Jun 18,2022 06:27

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌, బిజెపి ఆందోళనకారులు వీధుల్లోకొచ్చి నిరసనలు తెలియచేసే ఒక సంశయాత్మక దృశ్యం కేరళలో కనబడుతోంది. చాలా చోట్ల, ఆందోళనకారులు హింసాత్మకంగా మారి పోలీసులతో ఘర్షణ పడుతున్నారు.
బంగారం అక్రమ రవాణా కేసులో చార్జిషీట్‌ దాఖలైన నిందితురాలు, ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చిన స్వప్నా సురేష్‌ చేసినటువంటి హాస్యాస్పదమైన ఆరోపణల కారణంగా ఈ ఆందోళనలు తలెత్తాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే దౌత్య మార్గాల ద్వారా దేశం వెలుపలకు విదేశీ కరెన్సీ సంచులు తీసుకురాబడ్డాయనడంతో పాటు...ముఖ్యమంత్రి నివాసానికి బిర్యానీ డబ్బాల్లో బంగారం రవాణా చేయబడిందన్నటువంటి అసంబద్ధమైన కథనాలను ఆమె వండివార్చుతున్నారు.
దౌత్య మార్గాల ద్వారా బంగారం అక్రమ రవాణా జరిగిందని 2020 జూన్‌లో మొట్టమొదటగా బహిర్గతమైంది. కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ పరిధి లోకి వచ్చే అంశం కావడంతో దీనిపై కేంద్ర సంస్థచే విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రతి కోణంలోనూ ఎన్‌ఐఎ, సిబిఐ, ఇ.డి, కస్టమ్స్‌ శాఖలు రెండేళ్ళపాటు సవివరమైన దర్యాప్తు జరిపాయి. ప్రతిపక్షాలు, మీడియా తీవ్రమైన ఆరోపణలు చేసినప్పటికీ ముఖ్యమంత్రికి లేదా ప్రభుత్వంలోని మరే ఇతర మంత్రికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలను కనుగొనలేకపోయారు.
స్వప్నా సురేష్‌ కూడా వివిధ దర్యాప్తు సంస్థల ముందు 9 సార్లు ఇచ్చిన ప్రకటనల్లో ఎక్కడా కూడా ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించలేదు. వాస్తవానికి, ముఖ్యమంత్రిని ఇరికించేలా తనపై ఒత్తిడి తీసుకువచ్చారని పేర్కొంటూ జైలు నుండి ఆమె ఒక ఆడియో సందేశం పంపారు.
ఇప్పుడు ఏం మారింది? 2021 నవంబరులో స్వప్నకు హైకోర్టు నుండి బెయిల్‌ లభించింది. ఆ వెంటనే, ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ ఎన్‌జిఓ అయిన హైరేంజ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ (హెచ్‌ఆర్‌డిఎస్‌)లో ఎగ్జిక్యూటివ్‌గా ఆమెకు ఉద్యోగం దొరికింది. మరో సహ నిందితుడు పి.ఎస్‌.సరిత్‌ కుమార్‌కు కూడా ఉద్యోగం లభించింది. దీని తర్వాత కొన్ని నెలలకు, మేజిస్ట్రేట్‌ ముందు 164వ సెక్షన్‌ కింద స్వప్నా సురేష్‌ తన స్టేట్‌మెంట్‌ను నమోదు చేశారు. అది విశ్వసనీయమైన డాక్యుమెంట్‌గా ఉద్దేశించబడినప్పటికీ తర్వాత అందులోని వివరాలను బహిర్గతం చేశారు.
