
ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నాఫెడ్, ఆయిల్ ఫెడ్ ద్వారా కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింపజేయాలి. కొబ్బరి అధికంగా పండించే ప్రాంతాలలో పరిశోధనా కేంద్రాలు, కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. సమస్యలు పరిష్కారానికి కొబ్బరి రైతులందరూ సంఘటితం కావడమే ఇందుకు పరిష్కారం. ''కొబ్బరి చెట్టు కొడుకు కన్నా మిన్న'' అని పెద్దలు అంటారు. కొడుకులు చూసినా చూడకపోయినా ఇంటి దగ్గర పది కొబ్బరి చెట్లు ఉంటే బతికేయవచ్చని నమ్మకం. అట్లాంటి కొబ్బరి పంటను నమ్ముకున్న రైతులు నేడు నష్టాల్లో ఉన్నారు. ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది. మన దేశంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ నాల్గవ స్థానంలో ఉంది. రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల 50 వేల ఎకరాల వరకు కొబ్బరి విస్తీర్ణం ఉంది. ప్రధానంగా సముద్ర తీరంలో ఉన్న కోనసీమ, ఉద్దానం ప్రాంతాలలో అధిక విస్తీర్ణంలో ఉన్నా మెట్ట భూములలో కూడా కొబ్బరి విస్తీర్ణం అధికంగానే ఉంది. కోకోనట్ బోర్డు లెక్కల ప్రకారం రాష్ట్రం విస్తీర్ణంలో నాలుగో స్థానంలో ఉన్నా ఉత్పాదకతలో మొదటి స్థానంలో ఉంది. గత అనేక సంవత్సరాలుగా ఎర్ర నల్లి, తెల్ల దోమ వంటి తెగుళ్లు ఆశించడంతో కొబ్బరి దిగుబడి బాగా తగ్గింది. మరోవైపు మార్కెట్‌లో ధరలు హెచ్చుతగ్గులుగా ఉండడం వలన కూడా కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కరోనా కాలం నుండి కొబ్బరి రైతులు నష్టాలనే చవిచూస్తున్నారు. కొబ్బరి రైతులకు ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీ పథకాలు అమలు కావడం లేదు.
ఎకరా కొబ్బరి సాగుకు సంవత్సరానికి రూ.40 వేలకు పైగా పెట్టుబడి ఖర్చులు అవుతున్నాయి. ఎరువులు, పురుగుమందుల ధరలు పెరిగిపోవడంతో పంట ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయాయి. చెట్టు నుండి కొబ్బరికాయలు కోసి గుట్టలుగా వేయడానికి ఒక్కో కాయకు 3 రూపాయలు ఖర్చవుతున్నది. అయితే వ్యాపారులు ఎండు కొబ్బరికాయకు 6 రూపాయలకు మించి ధర ఇవ్వడం లేదు. 100 కొబ్బరికాయలు కొనుగోలు చేస్తే రైతు నుండి అదనంగా 10 కొబ్బరికాయలు వ్యాపారులు తీసుకుంటున్నారు. కొబ్బరి రైతుకు కోత ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉంది. వ్యాపారులు కొబ్బరి తోటలలో పంట కొనుగోలు సందర్భంగా ఒక్కో కొబ్బరి చెట్టుకు గతంలో వెయ్యి రూపాయలు వరకు ధర ఇచ్చేవారు. ఈ సంవత్సరం ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ.550 నుండి రూ.700 వరకు ధర ఇస్తున్నారు. ఎకరా కొబ్బరి తోటలో సుమారు 60 చెట్లు ఉండడం వలన గతంలో ఎకరాకు రూ.60 వేలు ఆదాయం వచ్చేది. కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి అంతర పంటగా కోకో ఇతర పంటలు సాగు చేయడంతో మరో రూ.30 వేల నుండి 40 వేలు ఆదాయం వచ్చేది. నేడు ఆ పరిస్థితి లేదు. కష్టపడి రైతు నాణ్యమైన పంట పండించినా కొనుగోలు చేసే స్థితి లేదు. నష్టాలకు కొబ్బరికాయలు అమ్ముకోలేక తోటలో నిల్వబెడితే వర్షాలకు తడిచి మొలకలు వచ్చేస్తున్నాయి.
