
ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి) అమలు చేస్తామంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రకటన పూర్తిగా రాజకీయపూరితమైనది. ఏ వర్గానికి చెందినవారైనా సరే... ప్రజలు ఎదుర్కొంటున్న... ప్రతికూలతను, గురవుతున్న నిర్లక్ష్యాన్ని పరిష్కరించడం దీని లక్ష్యం కాదు. మహిళలు ఎదుర్కొంటున్న 'వివక్ష'ను అంతం చేయడం ఈ ప్రకటన ఉద్దేశం కాదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను మెజారిటీ వర్గ వాదాన్ని బుజ్జగించడమే మోడీ లక్ష్యం.
2014లో ఏర్పడిన మోడీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ ప్రణాళికతో పనిచేస్తోంది. అమెరికా సామ్రాజ్యవాదం, జాతీయ కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఇది చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల కార్మికులు, రైతులు, నిరుద్యోగ యువత అసంతృప్తితో ఉన్నారు. వీటన్నింటిని అధిగమించేందుకు మత ఘర్షణలు సృష్టించి ప్రజల దృష్టిని మళ్లించాలన్నది మోడీ ప్రభుత్వ వ్యూహం.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం, కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా, రాష్ట్ర హోదా తొలగింపు, పౌరసత్వ సవరణ చట్టం, మత మార్పిడి నిషేధ చట్టం, ఘర్ వాపసీ, గోరక్ష, హిజాబ్ వివాదం, లవ్ జిహాద్ వివాదం, మత ఘర్షణలు...మొదలైనవన్నీ లౌకిక భారతదేశాన్ని 'హిందూ' రాష్ట్రంగా మార్చాలనే ఆర్‌ఎస్‌ఎస్ పథకంలో భాగమే.
ఇన్ని చేసినా 2024లో గెలుస్తారన్న గ్యారెంటీ లేదు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల్లోనూ, ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ బిజెపి పరాజయం పాలైంది. ప్రతిపక్ష లౌకిక పార్టీలు ఐక్యత వైపు వెళ్లడం కూడా వారిని కలవరపెడుతున్నది. ఈ నేపథ్యంలో 'యూనిఫాం సివిల్ కోడ్'ను తెరపైకి తెచ్చారు.
ఈశాన్య రాష్ట్రాల్లోని బిజెపి ఫ్రంట్ లోని కొన్ని గిరిజన పార్టీలు ఉమ్మడి పౌర స్మృతిపై వ్యతిరేకత వ్యక్తం చేశాయి. దళితులు, షెడ్యూల్డ్ కులాలవారు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యుసిసి కి వ్యతిరేకంగా ముస్లిం, క్రైస్తవ తదితర మత సంఘాలు కూడా ముందుకు వచ్చాయి. అంతే, ఈశాన్య రాష్ట్రాలలోని గిరిజనులు, క్రైస్తవులను యుసిసి నుంచి మినహాయిస్తామని అమిత్ షా ప్రకటించారు. 'ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం' అని చెబుతున్న సంఫ్‌ు పరివార్ కేవలం ముస్లింలను లక్ష్యంగా చేసుకునే ఆయుధంగా యుసిసిని బయటికి తీసినట్లు దీనినిబట్టి స్పష్టమవుతోంది.
మత విశ్వాసాలు, సామాజిక నిర్మాణం, జీవనశైలి, సాంస్కృతిక భేదాలు వంటి వివిధ అంశాల ఆధారంగా వ్యక్తిగత చట్టాలు నిర్ణయించబడతాయి. ప్రభుత్వం రూపొందించిన చట్టాలు, వ్యక్తిగత చట్టాలు, హక్కులు కుటుంబ సంబంధాలకు సంబంధించి నిర్ణయించబడతాయి. ప్రతి మతానికి తనకంటూ ప్రత్యేకమైన సాంస్కృతిక అంశాలు, హక్కులు ఉంటాయి. అవసరాన్ని బట్టి అందులో మార్పులు చేసేందుకు ఆయా సంఘాల నుంచే చొరవ వచ్చేలా చూడడం అభిలషణీయం. వారసత్వ చట్టం-1925, ప్రత్యేక వివాహ చట్టం-1954 సాధారణ చట్టాలను నిర్వీర్యం చేసేందుకు...లవ్ జిహాద్‌ను నిరోధించే పేరుతో బిజెపి పాలనలో వున్న రాష్ట్ర ప్రభుత్వాలు...మతాంతర వివాహాలను అడ్డుకుంటున్నాయి. ఇది ప్రత్యేక వివాహ చట్టాన్ని తోసిపుచ్చడమే.
