
మొట్టమొదటి సారిగా యూరో జోన్‌లో ద్రవ్యోల్బణం వార్షికరేటు రెండంకెలకు చేరింది. వినియోగదారుల ధరల సూచి ప్రకారం లెక్కించే ఈ రేటు ఆగష్టులో 9.1 శాతం వుంటే సెప్టెంబరు నాటికి పది శాతం దాటింది. ఇంధనం 41 శాతం, ఆహార ధరలు 13 శాతం పెరగడమే ఈ ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమైన మాట నిజమే. అయితే అవి మాత్రమే కారణం కాదు. ఇంకా అనేక సరుకుల ధరలు పెరుగుతున్నాయి. ఇంధనం, ఆహారం అనే ఈ రెంటినీ పక్కన పెట్టి చూసినా ఇతర సరుకుల ధరలు కూడా ఆగష్టులో 5.5 శాతం నుంచి సెప్టెంబరులో 6.1 శాతానికి పెరిగాయి. పైరెండుగాక ఇతర సరుకుల ధరలే మూడింట రెండు వంతులు ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమైనాయి. అందువల్ల ఉక్రెయిన్ యుద్ధంతో ఇంధనం, ఆహారం ధరలు పెరిగిన ఫలితంగానే ద్రవ్యోల్బణం పెరుగుదల వేగంగా జరిగిందనే కథనం నిజం కాదు.
మరో రెండు కారణాల వల్ల కూడా ఇది అవాస్తవమని చెప్పాల్సి వుంటుంది. పెరుగుదలలో ఈ వేగం ఉక్రెయిన్ యుద్ధానికి ముందే సంభవించింది. అంతకు ముందు కాలంతో పోలిస్తే 2017లో 1.3 శాతం, 2018లో 1.5 శాతం, 2019లో 1.3 శాతం, 2020లో -0.3 శాతం పెరుగుదల వుంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభానికి చాలా ముందే 2021లో 5 శాతం పెరిగింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం కావడానికి బాగా ముందే సంభవించిన ఈ పెరుగుదల సరుకుల కొరత వల్ల వచ్చింది ఎంతమాత్రం కాదు. లాభాలు బాగా పెంచుకోవడానికి వీలుగా ధరలను పైపైకి పెంచేసిన ఫలితమిది. కరోనా మహమ్మారి కారణంగా ఎదురైన స్తంభన నుంచి కోలుకుంటున్న పెట్టుబడిదారీ ప్రపంచంలో సరుకుల కొరత రానుందని ముందే వూహించి ధరలు పెంచిన పర్యవసానం ఇది. ద్రవ్యోల్బణంలో వేగవంతమైన ఈ పెరుగుదల కూడా యుద్ధం వల్ల ఏర్పడిన కొరత ఏదో రష్యాపై ఆంక్షల వల్ల మార్కెట్ నుంచి విడిపించుకునే ధరల ఉధృతికి ప్రతిబింబమేమీ కాదు. కొరతలను ముందే అంచనా కట్టి అధిక లాభాల కోసం ధరలు పెంచడం వల్ల ఎదురైన పరిస్థితి ఇది.
స్లోవేకియా అనుభవం
ఇది మరింత బాగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. స్లోవేకియా ప్రధానమంత్రి విద్యుత్ రేట్ల పెరుగుదలతో తమ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితికి చేరుకుందని హెచ్చరించారు. దేశంలో విద్యుత్ సరఫరాను జాతీయం చేయాల్సి వస్తుందని కూడా హెచ్చరించారని సెప్టెంబరు 28 ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక రాసింది. ఆ దేశానికి విద్యుత్ అందించే ప్రధాన సరఫరాదారు మిగులు విద్యుత్‌ను ప్రైవేటు వ్యాపారులకు విక్రయించాలని ఈ ఏడాది మొదట్లోనే నిర్ణయించారు. అయితే అలా కొన్న సరఫరా దారులు ఇప్పుడు తాము కొన్న ధరకు అయిదు రెట్లు అధికంగా చెల్లించాలని స్లోవేకియా ప్రభుత్వాన్ని అడుగు తున్నారు. ఈ మధ్య వ్యవధిలో మార్కెట్ విడుదల ధరలు అయిదు రెట్టు పెరిగిందేమీ లేదు. విపరీతమైన లాభార్జనా దాహం కోసం ఇంధన వ్యాపారులు ఎగబడటమే ఇందుకు ఏకైక కారణం.
