
'ఎటు చూసినా అందమే/ ఎటు చూసినా ఆనందమే/ చూసే కనులకు మనసుంటే/ ఆ మనసుకు కూడా కళ్లుంటే' అంటారు సినారె. చిన్న సెలయేరు కూడా గోదావరి అలలను తలపిస్తుంది. ప్రతి గరిక పూవు మందారంలా మురిపిస్తుంది. అందుకే అంటారో కవి... 'అందమే ఆనందం... ఆనందమే జీవిత మకరందం' అని. ప్రపంచం ఒక విజ్ఞాన భాండాగారం. ఒక సుందర సౌధం. ఏ ప్రాంతాన కాలుమోపినా... ఏ సుందర దృశ్యాన్ని వీక్షించినా... మనసు నిండా ఉత్సాహం పొంగిపొర్లుతుంది. నిత్యం ఊపిరి సలపని పనులతో మానసిక ఒత్తిడికి లోనయ్యేవారికి విహార యాత్రలు ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తాయి. యాంత్రికత నుంచి తనను తాను రిఫ్రెష్ చేసుకోవడానికి ఈ యాత్రలు ఒక మార్గం. ఆయా ప్రాంతాల్లో సంచరించడం ద్వారా ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని మూటగట్టుకోవచ్చు. కొత్త శక్తిని పుంజుకోవచ్చు. విజ్ఞానాన్నీ సమకూర్చుకోవచ్చు. 'లోకసంచారం చేయి నరుడా జీవితం ఇంకెక్కడుందీ?/ జీవితమింకా ఉంటే గింటే నవయవ్వన మింకెక్కడుందీ?' అంటూ ఒక ఫకీరు పాట విన్న పదకొండేళ్ళ పిల్లవాడికి ఆ పాట సారాంశం తలకెక్కింది. ఆ పిల్లవాడే బహుభాషావేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, యాత్రా సాహిత్య పితామహుడు రాహుల్ సాంకృత్యాయన్. ఆయన తన జీవితంలో 45 ఏళ్లపాటు యాత్రలలో గడిపిన లోకసంచారి. ఎక్కువ మంది తమ తమ జీవన విధానంలో యాత్రలను కూడా ఒక భాగం చేసుకుంటారు. విజ్ఞాన వినోద, వికాసాలను సముపార్జించుకుంటారు.
పర్యాటకం మనసుకు ఉల్లాసాన్ని, శరీరానికి కొత్త శక్తిని, మెదడుకు సరికొత్త విజ్ఞానాన్ని అందించే ఔషధం. అందుకే చాలా మంది ఏమాత్రం సమయం దొరికినా పర్యాటక ప్రాంతాలకు వెళుతుంటారు. కానీ, మహమ్మారి కరోనా వైరస్ వల్ల పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాల ఆంక్షలు వైరస్ భయంతో పర్యాటకులు సందర్శక ప్రాంతాలకు వెళ్లేందుకు పెద్దగా మొగ్గుచూపట్లేదు. దీంతో ప్రముఖ సందర్శక ప్రాంతాలన్నీ వెలవెలబోయాయి. ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశాన్ని పర్యాటకులకు దూరం చేసింది. ఒక ఊరిని... రాష్ట్రాన్ని... దేశాన్నే కాదు.. ఏకంగా ప్రపంచాన్నే వణికించింది. ఇప్పుడు పర్వాలేదని చెబుతున్నప్పటికీ, ఇంకా సాధారణ స్థితి నెలకొనలేదని వాస్తవ పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. టూరిజం వల్ల కొన్ని వెనకబడిన ప్రాంతాలు, ప్రకృతి రమణీయత గల ప్రాంతాలు స్థానిక వనరులు లేకపోయినప్పటికీ, టూరిజం వల్లనే ఎంతోకొంత అభివృద్ధి చెందుతున్నాయి. ప్రస్తుతం పర్యాటకరంగం... ప్రపంచ రూపురేఖల్నే మార్చేసింది. ప్రపంచంలో చిన్నచిన్న దేశాలు, రాష్ట్రాలు పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ...తమ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకుంటున్నాయి. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (డబ్లుటివో) లెక్కల ప్రకారం... 'ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన ఆర్థిక రంగాలలో పర్యాటకం ఒకటి. ఇది భూమిపై ఉన్న ప్రతి పది మందిలో ఒకరికి ఉపాధి కల్పిస్తుంది. కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోంది'.
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నెలకొన్న అనేక చారిత్రక ప్రదేశాలు, మ్యూజియంలు, సాంస్కృతిక సంపద, పురాతన ప్రార్థనా స్థలాలు, జలపాతాలు, ప్రకృతి సౌందర్యాలు దేశ చరిత్రకు ఆనవాళ్లు. అలాంటి సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతి తరానికీ గుర్తుచేసే పండుగ రోజు 'ప్రపంచ పర్యాటక దినోత్సవం'. ప్రతి యేడాది ఒక థీమ్‌తో ఈ రోజును ఘనంగా నిర్వహిస్తారు. అదే క్రమంలో ఈ ఏడాది 'పర్యాటకం గురించి పునరాలోచన' అనే థీమ్‌ను ఎంపిక చేసింది డబ్లుటివో. ఈ పునరాలోచన... కోవిడ్‌తో ఏర్పడిన స్తబ్దతను తొలగించి, పర్యాటకాన్ని మరింత అభివృద్ధిపథం వైపు నడిపించేదిగా, సుస్థిరమైన ప్రోత్సాహాన్ని అందించేదిగా వుండాలి. అంతేగాని సంస్కృతి, సంప్రదాయాలను మంటగలిపేదిగా వుండకూడదు. ఇప్పటివరకూ ప్రజలకు అంతగా తెలియని గిరిజన పర్యాటకం, వ్యవసాయ పర్యాటకం, ఆతిథ్య రంగం వంటి అంశాలను కూడా ప్రోత్సహించాలి. మారుమూల ప్రాంతాలలో వున్న ప్రకృతి రమణీయతను పర్యాటకులు సందర్శించే విధంగా సౌకర్యాలు కల్పించాలి. తద్వారా పర్యాటక రంగం విస్తరిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టాలి. ఎంతో మందికి జీవనాధారం కల్పిస్తూ, కోటానుకోట్ల మందికి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, విజ్ఞానాన్ని అందిస్తున్న ఈ పర్యాటకం... ప్రజలకు మరింత చేరువ కావాలి.