Jul 08,2023 22:26

ప్రజాశక్తి-అమరావతి : వాహనాలకు బీమా ప్రీమియం డబ్బు చెల్లించిన మరుక్షణమే ప్రమాద బీమా అమలవుతుందని హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రీమియం సొమ్ము చెల్లించిన కొద్ది గంటల్లోనే ప్రమాదం జరిగిందని చెప్పి ప్రమాద బీమా డబ్బు చెల్లించబోమంటే కుదరదని జస్టిస్‌ డి వెంకట రమణ తీర్పు చెప్పారు. ప్రీమియం అందుకున్న వెంటనే ఫలానా తేదీన బీమా చేసినట్లు ఉంటుందని, అంటే అదే క్షణం నుంచి ప్రమాద బీమా వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రీమియం డబ్బు చెల్లించిన తర్వాత రోజు నుంచి ప్రమాద బీమా అమలవుతుందంటూ యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ చేసిన వాదనను కొట్టేసింది. జి రత్నమ్మ అనే మహిళను నెల్లూరులో ఒక కారు 2000 సంవత్సరంలో ఢకొీంది. ఆమెకు రూ.30 వేలు పరిహారం చెల్లించాలని ట్రిబ్యునల్‌ 2004లో తీర్పు చెప్పింది. దీనిని బీమా కంపెనీ నెల్లూరు డిఎం హైకోర్టులో సవాల్‌ చేశారు. కారుకు బీమా చేసిన రోజునే రోడ్డు ప్రమాదం జరిగిందని, బీమా వర్తించేది ఆ తర్వాత రోజు నుంచేనని బీమా కంపెనీ చేసిన వాదనను హైకోర్టు కొట్టేసింది. ట్రిబ్యునల్‌ రూ.30 వేలుగా నిర్ణయించిన పరిహారాన్ని రూ.లక్షకు పెంచింది. ఈ మొత్తాన్ని కారు యజమాని, బీమా కంపెనీలు చెల్లించాలంది.