Dec 17,2022 10:19
  • తేమశాతంతో రైతులకు సమస్యలు
  • డ్రయ్యర్లు కొనాలని మిల్లర్లకు ఆదేశం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : మాండూస్‌ తుఫాన్‌తో ధాన్యం కల్లాల్లో పూర్తిగా తడిసిపోయింది. పంట పొలాల్లోనే నాని పోవడంతో ధాన్యం మొలకెత్తింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతాంగం రోడ్డెక్కి ఆందోళనలు చేస్తోంది. ప్రభుత్వం ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తామని, రైతులకు ఎటువంటి నష్టమూ లేకుండా చేస్తామని చెబుతున్నప్పటికీ ఆచరణలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. దీంతో ధాన్యం కొనుగోళ్లపై సందిగ్ధత నెలకొంది. తేమశాతం రైతాంగానికి సమస్యగా మారడంతో మిల్లర్లు తప్పనిసరిగా డ్రయ్యర్స్‌ వాడాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా 1500 మంది మిల్లర్లు ధాన్యం సేకరించేందుకు ముందుకు రాగా వీరిలో 1000 మిల్లర్ల వద్దే డ్రయ్యర్స్‌ అందుబాటులో ఉన్నట్లు పౌరసరఫరాలశాఖ అధికారులు పేర్కొంటున్నారు. మిగిలిన 500 మిల్లర్లు డ్రయ్యర్స్‌ కొనుగోలు చేయాలని ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. గత ఏడాది రబీలో సేకరించిన ధాన్యానికి సంబంధించి ప్రభుత్వం నేటికీ సుమారు రూ.1200 కోట్ల వరకు మిల్లర్లకు బకాయిలు పెండింగ్‌లో ఉండగా, తాజాగా రూ.200 కోట్ల బిల్లులను ప్రభుత్వం క్లియర్‌ చేయగా మరో వెయ్యి కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో పాత బకాయిలు పూర్తిగా చెల్లింపులు కాక ఇబ్బందులు పడుతుంటే తాజాగా డ్రయ్యర్స్‌ కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించడం తమకు తలకు మించిన భారంగా మారిందనే అభిప్రాయం రైస్‌ మిల్లర్స్‌ యజమానులు వ్యక్తం చేస్తున్నారు.
 

                                                                       13 మిల్లులు బ్లాక్‌

రైతు భరోసా కేంద్రం ద్వారా మిల్లర్లకు తరలించిన ధాన్యంలో తేమశాతంలో తేడాలు చూపిస్తున్న 13 మిల్లులను బ్లాక్‌ చేయడం జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాల సంస్ధ ఎమ్‌డి వీరపాండియన్‌ తెలిపారు. ఏదైనా సమస్య వస్తే ఆర్‌బికె సిబ్బందితో మాట్లాడుకుని సరిచేసుకోవాలన్నారు. మిషన్‌లో తేడాలొస్తే లీగల్‌మెట్రాలజీ అధికారులును పంపి చెక్‌ చేయిస్తామన్నారు. తేమశాతం ఎంత ఉన్నప్పటికీ ఆర్‌బికె ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.