దేశంలో స్థానికంగా వివిధ వ్యక్తిగత చట్టాలు ఉన్నాయి. కేరళలో 1975లో హిందూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మారిపోయింది. ముస్లిం వివాహాలు, విడాకుల నమోదు అవసరమని చెప్పే చట్టాలు బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలలో వున్నాయి. కాశ్మీరీ ముస్లింలకు 'దత్తత' హక్కు ఉంది. భారతదేశంలో, ముస్లింలకు మాత్రమే కాకుండా హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు, పార్సీలు, యూదులకు కూడా ప్రత్యేక వ్యక్తిగత చట్టాలు ఉన్నాయి. ఎవరికి ఏ వ్యక్తిగత చట్టం వర్తిస్తుందనేది మతపరమైన గుర్తింపు నిర్ణయిస్తుంది. ప్రత్యేక వివాహ చట్టం-1954 ప్రకారం హిందూ కమ్యూనిటీకి చెందిన స్త్రీ పురుషులు వివాహం చేసుకున్నప్పటికీ, వారికి హిందూ వ్యక్తిగత చట్టం వర్తిస్తుంది. అయితే, ప్రత్యేక వివాహ చట్టం కింద వివాహం చేసుకున్న ముస్లింలకు ముస్లిం వ్యక్తిగత చట్టం వర్తించదు.
'ఏకీకరణ' కంటే దేశ 'సమైక్యత' ముఖ్యం. భిన్నత్వంలో ఏకత్వం అనే భావనను మన దేశం సమర్థించింది. సాంస్కృతిక గుర్తింపు హక్కు సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుతుంది. సాంస్కృతిక వైవిధ్యాన్ని స్వీకరించే సహనశీలత భారతీయ సమాజంలో వుంది.
సంఫ్‌ు పరివార్ అంటే చెప్పిన సూత్రాలను ఏ మాత్రం స్వీకరించడానికి సిద్ధంగా లేని వారు. ముస్లింల రక్షణ గురించి ప్రస్తావిస్తూ మోడీ మొసలి కన్నీరు కారుస్తున్నారు. పార్లమెంటు ఆమోదించిన 'ట్రిపుల్ తలాక్ నిషేధ చట్టాన్ని' సమర్థిస్తూ మోడీ ఈ వాదన చేస్తున్నారు. తలాక్ చెప్పి విడాకులిచ్చే భర్తను ట్రిపుల్ తలాక్ చట్టం ప్రకారం జైలుకు పంపుతారు. భర్త జైల్లో వుంటే విడాకుల తర్వాత ఆమెకు భరణం ఎవరిస్తారు? ముస్లింలు అనాగరికులు అని ప్రచారం చేయడమే మోడీ ఉద్దేశం.
లా కమిషన్ నివేదిక-2018 వ్యక్తిగత చట్టాలను సంస్కరించాలని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఏ కమ్యూనిటీ సంస్థతోనైనా చర్చించిందా? భిన్నత్వాలు కలబోసిన ఈ భారతదేశంలో ఏకాభిప్రాయం లేకుండా కేవలం చట్టం ద్వారా మాత్రమే ఏదీ పరిష్కరించబడదు. మోడీ పాలనలో ఇలాంటి అనుచితమైన చర్యలు ఎన్నో ఉంటాయి. వీటన్నింటి ఉద్దేశ్యం ''మహిళా రక్షణ'' కాదు. కేవలం రాజకీయ ప్రయోజనమే. భారత రాజ్యాంగం దేశంలో అనేక పర్సనల్ చట్టాలకు చట్టబద్ధత కల్పించిన విషయాన్ని మోడీ మరచిపోయారు. తాను ప్రధానమంత్రి అయినప్పటికీ మోడీ ప్రజలను రాజ్యాంగం ప్రకారం చూడరు. ఆర్‌ఎస్‌ఎస్ దృష్టి కోణం నుంచే చూస్తారు. అందువల్లే, దేశం మీద ఉమ్మడి పౌర స్మృతిని రుద్దడం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ఆయనకు ఫికర్ లేదు.