ఈ కల్పిత కథల తర్వాత వెల్లడైన డ్రామా ముందుగా ఊహించినదే. కాంగ్రెస్‌ పార్టీ హాస్యాస్పదమైన ఈ ఆరోపణలనే అసలైన నిజాలుగా ప్రచారం చేస్తూ, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలంటూ నిరసనోద్యమం ప్రారంభించింది. మొత్తంగా ఈ అధ్యాయానికి రూపకల్పన చేసిన బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా అదే బాటలో వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టింది. స్వప్నా సురేష్‌ చెప్పిన అబద్ధాలను ప్రచారం చేయడం ద్వారా ముఖ్యమంత్రికి, ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ప్రచారంలో ప్రధాన స్రవంతి లోని మెజారిటీ మీడియా చేతులు కలిపింది.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కదలికలను నిలువరించేందుకు యువజన కాంగ్రెస్‌ ప్రయత్నించింది. ముఖ్యమంత్రి పర్యటన జరిగిన చోటల్లా నల్ల జెండాలతో నిరసన తెలిపింది. ఈ ఉన్మాదం మరింత ముదిరి ముఖ్యమంత్రితో భౌతికంగా ఘర్షణ పడేందుకు ఒక ప్రణాళిక రూపొందించడానికి దారితీసింది. కన్నూర్‌కి చెందిన ఇరువురు యువజన కాంగ్రెస్‌ నేతలు, తిరువనంతపురానికి ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న విమానంలోనే ఎక్కారు. విమానం ల్యాండ్‌ అవగానే, వారు నినాదాలు చేసుకుంటూ ముఖ్యమంత్రి వున్న వైపునకు వెళ్ళారు. సి.ఎం కు నిరసన తెలియచేస్తూ కొన్ని నినాదాలు చేసుకుంటూ వారు వెళ్ళారని విమానంలోని ఈ ప్రమాదకరమైన చర్యను ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేత వి.డి.సతీశన్‌ సమర్ధించుకున్నారు. పైగా, ముఖ్యమంత్రి వైపు వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్న ఆందోళనకారులను అడ్డగించి, వెనక్కి తోసివేసిన ఎల్‌డిఎఫ్‌ కన్వీనర్‌ ఇ.పి.జయరాజన్‌పై కేసు దాఖలు చేయా లంటూ డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు వ్యతిరేకంగా కేరళలో కాంగ్రెస్‌ నిరసనలు నిర్వహిస్తున్న రోజే నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎదుట రాహుల్‌గాంధీ హాజరయ్యారు. దీన్ని రాజకీయ ప్రతీకార చర్యగా పేర్కొంటూ...కాంగ్రెస్‌ నాయకత్వం, కార్యకర్తలు ఢిల్లీ వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేయడం విచారకరం. కానీ కేరళలో మోడీ, విజయన్‌ మధ్య ఒప్పందం కుదిరిన కారణంగానే...పినరయి విజయన్‌కి వ్యతిరేకంగా ఇ.డి చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది.
ఏడాది క్రితం ఈ బంగారం అక్రమ రవాణా కేసు లోనే ముఖ్యమంత్రి విజయన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌, బిజెపిలు మరింత విస్తృతమైన నిరసనలు నిర్వహించాయి. ఈ కేసులో ముఖ్యమంత్రికి సంబంధం వుందనేందుకు ఆధారాలను కనుగొనడంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు విఫలమైన తర్వాత 2021 మే లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఈ ఆరోపణలన్నింటినీ తిప్పికొట్టడంతో యుడిఎఫ్‌ మరింత నిరుత్సాహపడింది. ఇక ఇప్పుడు, ఆర్‌ఎస్‌ఎస్‌ తీసుకువచ్చిన స్వప్నా సురేష్‌ షోతో అయినా తమ ఆశలు నెరవేరుతాయేమోనని వారు ఆశిస్తున్నారు. జాతీయ స్థాయిలో ప్రస్తుత దివాళాకోరు రాజకీయాలకు కాంగ్రెస్‌ ఎందుకు పాల్పడుతున్నదనేది కేరళలో ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు చూస్తే అర్ధమవుతోంది. వామపక్షాల నేతృత్వం లోని ప్రభుత్వంపై పోరాడేందుకు బిజెపితో చేతులు కలపడంలో వారికెలాంటి ఇబ్బంది లేదు. ఒకపక్క తమ సొంత నేతలే బిజెపిలో చేరేందుకు కాంగ్రెస్‌ను వీడి వెళుతుండగా, మోడీతో ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తిగా పినరయి విజయన్‌ను చిత్రించాలని వారు చూస్తున్నారు. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి పన్నిన కుట్రకు కేరళలో కాంగ్రెస్‌ ఒక డూప్‌గా మారిందన్నది ఇక్కడ వాస్తవంగా వుంది.
కేరళలో కాంగ్రెస్‌-బిజెపి ఉమ్మడిగా జరిపే దాడిని బలంగా తిప్పికొట్టేలా ప్రచారం చేపట్టాల్సిన అవసరం వుంది. పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించాల్సి వుంది. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం, దాని విధానాల పట్ల పూర్తి స్థాయి విశ్వాసమున్న కేరళ ప్రజలు తగు రీతిలో సమాధానం చెప్పగలరు.
(

'పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం )