Jul 13,2023 14:03

హైదరాబాద్‌ : కార్ల లీజు పేరుతో భారీ మోసం జరిగింది. సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కోసమని యజమానులతో ఒప్పందం కుదుర్చుకున్న ఓ ముఠా.. పలువురి వద్ద కార్లను తీసుకుంది. ఆ తర్వాత ఆ కార్లను వడ్డీ వ్యాపారుల వద్ద తాకట్టు పెట్టి నగదు తీసుకున్నారు. ఆ డబ్బుతో జల్సాలు చేయడం ప్రారంభించారు. ఒప్పందం సమయం ముగియడంతో.. యజమానులు ఆ ముఠాను సంప్రదించగా చేతులెత్తేశారు. దీంతో బాధిత యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.సనత్‌ నగర్‌, ఎస్సార్‌ నగర్‌, జగద్గిరిగుట్ట, బాచుపల్లి, వనస్థలిపురం పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ ముఠా నేరాలకు పాల్పడింది. మొత్తం 16 కార్లను వడ్డీ వ్యాపారుల వద్ద తాకట్టు పెట్టినట్టు పోలీసుల విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్న కార్ల విలువ రూ. 1.10 కోట్లు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు. నిందితులు ప్రవీణ్‌ కుమార్‌, ఒమర్‌ మహ్మద్‌లను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి అహ్మద్‌ అలీ కోసం గాలిస్తున్నారు. ఈ కేసు వివరాలను బాలానగర్‌ డీసీపీ శ్రీనివాస్‌ రావు వెల్లడించారు.