
- వాస్తవ పరిస్థితులకు దూరంగా సర్కారు ప్రకటన
- 300 మండలాలకు 103 గుర్తింపు
- చివరి క్షణం వరకు నాన్చుడు
- డెడ్‌లైన్ రోజు అర్థరాత్రి హడావుడిగా గెజిట్
- విమర్శల నుంచి తప్పించుకునేందుకే.. ప్రతిపక్షాలు, రైతుల తీవ్ర ఆగ్రహం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : రాష్ట్రాన్ని కరువు రక్కసి పీడిస్తుండగా కరువు మండలాలను ప్రకటించే విషయంలో ప్రభుత్వం పిసినారితనం ప్రదర్శించింది. కరువుకూ కోతలు పెట్టింది. సెప్టెంబర్‌తో ఖరీఫ్ ముగియగా, వెనువెంటనే కరువు మండలాల ప్రకటనపై కసరత్తు నిర్వహించాల్సిన సర్కారు కేంద్ర కరువు మాన్యువల్ ప్రకారం డెడ్‌లైన్ ముగిసే వరకు మీనమేషాలు లెక్కించింది. సమాచార సేకరణ, అంచనాలు రూపొందించడంలో ఆచితూచి వ్యవహరించింది. తీరా గడువు ముగిసే రోజు చివరి క్షణాన మంగళవారం అర్థరాత్రి ఏడు జిల్లాల్లోని 103 మండలాలను హడావుడిగా ప్రకటించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో గుర్తించిందే తక్కువకాగా వాటిలో కూడా తీవ్ర స్థాయి 80, మధ్యస్త స్థాయి 23 కింద వర్గీకరించింది. క్షేత్ర స్థాయిలో నెలకొన్న వాస్తవ పరిస్థితులకు, జిల్లా అడ్మినిస్ట్రేషన్ పంపిన నివేదికలకు, ప్రభుత్వ కరువు మండలాల ప్రకటనకు అస్సలు పొంతన లేదు. చివరి వరకు సమయం గడిపి, ముప్పేటా కరువు మండలాల గుర్తింపుపై ఆందోళనలు అధికమవడంతో హడావుడిగా ప్రకటన చేసినట్లు సమచారం. కరువు ప్రకటనపై ప్రతిపక్షాలు, రైతు సంఘాల ఆగ్రహంతో పాటు అధికారపార్టీ మంత్రులు, ఎంఎల్‌ఎలు, నేతల నుంచి సైతం అసంతృప్తి నెలకొంది. దాంతో మరో విడత కరువు మండలాలు ప్రకటిస్తారని ప్రభుత్వంలో చర్చ సాగుతోంది.
గడువు వరకు తాత్సారం
ఖరీఫ్‌పై ఎల్‌నినో ప్రభావం పడుతుందని, ఈ తడవ తక్కువ వర్షపాతం నమోదవుతుందని సీజన్ ప్రారంభం నుంచీ సంకేతాలున్నాయి. జులైలో 164 మండలాల్లో డ్రైస్పెల్ నెలకొందని అధికారిక నివేదికలు చెబుతున్నాయి. ఆగస్టులో వర్షాభావ సమస్య తీవ్రమైంది. ఆ నెలలో ఏకంగా 407 మండలాల్లో డ్రైస్పెల్స్ ఏర్పడ్డాయి. అప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు. ఇక సెప్టెంబర్‌లో 300 వరకు మండలాల్లో డ్రైస్పెల్స్ నెలకొన్నాయి. అక్టోబర్‌లో ఇంకా సమస్య తీవ్రమైంది. వ్యవసాయ, ఉద్యానవన పంటల సాధారణ సాగు విస్తీర్ణంలో 30 లక్షల ఎకరాలకు పైన సాగు లేక బీడు పడ్డాయి. వేసిన పంటల్లో చాలా మట్టుకు ఎండిపోయాయి. సాగునీటికి గ్యారంటీ ఉన్న కృష్ణా, పెన్నా డెల్టాలలో నీటి కొరతతో పంటలు ఎండాయి. నాగార్జునసాగర్ కాల్వల కింద కూడా అదే పరిస్థితి. విద్యుత్ కోతలు సరేసరి. అయినా ప్రభుత్వం వర్షాలు కురుస్తాయని, సగటు గణాంకాలతో సాధారణ పరిస్థితి నెలకొంటుందని ఆశగా ఎదురు చూసింది. వైసిపి వచ్చాక మొదటి రెండేళ్లూ ఒకింత వానలు బానే పడ్డాయి. నిరుడు మూడవ ఏట సుమారు 275 మండలాల్లో కరువు ప్రటించాలని జిల్లాల నుంచి అభ్యర్ధనలొచ్చినా ప్రకటించలేదు. ఈ సంవత్సరం కూడా అలానే చేద్దామనుకున్నారు. రైతు భరోసా, పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా, పంట రుణాలపై సున్నా వడ్డీ ఇస్తున్నప్పుడు కరువు ప్రకటన ఎందుకని వాదిస్తూ వచ్చారు. కరువు ప్రకటిస్తే అదేదో తమ సర్కారుకు ఓటమి, నామర్దా అన్నట్లు భావించింది. తమ పాలనలో పుష్కలంగా వానలు పడ్డాయని చెప్పి, ఎన్నికల ఏడాదిలో కరువును ప్రకటిస్తే రాజకీయంగా ఆత్మరక్షణలో పడతామని ఒకింత ప్రభుత్వం భయపడింది. సిపిఎం, వామపక్షాల, రైతు సంఘాల ఆందోళనలు, చివరి నిమిషంలో టిడిపి కరువుపై ప్రచారానికి పిలుపునివ్వడం, బెయిల్‌పై చంద్రబాబు విడుదల, ఈ కారణాలతో మంగళవారం అర్థరాత్రి హడావుడిగా గెజిట్ విడుదల చేసినట్లు తెలుస్తోంది.
