
ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : జియో సింక్రనైజ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జిఎస్‌ఎల్‌వి) మార్క్-3 ప్రయోగం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నిర్వహించడానికి ఇస్రో చైర్మన్ సోమనాథ్ నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం అర్ధరాత్రి 12.07 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 24 గంటలపాటు ఇది కొనసాగి శనివారం అర్ధరాత్రి 12.07 గంటలకు నింగిలోకి ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. పూర్తి వాణిజ్య ఉపగ్రహ ప్రయోగం ఇది. విదేశాలకు చెందిన 36 ఉపగ్రహాలను 1వెబ్ కంపెనీ తరుఫున ప్రయోగిస్తున్నారు. ఇస్రో తొలిసారిగా భారీ బరువైన ప్రయోగం నిర్వహిస్తోంది. సుమారు 5,200 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. కమ్యూనికేషన్ శాటిలైట్స్‌ను తొలిసారి లోయర్ ఆర్బిట్‌లో ప్రవేశపెడుతున్నారు. జిఎస్‌ఎల్‌వి మార్క్-3 రాకెట్‌కు చివరి క్షణంలో ఎల్‌విఎం-3గా నామకరణం చేశారు. ఇప్పటి వరకు ఇస్రో ఎన్నో ప్రయోగాలు విజయవంతంగా నిర్వహించింది.