మోడీ ప్రభుత్వం ముస్లింలను టార్గెట్ చేస్తోంది. ఇటువంటి చర్యలు ముస్లింలలో 'ఉగ్రవాదాన్ని' రెచ్చగొట్టే సంస్థలకు ఊపునిస్తాయి. 'సేవ్ ఇస్లాం' వంటి ఉద్వేగభరితమైన నినాదాలతో ఉద్రేకాలను రెచ్చగొట్టేందుకు మత మౌఢ్య శక్తులకు ఊతమిస్తుంది. లౌకిక ఉద్యమాల్లో చేరి, తమ మత విశ్వాసాలను, గుర్తింపును కాపాడుకునే వైఖరి తీసుకునే వారిని బలహీనపరుస్తుంది. అంతేగాక సమాజంలో సమయానుకూల మార్పులు కోరుకునే సమూహాన్ని బలహీనపరుస్తాయి. హిందూత్వ మతోన్మాద శక్తులు సరిగ్గా దీనినే కోరుకుంటున్నాయి. 'ఉగ్రవాదం' పేరుతో ముస్లింలను అణిచివేసేందుకు ఇదొక సాకుగా వుంటుంది.
ఆర్‌ఎస్‌ఎస్ నుంచి వస్తున్న 'అతివాద హిందుత్వ' ముప్పుపై కాంగ్రెస్ జాతీయ నాయకత్వం స్పష్టమైన వైఖరిని అవలంభించడం లేదు. బాబ్రీ మసీదు విషయంలోనూ ఇలాగే వ్యవహరించింది. యుసిసి బిల్లు పార్లమెంటుకు వచ్చిన తర్వాత దానిమీద వ్యాఖ్యానించవచ్చన్న కాంగ్రెస్ వైఖరి మోసపూరితమైనది. రాజ్యాంగ ఆదేశిక సూత్రాలలో ''ఉమ్మడి పౌర స్మృతి'' మాత్రమే కాదు. శ్రామికులకు జీవనోపాధి కల్పించడం, ఒకే ప్రాంతంలో సంపద కేందీకరణ కాకుండా చూడడం, పరిశ్రమల నిర్వహణలో కార్మికుల భాగస్వామ్యం వంటి అంశాలు కూడా ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కటి అమలు చేయడానికి ఆసక్తి చూపని మోడీ ప్రభుత్వం...హిందూ-ముస్లిం విభజనను సృష్టించి మతపరమైన విభజనలను ఓట్లుగా మార్చుకోవడానికి యుసిసి ని ముందుకు తెచ్చింది.
2019 ఎన్నికల వేళ పుల్వామా ఉగ్రదాడిని బిజెపి ప్రధాన ప్రచార అంశంగా చేసుకుంది. ఉగ్రదాడికి పాకిస్తాన్ మద్దతు ఇచ్చిందని, ఆ దేశంపై సర్జికల్ దాడుల ద్వారా ప్రతీకారం తీర్చుకున్నట్లు ప్రభుత్వం చెప్పుకుంది. దీంతో ఉద్వేగానికి లోనైన ఓ వర్గం ప్రజలు పడిన కష్టాలను మరిచిపోయి బిజెపి కి పట్టం కట్టారు. 2024లో కూడా మోడీ అదే వ్యూహాన్ని ప్రయోగిస్తున్నారు. మెజారిటీ మతాన్ని రెచ్చగొట్టడమే వారి లక్ష్యం.
వ్యాసకర్త రాజ్యసభ సభ్యుడు ఎలమరం కరీం