
భారత రిజర్వ్ బ్యాంకు ఈ నెల 8 నుండి 10వ తేదీ వరకు చేపట్టిన ద్రవ్య సమీక్షలో కీలక రేట్లను యథాతథంగా ఉంచుతూనే ఆర్థిక వృద్ధి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ పాత్ర గురించి ఎప్పటి మాదిరిగానే ఆశావహంగా పేర్కొనడం సత్యదూరంగా ఉంది. రోజువారీ జీవితానుభవంలో ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందంటూ గొప్పలు చెప్పారు. అయితే, బ్యాంకుల నుండి పరపతికి నోచుకోని లేదా బ్యాంకు మెట్లు పదే పదే ఎక్కి దిగితే తప్ప పరపతి పొందలేని వారిని, స్వల్ప మొత్తాల రుణ గ్రహీతలను, ఇల్లు, వాహనం తదితర వ్యక్తిగత రుణాలు తీసుకునేవారి గురించి పట్టించుకున్నట్టు కనిపించింది. దాని వెనుక మర్మమేమిటో, సంబంధిత నిబంధనలు, మార్గదర్శకాలు ఎలా ఉంటాయో అవి ఆచరణలో ఎలా అమలుకు నోచుకుంటాయో వేచి చూడాల్సిందే! ప్రాధాన్యతారంగ రుణాలు, అందులో పంట రుణాలు, దళితులు, గిరిజనులు తదితర బలహీన వర్గాల వారికి మంజూరు చేయాల్సిన నిష్పత్తి వంటి అంశాలను రిజర్వు బ్యాంకు ఘనంగా పేర్కొన్నా ఆచరణ దిగదుడుపేనన్నది జగమెరిగిన సత్యం.
ద్రవ్య నియమాల్లో కీలకమైన రెపో రేటు 2020 మే నుండి రెండేళ్లపాటు 4 శాతం వద్ద స్థిరంగా ఉండగా 2022 మేలో 4.4 శాతానికి, అప్పటినుండి ప్రతి మూడు నెలలకూ ఎంతో కొంత పెంచుతూ ఈ ఏడాది ఫిబ్రవరికి దాన్ని 6.5 శాతానికి తీసుకెళ్లారు. కేవలం పది నెలల కాలంలోనే ఇంత భారీగా అంటే సుమారు మూడింట రెండు వంతుల పెరుగుదల అసాధారణం. గతంలో ఎన్నడూ ఇలా ప్రతి సమీక్షలోనూ పెంచుకుంటూ పోవడం జరగలేెదని నిపుణులంటున్నారు. రెపో రేటు పెంపుతో ఫ్లోటింగ్ వడ్డీ రేటు నిబంధనల మూలంగా రుణగ్రహీతలు చెల్లించవలసిన వడ్డీ మొత్తం కూడా పెరిగిపోయింది. దాంతో గృహ వాహన తదితర వ్యక్తిగత రుణగ్రహీతలకు కిస్తీ (ఇఎంఐ)ల సంఖ్య లేదా ఇఎంఐ నగదు విపరీతంగా పెరిగాయి. పర్యవసానంగా బ్యాంకు రుణం అంటేనే సాధారణ మధ్యతరగతి ప్రజలు బెదిరిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎంతో కొంత నిలకడయిన ఆదాయం కలిగిన వారినందరినీ తిరిగి బ్యాంకులకు రప్పించడానికి, ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం తగ్గించడానికీ ఏం చెయ్యాలా అన్న ప్రయత్నంలో భాగంగానే ఫ్లోటింగ్ రేటు వడ్డీ విధానంపై చర్చను లేవనెత్తినట్టు కనిపిస్తోంది. రుణ గ్రహీతలకు నిబంధనలు వివరించి ఫ్లోటింగ్ లేదా స్థిర వడ్డీని ఎంచుకునే అవకాశంతో పాటు కిస్తీల సంఖ్యను, వాయిదా మొత్తాన్ని పునర్నిర్ణ యించుకునేందుకు అనుమతించాలని తాజా ద్రవ్య సమీక్ష అనంతరం ఆర్‌బిఐ గవర్నర్ బ్యాంకులను ఆదేశించారు. నిజానికి ఆర్‌బిఐ పెంచిన రేట్ల మూలంగా రుణ గ్రహీతలకు వడ్డీ భారం పెరిగింది. ఆ వాస్తవాన్ని మరిపించి, రుణగ్రహీతల కోపాన్ని ఫ్లోటింగ్ రేటుపైకి నెట్టాలని తాజాగా ఆర్‌బిఐ, ప్రసార మాధ్యమాలు పూనుకోవడం దారుణం.
ఆదాయ వివరాల ఆధారాలు, అప్పు తిరిగి చెల్లించగలరన్న భరోసా కలిగించే విధమైన పత్రాలు లేదా ఏర్పాట్లు ఉంటే వారికి బ్యాంకుల నుండి నేరుగా డిజిటల్ పద్ధతిలోనే ఒక పరిమితి మేరకు రుణాలిచ్చేందుకు పథకాలను రూపకల్పన చేయాలని ఆర్‌బిఐ ఆదేశించింది. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణం పొందేందుకు ఒక పైలట్ ప్రాజెక్టును తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, యు.పిల్లో కొన్ని ఎంపిక చేసిన జిల్లాల్లో 2022 సెప్టెంబర్‌లో ప్రారంభించారు. గుజరాత్‌లో డెయిరీ రైతులకు రుణాలిచ్చే పైలట్ పథకం ఇటీవలే ప్రారంభించారనీ వాటి అనుభవాలనుబట్టి విస్తృతపరచాలని ఆర్‌బిఐ పేర్కొంది. యుపిఐ లైట్ ద్వారా చిన్న మొత్తాల డిజిటల్ లావాదేవీలను పెంచాలంది. మొత్తంగా చూస్తే ఇదంతా బ్యాంకులంటేనే బెదిరిపోయేలా ఉన్న సామాన్యులను వాటికి చేరువ చేయడానికి, రికార్డుపరంగా వారిని ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వాములను చేయడానికి ఉద్దేశించిన ప్రయత్నాలని అనిపిస్తోంది. ప్రజలందరికీ అవసరమైన పరపతిని అందజేయడం, వారివద్దనున్న పొదుపు మొత్తాన్ని సరసమైన వడ్డీతో తిరిగి భద్రంగా చెల్లించడం బ్యాంకుల పరమావధిగా ఉండాలి. ఈ ప్రక్రియలు సజావుగా సాగేందుకు ఆర్‌బిఐ, ప్రభుత్వం కాపలాదారుగానూ అవసరమైన సందర్భాల్లో నియంత్రించేవిగానూ ఉండాలి. కానీ వాటిని గాలికొదిలేసి కార్పొరేట్ల సేవలో పాలకులు తరించిపోవడం క్షంతవ్యం కాదు.