వర్షాకాలం వచ్చేకోద్ది ఈ ద్రవ్యోల్బణం పెరుగుదల వేగం కొనసాగనున్నది. రానున్న మాసాల్లో ఈ రేటు ఇరవై శాతం దాటినా ఆశ్చర్యం లేదని కూడా కొందరు ఊహిస్తున్నారు. ఎందుకంటే డాలరుతో పోల్చితే అనేక వర్ధమాన దేశాల కరెన్సీ లాగే యూరో విలువ కూడా తగ్గిపోతోంది. అంతర్జాతీయ ధరలు డాలరులో లెక్క కడతారు గనక ఇది కూడా యూరప్‌లో ఇంధన ధరల పెరుగుదలకు కారణమవుతోంది. రష్యా నుంచి పశ్చిమ యూరప్‌కు గ్యాస్ చేరవేసే నార్డ్ స్ట్రీమ్1 పేల్చివేయబడింది. నిజానికి ఇది అమెరికా నిర్వాకమేనని చాలామంది భావిస్తున్నారు. చెప్పుకోవలసిందేమంటే ఈ పేల్చివేత తనకేదో మహదవకాశానికి తెర తీసిన ఘట్టంగా అమెరికా ఆనందపడటం! త్వరలోనే పరస్పర సరఫరాల పునరుద్ధరణ గురించి రష్యాతో ఒప్పందం కుదిరినా ఈ పేలుడు వల్ల ఆలస్యం తప్పకపోవచ్చు. ఇలాంటి నేపథ్యంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచుతుందనే అందరూ ముందే అనుకుంటున్నారు. ద్రవ్యోల్బణాన్ని నిరోధించే ఒక మార్గంగా అక్టోబరు 27న జరిగే సమావేశంలో ఈ నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నారు.
వడ్డీ రేట్లు పెంచితే ఏం లాభం?
అయితే ఇక్కడే అడగదగిన ప్రశ్న ఒకటి. వడ్డీ రేట్లు పెంచడం ఏ విధంగా ద్రవ్యోల్బణాన్ని నిరోధించ గలుగుతుంది? ద్రవ్యోల్బణం ఆధారంగా వేసుకున్న ముందస్తు అంచనాలను వమ్ము చేయాలంటే వడ్డీ రేట్లు పెంచవలసి వుంటుందని యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడు క్రిస్టిన్ లాగార్డే ప్రకటించారు. ద్రవ్యోల్బణం ఆధారంగా వేసుకున్న అంచనాలను వమ్ము చేయడంకోసం వడ్డీ రేట్లు పెంచడం ఒక మార్గమనేట్టయితే అప్పుడు అది మౌలికంగా సమస్య కారణాలను ఎదుర్కోవలసి వుంటుంది. నిజంగా ఇది ఎలా జరుగుతుంది? ఉద్యోగ కల్పనను పెంచడం ద్వారానే అన్నది ఈ ప్రశ్నకు తేలిగ్గా చెప్పదగిన జవాబు. సహజంగానే ఇంధన గిరాకీ తగ్గించడం వల్ల నిరుద్యోగం పెరుగుతుంది, దానితో ముడిపడి వుంటుంది కూడా.ముడిపడి వుండటమంటే అలాంటి తగ్గుదలకు అనుగుణమైన వాతావరణం సృష్టిస్తుంది. వడ్డీ రేటు పెరుగుదల ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులను తగ్గిస్తుంది. ఆ విధంగా ఇంధన గిరాకీని తగ్గించుతుంది. అంతేగాకుండా శ్రమజీవుల కొనుగోలుశక్తి పడిపోయేలా చేయడం ద్వారా ఇంధనంతో సహా అన్ని సరుకుల, సేవల డిమాండును కోత కోస్తుంది. ఆ విధంగా చూసేట్టయితే ఇంధన గిరాకీ తగ్గడం అనేది నిరుద్యోగానికి బొరుసు వంటిది. క్రిస్టిన్ లాగార్డే ఒప్పుకుంటున్నట్టుగా అది ద్రవ్యోల్బణ పోకడలకు అడ్డుకట్ట వేస్తుంది. అప్పడు దానివల్ల లాభాల శాతం పెంచుకోవాలని చూసేవారిని అదుపు చేస్తుంది.
ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో నిరుద్యోగం మరో విధమైన ప్రభావం కూడా చూపిస్తుంది. వేతన రేటు ఎంతైనా సరే కార్మికుల కొనుగోలు శక్తిని తగ్గించడంలో మొదటి ప్రభావం వుంటుంది. రెండవ తరహా ప్రభావం నేరుగా కార్మికుల వేతన రేటును తగ్గించడం ద్వారా వారి కొనుగోలు శక్తిని కోత కోయడం వల్ల జరుగుతుంది. ధరలు పెరుగుతుంటే కార్మికుల బేరసారాల శక్తి తగ్గించబడుతుంది. ధరల పెరుగుదలకు తగిన స్థాయిలో వారి నగదు వేతనాల పెంపుదలతో ఆదుకోవడం జరగదు.
