- మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎం ప్రణీత్
ప్రజాశక్తి -పి ఎం పాలెం (విశాఖ) : విశాఖ నగర పరిధి పిఎం.పాలెంలోని ఎసిఎ విడిసిఎ క్రికెట్ స్టేడియంలో ఎపిఎల్ సీజన్-2 లీగ్‌లో బుధవారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో రాయలసీమ కింగ్స్- కోస్టల్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ ప్రకారం కోస్టల్ రైడర్స్ విజేతగా నిలిచింది. తొలుత టాస్ గెలుచుకున్న కోస్టల్ రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకొని బరిలోకి దిగారు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 18 ఓవర్లకు కుదించారు. దీంతో బ్యాటింగ్ తీసుకున్న రాయలసీమ కింగ్స్ జట్టు బ్యాట్స్ మ్యాన్లు 18 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 131 మాత్రమే చేయగలిగారు. కెహెచ్ వీరారెడ్డి మాత్రమే 78 పరుగులు చేసి రాయలసీమ కింగ్స్ జట్టులో స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. మిగతా వారంతా రాణించలేక పోయారు.
అనంతరం బ్యాటింగ్ బరిలోకి దిగిన కోస్టల్ రైడర్స్‌కు 15 ఓవర్లలో 127 పరుగులకు కుదించడంతో బ్యాట్స్ మ్యాన్లు 14 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఓపెనర్ బ్యాట్స్ మ్యాన్ ఎం ప్రణీత్ 40 బంతుల్లో మూడు సిక్స్‌లు, ఆరు ఫోర్లుతో 64 పరుగులు చేసి నాట్ అవుట్‌గా నిలిచాడు. ప్రణీత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.











