛను అందిస్తున్నారు. ప్రభుత్వం మిగతా 2లో అమలు చేస్తున్న ఏ సంక్షేమ పథకం ద్వారా లబ్ధి పొంది ఉండకూడదని పేర్కొంది. మత్స్యకార పింఛను ప్రభుత్వం సంక్షేమ పథకం కిందకే రావడంతో అటువంటి మత్స్యకారులను వేటలో ఉన్నా అనర్హులను చేసింది. వీటితోపాటు రేషన్ కార్డు పొందేందుకు ఉన్న అర్హతలనే మత్స్యకార భరోసాకు ప్రామాణికంగా తీసుకుంది.
మే మూడో వారంలో చెల్లింపు
చేపల వేట నిషేధ పరిహారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 17న ఒకేసారి ఎన్యుమరేషన్ చేపట్టారు. డేటాను క్రోడీకరించి ప్రాథమికంగా అర్హుల జాబితాను రూపొందించి అభ్యంతరాల కోసం గత నెల 29న సచివాలయాల్లో ప్రదర్శించారు. అభ్యంతాలను మత్స్య శాఖాధికారులు బుధవారం స్వీకరించి తుది జాబితాలను రూపొందించి కలెక్టర్ల ఆమోదం తర్వాత ప్రభుత్వానికి నివేదించనున్నారు. రాష్ట్ర స్థాయిలో జాబితాలను పరిశీలించిన తర్వాత మత్స్యకారుల వేలిముద్రలు తీసుకోనున్నారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత మే మూడో వారంలో మత్స్యకారుల ఖాతాలో డబ్బులు జమ చేయనున్నట్లు సమాచారం.










