ప్రజాశక్తి-నందిగామ(ఎన్‌టిఆర్) : ఎస్‌ఎఫ్‌ఐ 17వ అఖిల భారత మహాసభలు జయప్రదం చేయలని ఎస్‌ఎఫ్‌ఐ ఎన్‌టిఆర్ జిల్లా అధ్యక్షులు ఎం.సోమేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం కెవిఆర్ కళాశాలలో వాల్ పోస్టర్లను ప్రిన్సిపాల్ డా.రాయప్ప, ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఎం.సోమేశ్వరరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎం.సోమేశ్వరరావు మాట్లాడుతూ ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత మహాసభలు డిసెంబర్ 13 నుండి 16 వరకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరగుతున్నట్లు తెలిపారు. ఈ మహాసభల్లో దేశంలో విద్యారంగ ఎదుర్కొంటున్న అనేక సవాళ్ళపై అనేక తీర్మానాలు చేసి భవిష్యత్తు పోరాటాలు రూపకల్పన చేయనుందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక జాతీయ విద్యా విధానం పేరుతో మొత్తం విద్య వ్యవస్థను ప్రైవేటీకరణ, కార్పొరేటికరణ, కాషాయీకరణ చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ ప్రతిఏటా జాబ్ క్యాలండర్ విడుదల చేశాను అని చెప్పి ఇంతవరకు విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూళ్లలో 25 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు. జీవో నెం 77తో విద్యార్థులకు వసతి దీవెన అందడంలేదదని ఆరోపించారు. ప్రైవేట్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఫీజ్ రీఎంబర్స్‌మెంట్ అందటంలేదన్నారు. మరియు విద్యా వ్యాపారీకరణ వలన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, వికలాంగులకు హామీ పడిన సామాజిక న్యాయం దూరం చేసే విధంగా ఈ జాతీయ విధానం ఉందని దుయ్యబట్టారు. అంతే కాకుండా స్కూల్ కాంప్లెక్స్ పేరు మీద పరిసరాల గ్రామాలలోని, బస్తీల్లోని ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తుందని విమర్శించారు. పూర్వ ప్రాథమిక విద్య, సెకండరీ విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించడం లేదన్నారు. ఈ నూతన విద్యా విధానంలో ప్రైవేట్ విశ్వ విద్యాలయాలను, విదేశీ విద్యాలయాలను అనుమతిస్తారని అన్నారు.బైజుస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారని కానీ క్షేత్రస్థాయిలో విద్యార్థుల వద్ద స్మార్ట్ ఫోన్లు లేక ఇంటర్నెట్ సౌకర్యం లేక ఆన్లైన్ ఎడ్యుకేషన్ అందించే పరిస్థితి మన రాష్ట్రంలో లేదన్నారు. రాష్ట్రంలో నాడు-నేడు పేరుతో పాఠశాలలకు లక్షల నిధులు కేటాయించి అన్ని పాఠశాలలకు రంగులు వేయడం, కొత్తగా బాత్రూమ్స్, టాయిలెట్స్ , ఇతర వసతులు నిర్మించారు కానీ పూర్తి స్థాయిలో పనులు పూర్తి కాలేదని ఆరోపించారు. 3,4,5 తరగతుల విలీనం పేరుతో అదే పాఠశాలలను మూత వేస్తున్నారని , విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ స్థానంలో విద్యా దీవెన, వసతి దీవెన అని పేర్లు మార్చరే తప్ప కొత్తగా చేసింది ఏం లేదని, వసతి దీవెన పేరుతో హాస్టల్స్ ఊసే ఎత్తటం లేదన్నారు. దీనితో రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ మూసివేత పెరిగిందని, గత మూడు సంవత్సరాలుగా వసతి దీవెన, విద్య దీవెన నగదు పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడం వలన కాలేజీలకు ఫీజులు విద్యార్థులు సొంతగా కట్టవలసి వస్తుందని, చాలామంది విద్యార్థులకు విద్య పథకాలు వర్తించడం లేదని, దీంతో ఆ విద్యార్థులు పూర్తి ఫీజును కాలేజీలకు కట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిగామ కెవిఆర్ కాలేజీ అధ్యాపకులు వాసుదేవరావు, పీడీ నాగేశ్వరరావు నరేంద్ర,ఎస్‌ఎఫ్‌ఐ నందిగామ డివిజన్ కార్యదర్శి జి.గోపి నాయక్,ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు షేక్ రఫీ,కోటేశ్వరరావు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.










