Oct 17,2023 08:32
  • యురోపియన్‌ నేతల అత్యవసర భేటీ
  • చైనా, రష్యా విదేశాంగ మంత్రుల భేటీ
  • టర్కీ, ఇరాన్‌ నేతల ఫోన్‌ చర్చలు
  • ఇజ్రాయిల్‌లో బైడెన్‌ పర్యటన?

జెరూసలేం, గాజా : గాజాలో మానవతా సంక్షోభం పెచ్చరిల్లకుండా ఇజ్రాయిల్‌ దూకుడు వైఖరికి కళ్లెం వేసేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఇజ్రాయిల్‌, హమాస్‌ మధ్య జరుగుతున్న ఈ యుద్ధం యూరప్‌లో మతాల మధ్య ఉద్రిక్తతలకు ఆజ్యం పోయగలదని ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో యురోపియన్‌ నేతలు అత్యవసరంగా మంగళవారం సమావేశం కానున్నారు. శరణార్థులను మరింతమందిని అనుమతించే విషయమై చర్చించనున్నారు. ''ఈ యుద్ధం అనేక పర్యవసానాలకు దారితీయనుంది.' అని ఇయు కౌన్సిల్‌ అధ్యక్షుడు చార్లెస్‌ మైఖేల్‌ వ్యాఖ్యానించారు. 'అగ్నికి ఆజ్యం పోయవద్దని' ఇరాన్‌ను జర్మనీ హెచ్చరించింది. ఇరాన్‌ విదేశాంగ మంత్రి హమస్‌ ఉన్నతాధికారులను కలుసుకున్న నేపథ్యంలో జర్మనీ హెచ్చరిక వెలువడింది. ఈ తరుణంలో పరిస్థితులను మరింత ఉద్రిక్తపరిచేలా ఏ ఒక్క చిన్న చర్యకు పాల్పడినా అది అంతిమంగా ప్రాంతీయ ఘర్షణలకు దారి తీయగలదని హెచ్చరించింది.
చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి తో రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్‌రోవ్‌ భేటీ అయ్యారు. మధ్య ప్రాచ్యంలో నెలకొన్న సంక్షోభంపై వారు సుదీర్ఘంగా చర్చించారు. దీంతోపాటు పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు కూడా వారి మధ్య చర్చకు వచ్చాయి. ఉక్రెయిన్‌ ఘర్షణ గురించి వాంగ్‌తో చర్చించినట్లు లావ్‌రోవ్‌ తెలిపారు. రాజకీయ, దౌత్య పద్ధతుల ద్వారా దీన్ని పరిష్కరించే ప్రయత్నాలు గురించి కూడా చర్చించామని రష్యా విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ఘర్షణలను ఆపేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి టర్కీ అధ్యక్షుడు తైయీప్‌ ఎర్డోగన్‌, ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ మేరకు టర్కీ అధ్యక్ష కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. రాబోయే రోజుల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇజ్రాయిల్‌లో పర్యటించాలని భావిస్తున్నారు. గాజాను మరోసారి ఆక్రమించుకోవడానికి ప్రయత్నించవద్దంటూ అధ్యక్షుడు బైడెన్‌ ఆదివారం ఒక ఇంటర్వ్యూలో బహిరంగంగానే ఇజ్రాయిల్‌ను హెచ్చరించారు.

ఫిలిప్పీన్స్‌లో వేలాదిమంది నిరసనలు

పాలస్తీనాకు అనుకూలంగా దక్షిణ ఫిలిప్పీన్స్‌లో వేలాదిమంది నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పాలస్తీనా పతాకాలు చేబూని పాలస్తీనా జాతీయ పతాక రంగులను వారి ముఖాలకు పూసుకుని ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఇజ్రాయిల్‌ చర్యలను ఖండిస్తూ కొటాబెటొ సిటీ పబ్లిక్‌ పార్క్‌ వద్ద నాలుగు గంటల పాటు బహిరంగ సభ జరిగింది. 25వేల మందికిపైగా పాల్గొన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. తక్షణమే ఇజ్రాయిల్‌ సైన్యం హింసాకాండను ఆపాలని సభలో మాట్లాడిన వక్తలు కోరారు. ఈ ఘర్షణల్లో అమెరికా, ఐక్యరాజ్య సమితి రెండూ తటస్థ వైఖరి పాటించాలని విజ్ఞప్తి చేశారు.

జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన

పాలస్తీనియన్లకు మద్దతుగా ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద సోమవారం నిరసన ప్రదర్శన జరిగింది. వామపక్ష విద్యార్ధి సంఘాలతో సహా పలు సంస్థలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. దాదాపు 50మందిని అదుపులోకి తీసుకున్నారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.