
- పసుపు రైతుల సమన్వయ కమిటీ కన్వీనరు జొన్నా శివశంకర్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పసుపు రైతులకు పంటల బీమాలో ప్రభుత్వం మొండి చెయ్యి చూపించిందని, ఎకరాకు రూ.50 వేలు పంటల బీమా ఇవ్వాలని పసుపు రైతుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనరు జొన్నా శివశంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. పసుపు రైతుల సమస్యలు వర్ణనాతీతమని, సంవత్సరం అంతా పండించిన పంట దళారుల పాలు అవుతోందని పేర్కొన్నారు. పసుపుకు గిట్టుబాటు ధర రూ.6,700 చెప్పినా ఎక్కడా కొనలేదని తెలిపారు. క్వింటా రూ.4,500 నుంచి రూ.5,000కు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జూన్ 12 నుండి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రూ.6,700కు కొంటామన్నా అప్పటికే పసుపు అంతా దళారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని తెలిపారు. రైతులు సరుకును ఆర్‌బికె వద్దకు తీసుకెళితే సవాలక్ష ప్రశ్నలతో వెనక్కు పంపించారన్నారు. 2022 డిసెంబర్లో కురిసిన వర్షాల వల్ల పసుపు దిగుబడి తగ్గిందని, 30 నుండి 30 క్వింటాళ్లు రావాల్సిన పసుపు 15 నుండి 20 క్వింటాళ్లలోపే వచ్చిందని వివరించారు. పంట చేతికొచ్చిన తరువాత ఆరబెడితే మే, జూన్ నెలలో కురిసిన వర్షాలకు తడిచి ఎర్రబారిందని చెప్పి రూ.3,000 నుండి రూ.3,500కు కొనుగోలు చేశారని తెలిపారు.
ఎకరాకు రూ.1.70 లక్షలు నుండి రూ.రెండు లక్షల వరకూ రైతులు ఖర్చు పెడితే రైతుకు ఎకరాకు రూ.లక్ష మాత్రమే వచ్చిందని, రూ.70 వేల నుండి రూ.లక్ష వరకూ నష్టపోయారని వివరించారు. పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా పసుపుకు క్వింటాకు మద్దతు ధర రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు పంటల బీమా ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించినా అందులో పసుపు రైతులను విస్మరించారని పేర్కొన్నారు. వారికీ ఎకరాకు రూ.50 వేలు బీమా పరిహారం ఇవ్వాలని శివశంకరరావు డిమాండ్ చేశారు.