శాస్త్రీయతపై అనుమానాలు
కరువు మండలాల గుర్తింపు విషయంలో ప్రభుత్వం పాటించిన నిబంధనలు, కొలబద్దల శాస్త్రీయతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించట్లేదని విమర్శలు మిన్నంటాయి. సిఎం సొంత జిల్లా కడపలో మొత్తం 36 మండలాలుండగా ఆగస్టులో 18 మండలాల్లో తీవ్ర డ్రైస్పెల్ ఉంది. సెప్టెంబర్‌లోనూ అదే పరిస్థితి కొనసాగింది. అయినా జిల్లాలో ఒక్క మండలం కూడా ప్రకటించలేదు. ఆది నుంచీ తిరుపతిలో దుర్భిక్షం ఉంది. మొత్తం 34 మండలాలుండగా డ్రైస్పెల్ మండలాలు 27 వరకు ఉన్నాయి. అక్కడా ఒక్క మండలమూ గుర్తించలేదు. రాష్ట్రంలోనే నెల్లూరులో తీవ్ర కరువుంది. నేడు కూడా 61 శాతం లోటు వర్షపాతం ఉంది. జిల్లాలో 38 మండలాలుండగా 31 డ్రైస్పెల్ మండలాలు. అక్కడా ఒక్క మండలం కూడా గుర్తించలేదు. ప్రకాశం, పల్నాడులోనూ అదే పరిస్థితి. పల్నాడులో మొత్తం మండలాలు ప్రకటించాలని జిల్లా యంత్రాంగం నివేదించగా ఒక్కటి కూడా గుర్తించలేదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్‌టిఆర్ జిల్లాల్లోని పలు మెట్ట మండలాల్లో తీవ్ర కరువుంది. కాగా సర్కారు గుర్తించిన వాటిలో అనంతపురం, కర్నూలు మాత్రమే కాస్తంత వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లా మొత్తం తీవ్ర కరువుండగా 32 మండలాలకుగాను 21 మండలాలను గుర్తించగా, వాటిలో 14 మధ్యస్త స్థాయిగా పేర్కొన్నారు. నంద్యాలలో తక్కువ మండలాలు ప్రకటించారని విమర్శలొస్తున్నాయి.
కరువు మండలాలపై పున:పరిశీలన చేయాలి : రైతు, కౌలురైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు
రాష్ట్ర వ్యాప్తంగా కరువు మండలాల ప్రకటనపై ప్రభుత్వం పున:పరిశీలన చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకరరెడ్డి బుధవారం ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం విస్మరించిన అన్ని మండలాలనూ కరువు మండలాలుగా ప్రకటించి తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాధాకృష్ణ, ఎం హరిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి సుబ్బారావు, వి వెంకటేశ్వర్లు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. కరువు మండలాల ప్రకటనపై పున:పరిశీలన చేయాలని కోరారు.
300 మండలాల్లో కరువు : సిపిఎం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో సుమారు 300 మండలాల్లో కరువు పరిస్థితులుంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 103 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడం పట్ల సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు బుధవారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. కరువుకు గురైన అన్ని మండలాలనూ కరువు మండలాలుగా ప్రకటించి, సహాయక చర్యలు చేపట్టాలని, కేంద్రం కరువు పరిశీలనా బృందాలను పంపి, ప్రకృతి వైపరీత్యాల నిధిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో 17 కరువు మండలాలు ఉంటే ఒక్క మండలాన్ని కూడా ప్రకటించలేదని తెలిపారు. ప్రకాశం జిల్లాలో 38 మండలాల్లో 30 మండలాలు కరువులో ఉన్నాయని, అయినా ఒక్క మండలాన్నీ ప్రకటించలేదని తెలిపారు. బాపట్ల జిల్లా అద్దంకి, కొరిశపాడు, బల్లికురవ, సంతమావులూరు, పంగులూరు, మార్టూరు వంటి ఆరు మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉంటే ఒక్క మండలాన్నీ కరువు మండలంగా ప్రకటించలేదని విమర్శించారు. ఏలూరు జిల్లాలో చింతలపూడి, చాట్రాయి, వేలేరుపాడు, కుక్కునూరు వంటి నాలుగు మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. మరొక ఏడు మండలాలు కరువు బారినపడ్డాయని తెలిపారు. అయినా గుర్తించలేదని విమర్శించారు. సత్యసాయి జిల్లాలో 31 మండలాల్లో కరువు ఉంటే 21 మండలాలనే ప్రకటించి 11 మండలాలను విస్మరించారని పేర్కొన్నారు. నెల్లూరులో 30 మండలాల్లో 20 మండలాల్లో కరువు ఉందని వివరించారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే కరువు మండలాల ప్రకటనకు రాష్ట్ర ప్రభుత్వం ఏం కొలబద్ద తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం విస్మరించిన అన్ని మండలాలనూ కరువు మండలాలుగా ప్రకటించి తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.