Oct 31,2023 11:11

బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం సిఎం పినరయి విజయన్‌
తిరువనంతపురం :   
కోచిలోని కలామస్సెరి మీటింగ్‌ హాల్‌లో బాంబు దాడి ఘటనలో గాయపడి కలామస్సెరి మెడికల్‌ కాలేజీలో చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారని, వారు కక్కుతున్నది మామూలు విషం కాదు, ప్రాణాంతకమైన విషమని అన్నారు.. రాష్ట్రంలో నెలకొన్న లౌకిక, సౌహార్థ వాతావరణాన్ని నాశనం చేయాలన్నదే కేంద్ర మంత్రి వైఖరిగా వుందని విజయన్‌ విమర్శించారు. దాడి ఘటనపై దర్యాప్తు సక్రమంగా జరుగుతోందన్నారు. ఈ దాడి గురించి ఆదివారమే తాను కేంద్ర హోం మంత్రికి తెలియజేశానన్నారు. రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఆయన అనుచరుల ప్రకటనలు ఒక ప్రత్యేక వర్గానికి చెందిన వారిని ఉద్దేశించేలా వున్నాయన్నారు. కోచిలోని కలామస్సెరి మీటింగ్‌ హాల్‌లో బాంబు దాడిి ముస్లిం సంస్థల పనే అన్నట్లుగా సంఘపరివార్‌, బిజెపి సోషల్‌ మీడియా విద్వేష ప్రచారం చేస్తోందని పినరయి విజయన్‌ విమర్శించారు. మత ఛాందసవాద శక్తులను అల్లంత దూరాన వుంచడంలో విజయం సాధించిన కేరళ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా కేంద్ర మంత్రి, పారిశ్రామికవేత్త రాజీవ్‌ చంద్రశేఖర్‌, ఇతర బిజెపి నేతలు తప్పుడు ప్రచారాన్ని సాగిస్తున్నారని ఈ పేలుడులో హమాస్‌ కీలక పాత్ర పోషించిందని పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. బిజెపి మాజీ ప్రతినిధి సందీప్‌ జి.వేరియర్‌ మాట్లాడుతూ, యూదులు, క్రైస్తవ సంఘమైన జెహౌవా విట్నెసెస్‌ ఒకే విశ్వాసాన్ని నమ్ముతాయని అంటూ ఈ పేలుళ్లకు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, హమాస్‌ తీవ్రవాద కార్యకలాపాలను సమర్ధించే సిపిఎం నేతలదేనని అవాకులు చవాకులు పేలుతున్నారని అన్నారు . బాంబు పేలుడుకు పాల్పడిన వారికి హమాస్‌తో సన్నిహిత సంబంధాలున్నాయని బిజెపి మద్దతు గల యూ ట్యూబ్‌ చానెళ్లు ఆరోపిస్తున్నాయి. ఇజ్రాయిల్‌లో జరుగుతున్న దానికి ఇది ప్రతీకార చర్య అంటూ వ్యాఖ్యానిస్తున్నాయి. కన్వెన్షన్‌ హాల్లో నాటు బాంబులు పెట్టింది తానేనంటూ జెహౌవా విట్నెసెస్‌ అనుచరుడు డొమినిక్‌ మార్టిన్‌ అంగీకరించడంతో విద్వేషాన్ని రెచ్చగొట్టే మూకలు కంగుతిన్నాయి.

సమాజాన్ని అనైక్యతకు గురిచేసే ప్రయత్నాలను నిరోదించాలి : అఖిలపక్ష సమావేశం తీర్మానం
సమాజాన్ని అనైక్యతకు గురిచేసే ప్రయత్నాలను నిరోదించాలని కేరళలో సిఎం విజయన్‌ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం తీర్మానించింది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ద్వారా ద్వేషం, భయం వ్యాప్తి చేయడం, వివిధ విశ్వాసాల మధ్య శతృత్వం సృష్టించడమే లక్ష్యంగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని సిఎం విమర్శించారు. విద్వేష ప్రచారాన్ని ఖండించడంలో ప్రభుత్వంతో కలిసి యుడిఎఫ్‌ పనిచేస్తుందని ప్రతిపక్ష నేత విడి సతీసన్‌ మీడియాకు చెప్పారు.