Aug 30,2022 06:44

తమకు తీరని నష్టం కలిగించే కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సిపిఎస్‌)ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని (ఒపిఎస్‌) పునరుద్ధరించాలంటూ ఉద్యోగ, ఉపాధ్యాయులు తలపెట్టిన ఆందోళనలపై ప్రభుత్వ అణచివేత ప్రజాస్వామ్యంలో ఎంతమాత్రం అంగీకరించరానిది. ఆందోళనలను అడ్డుకునేందుకు అమల్లో పెట్టిన పోలీస్‌ నిర్బంధ చర్యలు క్రూరత్వంతో కూడుకున్నవి. సిపిఎస్‌ను రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం చేతులెత్తేసిన దరిమిలా ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. చర్చల్లో సర్కారు మొండితనం మూలంగా, సెప్టెంబర్‌ 1న ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడి, మిలియన్‌ మార్చ్‌ ఆందోళనలకు పిలుపునిచ్చారు. అడ్డుకునేందుకు ప్రభుత్వం తీవ్ర నిర్బంధ చర్యలకు దిగడం హేయం. వారం రోజుల నుంచే ఉద్యోగులను బెదిరిస్తున్నారు. లక్షల రూపాయల పూచీకత్తుతో సెక్యూరిటీ బాండ్లు రాయించుకుంటున్నారు. బైండోవర్‌ చేస్తున్నారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు, హోటళ్లకు నోటీసులిస్తున్నారు. ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. విజయవాడలో బారికేడ్లు, టన్నులకొద్దీ ఇనుప ముళ్ల కంచెలు, అడుగడుగునా పోలీస్‌ నిఘా చూస్తుంటే యుద్ధం వచ్చినట్లే అనిపిస్తోంది. ఉద్యోగులకు ఆశ్రయం ఇవ్వొద్దని పౌరులను బెదిరించడం అణచివేతకు పరాకాష్ట.
సిపిఎస్‌ రద్దు అనేది ఎన్నికలకు ముందు వైసిపి ఇచ్చిన హామీ. అధికారంలోకొచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తామన్నారు. ఉద్యోగుల పోరాటానికి సంఘీభావమే కాదు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మేనిఫెస్టోలో ప్రముఖంగా పొందుపర్చారు. ప్రభుత్వంలోకి వచ్చి మూడేళ్లయినా అమలు చేయలేదు. అదే విషయాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. తీరా ఇప్పుడు తీరిక చేసుకొని సిపిఎస్‌ రద్దు సాధ్యం కాదు, అవగాహన లేక హామీ ఇచ్చామని సర్కారు మడమ తిప్పింది. ఒపిఎస్‌ అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్‌ కూడా సరిపోదంటూ ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రచారం ఎత్తుకున్నారు కొందరు మంత్రులు. పిఆర్‌సి విషయంలోనూ ఇలానే చేశారు. పిఆర్‌సి సాధనకై 'చలో విజయవాడ'కు పిలుపునివ్వగా, నిలువరించేందకు ప్రభుత్వం మోపిన ఉక్కుపాదం అంతా ఇంతా కాదు. అయినా వెరవకుండా 'చలో' జయప్రదం అయ్యాకనే ప్రభుత్వంలో ఆ మాత్రమైనా స్పందన వచ్చింది. రివర్స్‌ పిఆర్‌సి ఇచ్చి ఉద్యోగుల అసంతృప్తికి కారణమైంది. అటు ఆర్‌టిసి లోనూ అదే పని చేసింది. ఇప్పుడు ఒపిఎస్‌ కాదు గ్యారంటీ పెన్షన్‌ స్కీం (జిపిఎస్‌) అని విన్యాసాలు చేస్తోంది. ఈ వైఖరి 'తమది ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వం' అన్న ప్రకటనలకు పూర్తి విరుద్ధంగా వుంది.
నయా-ఉదారవాద విధానాలు, ప్రపంచ బ్యాంక్‌ విధానాల నుంచి పుట్టిందే సిపిఎస్‌. నాటి వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డిఎ సర్కారు సిపిఎస్‌ను తీసుకురాగా, 2004 సెప్టెంబర్‌1 నుంచి ఉమ్మడి ఎ.పి. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం అమల్లో పెట్టింది. ప్రభుత్వ ఉద్యోగి జీవితకాలం సమాజానికి సర్వీస్‌ చేస్తే, రిటైరయ్యాక గౌరవప్రద జీవితం గడపడానికి ప్రభుత్వ పెన్షన్‌ గ్యారంటీ కల్పించేది. అటువంటి భద్రత కోసమే ప్రభుత్వ ఉద్యోగం కోసం తపన పడతారు. పెన్షన్లు, జీతాలు భారమన్న ధోరణికి ప్రభుత్వాలు వచ్చి పెన్షన్‌ బాధ్యత నుంచి వైదొలిగాయి. తాజాగా సిపిఎస్‌ రద్దు ఉద్యమంతో ప్రభుత్వాలు కదులుతున్నాయి. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో సిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్‌కు వెళ్లగా, ఇక్కడ ఆచరణ సాధ్యం కాదన్న వాదనలో పస లేదు. ఉద్యోగులూ ప్రభుత్వంలో భాగమే. ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం లేదు. మేనిఫెస్టోను బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీతగా పేర్కొనే సర్కారు, అందులోని సిపిఎస్‌ రద్దు హామీని నెరవేర్చాలి. పౌరులకు మన రాజ్యాంగం నిరసన వ్యక్తం చేసే హక్కు కల్పించింది. ఆ హక్కును ప్రభుత్వం నిరాకరించడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. శాంతియుత ఆందోళనలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించాలి. నిర్బంధాన్ని విడనాడాలి. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.