- 23 న జింఖానా గ్రౌండ్స్‌లో బహిరంగ సభ
- హాజరుకానున్న సీతారాం ఏచూరి వి.శ్రీనివాసరావు
ప్రజాశక్తి-కృష్ణా ప్రతినిధి (విజయవాడ) : ఎనిమిదేళ్లుగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేటీకరణ, ప్రయివేటీకరణ విధానాలతో ప్రజల బతుకులు అతలాకుతలం అవుతున్నాయి. మరోపక్క ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు వారి మధ్య మతాల చిచ్చు రాజేసే ప్రయత్నాలను బిజెపి ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో బిజెపి ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించుకునేందుకు '' దేశ రక్షణ భేరీ '' నినాదంతో సిపిఎం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా సిపిఎం ఎన్‌టిఆర్, కృష్ణా జిల్లాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా జిల్లాలో బుధవారం నుండి విస్తృత ప్రచారం ప్రారంభమవుతుంది.
కృష్ణా జిల్లాలో రెండు జాతాలు..
కృష్ణా జిల్లాలో రెండు జాతాలు ప్రారంభమవుతాయి. ఉదయం 8 గంటలకు గన్నవరం మండలం చనుల్లివారిగూడెం నుండి బయలుదేరే జాతాను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు, పెనలూరు మండలం యనమలకుదురు నుంచి బయలుదేరే జాతాను సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు ప్రారంభిస్తారు. ఈ నెల 17వ తేదీ వరకు నాలుగురోజులపాటు జిల్లాల్లోని అన్ని మండలాలు, గ్రామాల్లో ఈ జాతాలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తాయి. గన్నవరం మండలం చనుపల్లివారిగూడెంలో ప్రారంభమయ్యే జాతా గన్నవరం, ఉంగుటూరు, బావులపాడు, నందివాడ, గుడివాడ, పెదపారుపూడి, పామర్రు, గుడ్లవల్లేరు, బంటుమిల్లి, పెడన, గూడూరు మీదుగా మచిలీపట్నానికి చేరుతుంది. ఈ జాతాకు సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శి వై.నరసింహారావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కళ్లం వెంకటేశ్వరరావు, టివి.లక్ష్మణస్వామి నేతృత్వం వహిస్తారు. పెనమలూరు మండలం యనమలకుదురులో ప్రారంభమయ్యే జాతా పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు, తోటవల్లూరు, పమిడిముక్కల, మొవ్వ, ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు మండలాల మీదుగా మచిలీపట్నానికి చేరుతుంది. ఈ జాతాకు సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.రఘు, ఎం.రాజేష్, కె.శివనాగేంద్రం నేతృత్వం వహిస్తారు.
జాతాలను జయప్రదం చేయండి : సిపిఎం కృష్ణా జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు పిలుపు
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నాలుగు రోజులపాటు జిల్లాలో రెండు జాతాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తామని సిపిఎం కృష్ణా జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు ప్రకటించారు. విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపి పట్ల అధికార వైసిపి, ప్రధాన ప్రతిపక్షం టిడిపి అనుసరిస్తున్న మెతక వైఖరిని కూడా జాతాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. ఈ జాతాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఎన్‌టిఆర్ జిల్లాలో వివిధ రూపాల్లో ప్రచారం..
- 14 న కరపత్రాల పంపిణీ
- 15 నుండి 19 వరకు గ్రూపు సమావేశాలు, పాదయాత్రలు
- 20 నుండి 22 వరకు బైక్ ర్యాలీలు, జీపు, ఆటో జాలాలు
కేంద్రంలోని బిజెపి-మోడి పాలన నుండి దేశాన్ని కాపాడుకోవాలనే నినాదంతో సిపిఎం చేపట్టిన దేశవ్యాప్త ప్రచారాందోళనలో భాగంగా బుధవారం ఎన్‌టిఆర్ జిల్లాలో విస్తృత ప్రచారం ప్రారంభమవుతుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి డివి.కృష్ణా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రచారం ఈనెల 23వ తేదీ వరకూ వివిధ రూపాల్లో కొనసాగుతుందని పేర్కొన్నారు. అనంతరం ఈనెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో 'దేశ రక్షణ భేరి ' బహిరంగ సభ జరుగుతుందని ఈ సభలో సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొంటారని తెలిపారు. ముందుగా ఈ సభ25 న జరుగుతుందని ప్రకటించామని, అయితే ఒక రోజు ముందుగానే నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈనెల 14 నుండి 23 వ తేదీ వరకు కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, సోషల్ మీడియా, గ్రూపు సమావేశాలు, జీపు, ఆటో జాతాలు, కోలాటం, డప్పులు, వివిధ కళారూపాల ద్వారా విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తామని తెలిపారు. బుధవారం కరపత్రాల పంపిణీ, ఈనెల 15 నుండి 19 వ తేదీ వరకు జనావాసాలు, కార్మికవాడల్లో గ్రూపు సమావేశాలు పాదయాత్రలు జరుగుతాయని, 20 నుండి 22 వ తేదీ వరకు బైక్ ర్యాలీ, జీపు, ఆటో జాతాలు నిర్వహిస్తామని తెలిపారు. బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు అవగామన కల్పించడానికి పలు ప్రాంతాల్లో ఫొటో ఎగ్జిబిషన్లు, ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ' దేశాన్ని కాపాడుకుందాం... మోడీ విధానాలను తరిమికొడదాం...'' అనే నినాదంతో అదాని, అంబానీలు, కార్పొరేటర్లకు ఊడిగం చేస్తూ ప్రజలపై భారాలు మోపుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలని, దేశ భక్తి ముసుగులో ప్రజల మధ్య మతచిచ్చుపెట్టి పబ్బం గడుపుకుంటున్న బిజెపి కుట్రలను తిప్పికొట్టాలని డివి.కృష్ణ పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను విస్మరించి రాష్ట్ర ప్రజలను మోసం చేసిన బిజెపిని నిలదీయాలని పిలుపునిచ్చారు.











