
- నిండాముంచిన విత్తన కంపెనీలు
- ఖరీఫ్‌లో పూర్తిగా దెబ్బతిన్న పంట
- పరిహారం కోసం రైతుల ఎదురుచూపులు
- నాన్చుతున్న కంపెనీలు
ప్రజాశక్తి- సాలూరు (విజయనగరం జిల్లా) : ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో మొక్కజొన్న సాగు చేసిన రైతులు నిండా మునిగిపోయారు. వెన్ను కట్టకపోవడం, వెన్ను వచ్చినా గింజ కట్టకపోవడంతో దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. దీంతో, రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఒప్పందం ప్రకారం తమకు రావాల్సిన పరిహారం కోసం వారు ఎదురు చూస్తున్నారు. దీనిపై విత్తన కంపెనీలు నాన్చుతుండ డం, షరతులు పెడుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లో మొక్కజొన్న ఎక్కువగా సాగు చేస్తున్నారు. సాలూరు నియోజకవర్గంలో ఎక్కువ విస్తీర్ణంలో ఈ పంట వేశారు. పాచిపెంట మండలంలో 5,990 ఎకరాలు, సాలూరు మండలంలో 3,442 ఎకరాలు, మక్కువ మండలంలో 767 ఎకరాలు... మొత్తంగా 10,199 ఎకరాల్లో సాగు చేశారు. ఎక్కువగా కావేరీ, బేయర్ రకం విత్తనాలను వేశారు. ఈ విత్తనాలు మొలకెత్తి నప్పటికీ వెన్నులకు గింజలు లేకపోవడంతో దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. తమ విత్తనాల వల్ల ఎవరైనా నష్టపోతే వారికి ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు పరిహారం చెల్లిస్తామని విత్తన కంపెనీలు రైతులతో ముందుగానే నోటిమాటగా ఒప్పందం చేసుకున్నాయి. తమ కంపెనీ విత్తనాలు నాటితే ఎకరానికి 1,500 నుంచి 2 వేల కిలోల దిగుబడి వస్తుందని ఆయా కంపెనీలు చెప్పాయి. అయితే, 200 కిలోలలోపే దిగుబడి వచ్చింది. కావేరి, బేయర్ విత్తనాలతోపాటు సిరి, బయోసీడ్ విత్తనాలను కూడా కొంతమంది రైతులు వేశారు. వీరి కూడా నష్టపోయారు.
ఒప్పందాన్ని కంపెనీలు అమలు చేస్తాయా ?
కావేరీ, బేయర్ విత్తన కంపెనీలు రైతులతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేస్తాయా? లేదా? అనేది ప్రసుత్తం ప్రశ్నార్థకంగా ఉంది. మొక్కజొన్న వ్యాపారులే విత్తన కంపెనీలు, రైతుల మధ్య దళారులుగా వ్యవహరించి ఒప్పందాలు కుదిర్చారు. దీంతో, నష్టపోయిన తమకు వీరు న్యాయం జరిగేలా చూడడం లేదని, విత్తన కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు. అక్కడక్కడా కొందరికి పరిహారం ఇస్తామని కంపెనీలు చెప్తున్నాయని, అయితే, రబీ సీజన్లో కూడా తమ కంపెనీ విత్తనాలనే మళ్లీ వేయాలని షరతు విధిస్తున్నాయని, ఇందుకు ఒప్పుకున్న వారికి మాత్రమే నిబంధనలకు లోబడి పరిహారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని కంపెనీలు చెప్తున్నాయని పలువురు రైతులు 'ప్రజాశక్తి'కి తెలిపారు. పరిహారం ఇప్పించే విషయంలో వ్యవసాయ శాఖ ప్రేక్షక పాత్ర పోషిస్తోందని విమర్శిస్తున్నారు. తమ ప్రమేయం లేకుండా ఒప్పందాలు జరుగుతున్నందున తాము బాధ్యత వహించలేమని వ్యవసాయ శాఖాధికారులు చెప్తున్నారు.
మా దృష్టికి రాలేదు
మొక్కజొన్న పంట దెబ్బతిన్న విషయం ఇంకా మా దృష్టికి రాలేదు. విత్తన కంపెనీలతో రైతులు నేరుగా ఒప్పందం చేసుకుంటున్నారు. నష్టం జరిగితే నిబంధనల మేరకు ఆ కంపెనీలు రైతులకు పరిహారం చెల్లించాలి
- ఎం.మధుసూధనరావు, వ్యవసాయ శాఖ ఎడి
పరిహారం కోసం ఎదురు చూస్తున్నాను
నేను కావేరి సీడ్స్ కంపెనీ విత్తనాలు నాటాను. పంట దిగుబడి పూర్తిగా లేదు. రెండు ఎకరాల్లో సాగు చేశాను. నష్టం జరిగితే పరిహారం చెల్లిస్తానని విత్తన కంపెనీ నోటిమాటగా ఒప్పందం చేసింది. ఎకరానికి రూ.30 వేలు ఇస్తామని చెప్పింది. పరిహారం కోసం ఎదురుచూస్తున్నాను. రబీలో కూడా ఇదే కంపెనీ విత్తనం నాటితే పరిహారం గురించి ఆలోచిస్తామని ఆ కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు.
- కిలారి రామకృష్ణ, రైతు, మామిడిపల్లి
ఎకరానికి రూ.35 వేలు ఇస్తామన్నారు
నేను రెండున్నర ఎకరాల్లో సిరి కంపెనీ విత్తనాలు వేశాను. పంట పూర్తిగా దెబ్బతింది. ఎకరానికి రూ.35 వేలు పరిహారం చెల్లిస్తామని విత్తన కంపెనీ ప్రతినిధులు నోటిమాటగా అప్పట్లో చెప్పారు. ఇప్పుడు ఎంతిస్తారో చూడాలి.
- కర్రి బంగారునాయుడు, రైతు, మామిడిపల్లి