May 06,2023 08:16
  • స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణపై కేంద్రం వ్యూహం
  • రాయబరేలి రైల్‌ వీల్‌ ఫ్యాక్టరీ, విశాఖ హెచ్‌బి కాలనీలోని 24 ఎకరాలు అమ్మకం
  • తాజాగా హైపవర్‌ కమిటీ సమావేశం నిర్ణయం

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రంలోని బిజెపి సర్కారు తన విధానమైన 'స్ట్రాటజిక్‌ సేల్‌' కుట్రను ఎగదోస్తూనే ఉంది. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని కార్మికవర్గం, ప్రజానీకం రెండేళ్లగా పోరాడుతున్నా మోడీ సర్కారు వెనక్కు తగ్గడం లేదు. రా మెటీరియల్‌ సరఫరాకు, వర్కింగ్‌ కేపిటల్‌కు రూ.1000 కోట్లు సాయం చేయాలని బిజెపి మినహా అన్ని రాజకీయ పార్టీలూ, కార్మిక సంఘాలూ, స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు కేంద్రాన్ని కోరుతున్నా, బ్యాంకుల్లో రుణం ఇప్పించకుండా ప్లాంట్‌ ఆస్తులను తెగనమ్మే సలహాలను ఇస్తోంది. ప్లాంట్‌లోని మూడు బ్లాస్ట్‌ ఫర్నేస్‌లలో ఒకటి పూర్తిగానూ, మరొకటి పాక్షికంగానూ పనిచేస్తున్నాయి. మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను కేంద్ర ఆదేశాలతో స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం మూసేసింది. ఇది నడవాలంటే ఆస్తులమ్మేయాలంటూ కేంద్రం ఆధీనంలోని హైపవర్‌ కమిటీలు ఉచిత సలహాలు ఇస్తున్నాయి.
 

                                                 డిజిన్వెస్ట్‌మెంట్స్‌ హైపవర్‌ కమిటీలో ఏం తేల్చారంటే...

ఈ నెల రెండున ఢిల్లీలో సమావేశమైన డిజిన్వెస్ట్‌మెంట్స్‌ హైపవర్‌ కమిటీ సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు చేశారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌కు చెందిన ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలిలోగల ఫోర్జ్‌డ్‌ వీల్‌ ప్లాంట్‌ (రైలు చక్రాలు తయారు చేసే ఫ్యాక్టరీ)ని, విశాఖ నగరం నడిబొడ్డున హెచ్‌బి కాలనీలోగల 24 ఎకరాల ప్లాంట్‌ భూమిని అమ్మేయాలంటూ ఆ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర కేబినెట్‌ ఏర్పాటు చేసిన వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కోర్‌ గ్రూపు సెక్రటరీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాయబరేలిలోని వీల్‌ ప్లాంట్‌కు అప్పట్లో రూ.2,250 కోట్లు పెట్టుబడి పెట్టారు. అక్కడ ఏటా లక్ష చక్రాలు తయారు చేయాల్సి ఉండగా ఆర్థిక వనరుల కొరత కారణంగా 2022లో రెండు వేల చక్రాలే తయారు చేశారు. రాయబరేలి ఫ్యాక్టరీ కోసం అప్పట్లో రూ.1,250 కోట్లు అప్పు చేశారు. దీన్ని అమ్మి అప్పు తీర్చేసి మిగిలిన డబ్బుతో బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3ని తెరిపించుకోవాలని కేంద్రం చెబుతోంది. వీల్‌ప్లాంట్‌ను అమ్మితే ఎంత వస్తుందో? ఆనాడు చేసిన అప్పు, దానికి వడ్డీ ఎంత తీర్చాల్సి వస్తుందో చెప్పలేమని స్టీల్‌ప్లాంట్‌ వర్గాలు తాజాగా చెబుతున్నాయి. స్టీల్‌ప్లాంట్‌లో ఆక్సిజన్‌ ప్లాంట్‌ను కూడా యాజమాన్యం బిఒటి పద్ధతుల్లో నిర్మించింది. దీనికి సుమారు రూ.500 కోట్లు చెల్లించాలి. ఈ మొత్తాన్ని కూడా వీల్‌ ఫ్యాక్టరీని అమ్మేదాంట్లోంచే మినహాయించాల్సి రావడంతో యాజమాన్యం తలలు పట్టుకుంటోంది.