పరస్పరం అంటుకుని వుండే ఈ రెండు ప్రభావాల నికర ఫలితమేమిటి? నిరుద్యోగం పెరుగుదల, ఆ విధంగా వారి కొనుగోలు శక్తి తగ్గించడం జరుగుతాయి. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి పెట్టుబడిదారీ విధానం అనుసరించే పద్ధతి ఇదే. ఇది కేవలం కార్మికవర్గాన్ని బలిపెట్టడం ద్వారా జరిగే పరిణామం. ఈ వాస్తవాన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికే ఉద్దేశించిందే వడ్డీరేట్ల ప్రహసనం. ఏదో వడ్డీరేట్ల పెంపుదల వల్లనే ద్రవ్యోల్బణంపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందనే మిథ్యాకథనం, వేతనాల కోతను కప్పిపుచ్చడం కూడా. ఇదంతా అనివార్యంగా జరగాల్సిందేననే అభిప్రాయం రుద్దబడుతుంది. తత్ఫలితంగా ఇది అన్ని ఆర్థిక వ్యవస్థలలోనూ జరిగి తీరాల్సినట్టు చెబుతారు. ఈ తతంగంలోని నిగూఢ రహస్యాన్ని మనం ఒకసారి ఛేదించగలిగామా, వెంటనే వడ్డీ రేట్ల పెంపు వాస్తవంలో చేసేది నిరుద్యోగాన్ని సృష్టించడమేనని తెలిసిపోతుంది. సోషలిస్టు వ్యవస్థలో గాని ఆఖరుకు లెక్కకు రాని తృతీయ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గాని నిరుద్యోగం ఉధృతిని తగ్గించడం ప్రధాన లక్ష్యంగా వుంటుంది. ధరల నియంత్రణ, సరుకుల రేషనింగు ద్వారా మాత్రమే ద్రవ్యోల్బణం వెనక్కు కొట్టబడుతుందని సుస్పష్టమవుతుంది.
యూరప్ కార్మికుల ప్రతిఘటన
ఇప్పుడు తీవ్రమైన ద్రవ్యోల్బణం కోరల్లో చిక్కిన యూరప్ షరామామూలుగా పెట్టుబడిదారీ తరహాలోనే దాన్ని అదుపు చేయాలని చూస్తోంది. అంటే శ్రామికులను ఫణం పెట్టచూస్తోంది. అక్కడ ఇటీవల ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణం అమెరికా పనుపున రష్యాపై విధించిన ఆంక్షలే. అంటే యూరోపియన్ కార్మికులను బలిపెట్టి అమెరికా రష్యాపై పోరాడుతున్నదన్నమాట. అమెరికా మహా సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని కాపాడ్డం అనే ఒకే కారణంతో మొదలైన యుద్ధానికి యూరోపియన్ కార్మికవర్గం మూల్యం చెల్లిస్తుందన్నమాట. వాస్తవానికి సైనిక పారిశ్రామిక వ్యవస్థ, నయా యుద్ధ మితవాదుల సిద్ధాంత భావజాలం ఈ యుద్ధానికి మరింత ప్రేరణనిస్తాయన్నమాట. హెన్రీ కిసింజర్ వంటి వ్యక్తి కూడా ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇవ్వడం అమెరికాకు తెలివైన పని కాబోదని చెప్పిన మాట గమనించడం అవసరం.
ఈ పూర్వ రంగంలో యూరప్‌లో వివిధ చోట్ల శ్రామికవర్గం ప్రతిఘటన పెంచడం సహజ పరిణామమే. అది కేవలం వారికే పరిమితం కాలేదు కూడా. నార్డ్ 2 గ్యాస్ పైప్‌లైన్‌ను తెరవాలని జర్మనీలో వేలాది మంది కదం తొక్కారు. రష్యా సైనాలు ఉక్రెయిన్ లోకి చొచ్చుకు పోయినప్పుడు ఈ పైప్‌లైన్‌ను మూసివేశారు. చెక్ రాజధాని ప్రేగ్‌లో ఈ సెప్టెంబరు లోనే నాటోకు వ్యతిరేకంగా రెండు సందర్భాల్లో పదుల వేలమంది ప్రదర్శన చేశారు. తమ దేశం సైనికంగా తటస్థంగా వుండాలని వారు నినదించారు. అయితే ఈ ప్రదర్శనలు జర్మనీ బ్రిటన్ వంటి ప్రధాన దేశాలలో వేళ్లూనుకున్న పార్టీలపై ఎలాంటి ప్రభావం చూపించ లేకపోవడం దారుణమనిపిస్తుంది. మితవాద పార్టీల మాట అటుంచి సోషల్ డెమోక్రాట్లు ఆఖరుకు పూర్వపు కమ్యూనిస్టు పార్టీల వారసత్వంతో పుట్టిన పార్టీలు కూడా అమెరికాకు మద్దతుగా నిలిచిన తమ ప్రభుత్వాలకు వంత పాడుతున్నాయి. నిజానికి బ్రిటన్ లేబర్ పార్టీ మహాసభలో ఒకే ఒక ప్రతినిధి ఉక్రెయిన్‌కు విచక్షణా రహితంగా మద్దతివ్వడం సరికాదని చెప్పారు. కానీ తనను మాట్లాడనివ్వకుండా కేకలు వేసి కూచోబెట్టడమేగాక పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. యూరప్‌లో రాజకీయ పార్టీలు తమ దేశాల శ్రామికవర్గ ప్రజానీకాన్ని పూర్తిగా వదిలేయడం వల్ల నయా ఫాసిస్టు పార్టీలే ప్రయోజనం పొందడం ఆశ్చర్యం కలిగించదు.
ప్రభాత్ పట్నాయక్