కొబ్బరి రైతుల గోడును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. మార్కెట్‌లో వినియోగదారులు మాత్రం ఒక్కో కొబ్బరికాయను 20 నుండి 25 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ మాయాజాలంతో కొబ్బరి రైతులు నలిగిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు కొబ్బరికాయలు ఎగుమతి అవుతున్నాయి. వేసవి కాలంలో కొబ్బరి బోండాలకు డిమాండ్ ఉంటుంది. పండుగల సమయంలో కొబ్బరికాయలు వినియోగం అధికంగా ఉంటుంది. ప్రస్తుతం ఎండు కొబ్బరికి కూడా మార్కెట్‌లో డిమాండ్ ఉంది. మార్కెట్‌లో ధర ఎగుడు దిగుడులు సందర్భంగా అవసరమైతే నిల్వ చేసుకుని ధర పెరిగిన తర్వాత అమ్ముకునే అవకాశం రైతుకు లేదు. అందుకు తగిన గిడ్డంగులు గానీ, కోల్డ్ స్టోరేజ్‌లు గానీ అందుబాటులో లేవు. కొబ్బరి పంట ప్రాంతాలలో కొన్ని చోట్ల కొబ్బరి పీచు పరిశ్రమలు ఏర్పాటు చేశారు. కొబ్బరి ద్వారా తయారయ్యే మిగిలిన వివిధ ఉత్పత్తులకు సంబంధించిన తగిన పరిశ్రమలు లేవు. కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయడం వలన రైతులకు ఆదాయం, యువతకు ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వాలు ఆలోచనలు చేయడం లేదు. కొబ్బరి వలుపు, దింపుడు కార్మికులు వేల సంఖ్యలో ఉపాధి పొందుతున్నారు. కొబ్బరి రైతు నష్టాలు ప్రభావం వీరు కనీస వేతనాలపై ఉంటుంది.
కొబ్బరి రైతు పెట్టిన పెట్టుబడికి కనీసం మార్కెట్‌లో ఒక్కో కాయకు రూ.15 ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. అయితే మార్కెట్‌లో వ్యాపారులు ఆ ధర ఇవ్వడం లేదు. ఈ పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. మన రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.3 వేల కోట్లు ధరల స్థిరీకరణ నిధి కేటాయిస్తామని రాష్ట్ర బడ్జెట్ ప్రసంగాల్లో చాలా గొప్పగా చెబుతున్నారు. విత్తనం నుండి విక్రయం వరకు రైతు భరోసా కేంద్రాలు పని చేస్తున్నాయని ప్రచారం ఊదరగొడుతున్నారు. ఆచరణకు వచ్చేసరికి అమలు కావడంలేదు. నాఫెడ్, ఆయిల్ ఫెడ్ రంగంలోకి దిగి రైతుల నుండి కొబ్బరికాయలు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నా పట్టించుకునే పరిస్థితి కనబడడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాష్ట్ర ఎంపీలు కొబ్బరి రైతుల గోడు వినిపించి కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ఒత్తిడి చేసే ప్రయత్నాలు ఎక్కడా కానరావడం లేదు.
ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నాఫెడ్, ఆయిల్ ఫెడ్ ద్వారా కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింపజేయాలి. కొబ్బరి అధికంగా పండించే ప్రాంతాలలో పరిశోధనా కేంద్రాలు, కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. సమస్యలు పరిష్కారానికి కొబ్బరి రైతులందరూ సంఘటితం కావడమే ఇందుకు పరిష్కారం.
(వ్యాసకర్త ఎ.పి. రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, సెల్ : 94900 98574) కె. శ్రీనివాస్