- కేంద్రం చర్య శ్రీ 2 నుంచి 1.5 శాతానికి తగ్గింపు
- బ్యాంకులకు భారం
- కో-ఆపరేటివ్స్, ఆర్‌ఆర్‌బిలపై ఎక్కువ
- వ్యవసాయ అప్పుల పంపిణీపై ప్రభావం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : రైతు రుణాలపై వడ్డీ రాయితీకి కేంద్రం కత్తెర పెట్టింది. ఆర్థిక సంస్థలకు చెల్లించే సబ్సిడీలో 0.5 శాతం తగ్గించింది. వడ్డీ రాయితీ కుదింపు వలన రైతులకు పంట రుణాలిస్తున్న బ్యాంకులపై ఆర్థిక భారం పడనుంది. బ్యాంకులపై భారం పడే సందర్భంలో అవి రైతులకు పంపిణీ చేసే రుణాలకు కోతలు పెట్టే అవకాశాలున్నాయి. ముఖ్యంగా రైతులకు రుణాలిచ్చే సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులపై వడ్డీ భారం పడుతుందని ఆయా సంస్థలు చెబుతున్నాయి. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో, నష్టాల్లో ఉన్న తమపై వడ్డీ భారం అదనమని వాపోతున్నాయి. మరోవైపు జాతీయ బ్యాంకులు సైతం వడ్డీ భారం మోయలేమంటున్నాయి.
ఇదీ నేపథ్యం
అధిక వడ్డీలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు రూ.మూడు లక్షల లోపు పంట రుణాలను ఏడు శాతం వడ్డీకే బ్యాంకుల నుంచి ఇప్పించాలని యుపిఎ-1 ప్రభుత్వం పాలసీగా పెట్టుకుంది. బ్యాంకులు 9 శాతం వడ్డీ వసూలు చేస్తుండగా రెండు శాతాన్ని బ్యాంకులకు కేంద్రమే రీయింబర్స్ చేస్తుంది. అప్పుడు 7 శాతానికి బ్యాంకులు రైతులకు రుణాలిస్తాయి. సకాలంలో రీపేమెంట్ చేసే రైతులకు మరో మూడు శాతం వడ్డీ రాయితీ ఇస్తుంది. ఏతావాతా నాలుగు శాతం వడ్డీకి రైతులకు పంట రుణాలందాలి. మన రాష్ట్రం రూ.లక్ష లోపు లోన్లకు ఆ నాలుగు శాతం వడ్డీ భరించడం వలన 'సున్నా' వడ్డీకి రుణాలందాలి. కాగా మోడీ ప్రభుత్వం తాజా పరిచిన వడ్డీ రాయితీ పథకం (మోడిఫైడ్ ఇంటరెస్ట్ సబ్వెన్షన్ స్కీం-ఎంఐఎస్‌ఎస్)ను తెచ్చింది. బ్యాంకులకు ఇంతవరకు కేంద్రం రీయింబర్స్ చేస్తున్న 2 శాతానికి బదులు 1.5 శాతమే రీయింబర్స్ చేస్తామంటోంది. 0.5 శాతం తగ్గించింది.
ఆ మేరకే మొన్న బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు చేసింది. దీని వలన నేరుగా రైతులపై భారం పడకున్నా ప్రభావం ఉంటుంది. ఇప్పటి వరకు బ్యాంకులకు కేంద్రం నుంచి అందే వడ్డీ రాయితీ తగ్గిపోతుంది. కేంద్రం తగ్గించిన అర శాతం వడ్డీ భారాన్ని బ్యాంకులే పెట్టుకోవాలి. ఆ వంకతో బ్యాంకులు రైతులకు పంట రుణాలు తగ్గించే అవకాశం ఉంది.
వాటిపై అధిక ప్రభావం
కో-ఆపరేటివ్స్, ఆర్‌ఆర్‌బిలకు వడ్డీ భారం ప్రభావం బాగానే ఉంటుందని సదరు బ్యాంకర్లు చెబుతున్నారు. ఉదాహరణకు ఆప్కాబ్, డిసిసిబిలు కలిసి ఏడాదికి రూ.20 వేల కోట్ల వరకు అప్పులి స్తాయి. కేంద్రం వడ్డీ రాయితీ అర శాతం తగ్గించడం వలన సుమారు రూ.50 కోట్ల వరకు సొంతంగా పెట్టుకోవాలని ప్రాథమిక అంచనా. ఆర్‌ఆర్‌బిలకూ ఇలాంటి పరిస్థితే ఉంటుందంటున్నారు. నాబార్డు రీఫైనాన్స్ చేసినా ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. అలాగే నాబార్డుపైనా ఇంటరెస్ట్ భారం పడుతుందని అభిప్రాయపడుతున్నారు. అసలే నష్టాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కో-ఆపరేటివ్స్, ఆర్‌ఆర్‌బిలకు వడ్డీ రాయితీ కుదింపు ఇబ్బందేనంటున్నారు. ఇప్పటికే కేంద్రం ఇస్తామన్న 2 శాతం వడ్డీ రాయితీ సకాలంలో విడుదల చేయట్లేదు. ఒక్కోసారి సంవత్సరాలు సైతం పడుతోంది. ఇప్పుడు ఇస్తానన్న రాయితీకే కోత పెట్టి బ్యాంకులపై ఆ భారాన్ని నెట్టి రైతులకు రూ.లక్షల కోట్లల్లో రుణాలిప్పిస్తామనడం చర్చనీయాంశమైంది.










