Mar 10,2023 06:36

రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోవడానికి ప్రణాళిక రాహిత్యమే కారణం. జెన్‌కో ఆధ్వర్యంలో నడిచే అన్ని విద్యుత్‌ ప్లాంట్లలోనూ ఒక్క రోజుకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. వేసవిలో విద్యుత్‌కు డిమాండ్‌ పెరగడం, పెరిగే డిమాండ్‌కు తగ్గట్టు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం కొత్తేమీ కాదు. కొద్దిరోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఈ దిశలోనే ఒక సమావేశం నిర్వహించి, విద్యుత్‌ కొరత రాకుండా చూసుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. అయితే అందుకు తగిన విధంగా ఆచరణ లేదు. పూర్తిస్థాయిలో వేసవి కాలం రాకముందే బొగ్గు కోసం దేవులాడుకునే పరిస్థితి రావడాన్ని ఏమనాలి? నిబంధనల ప్రకారం ప్రతి ప్లాంటులోను కనీసం 15 రోజులకు అవసరమైన బొగ్గును నిలువ ఉంచుకోవాలి. పదహేను రోజుల సంగతి అలా ఉంచి కనీసం రెండు, మూడు రోజులకు కూడా నిల్వలు లేని స్థితికి చేరడానికి కారణం ఏమిటి? అంత కనీస స్థాయికి బొగ్గు నిల్వలు పడిపోతుంటే అధికార యంత్రాంగం ఏం చేస్తోంది? ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారా లేదా? తీసుకువస్తే ప్రభుత్వ స్థాయిలో స్పందన ఏమిటన్న విషయాలు తేలాల్సి వుంది. ప్రైవేటు ప్లాంట్లకు కూడా బొగ్గును అందిస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ కోల్‌ ఇండియా ప్రభుత్వ ప్లాంట్లకు సరిపడినంతగా సరఫరాలు ఉండటం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? కోల్‌ ఇండియా పూర్తిస్థాయిలో బొగ్గు సరఫరా చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదు? మహానంది గనులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లిస్తే సరఫరాలు కొంత మెరుగుపడే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశలో ఎందుకు ప్రయత్నాలు జరగడం లేదు? వీటికి సంబంధించి పూర్తి వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిఉంది.
దేశీయ బొగ్గు కొరతను సాకుగా చూపుతూ విదేశాల నుండి దిగుమతి చేసుకోవడానికి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన కాంట్రాక్టును అదానీ సంస్థ దక్కించుకోవడం మరింత ఆందోళనకరం. అదానీ గ్రూపు అక్రమాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నా, సాక్షాత్తు సుప్రీంకోర్టే ఆ వ్యవహారంపై విచారణ జరుపుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఇసుమంత కూడా పట్టినట్టులేదు. కనీసం విచారణ ప్రక్రియ పూర్తయి, వాస్తవాలు వెలుగులోకి వచ్చేంతవరకు ఆగాలన్న స్పృహ కూడా ప్రభుత్వానికి కొరవడుతోంది. ఒకదాని తరువాత ఒకటిగా వివిధ రంగాలను, మౌలిక వనరులను ఆ సంస్థకు అప్పగించి రాష్ట్రాన్ని అదానీ ప్రదేశ్‌గా మార్చడానికి పరుగులు తీస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక పోర్టులు, సెజ్‌లు, పంప్డ్‌ స్టోరేజి, సౌర విద్యుత్‌ ప్రాజెక్టులను అదానీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా విదేశీ బొగ్గు సరఫరా కాంట్రాక్టునూ కట్టబెట్టడం ద్వారా కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ కేంద్ర నిర్వహణను దాదాపుగా అదానీకి అప్పగించినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో పాటు రాష్ట్ర విద్యుత్‌ రంగంపై అదానీ పట్టు మరింత బిగియనుంది.
విదేశీ బొగ్గును టన్ను 9 వేల రూపాయలకు మించి కొంటే పెనుభారంగా మారుతుందంటూ గతంలోనే నిపుణులు చేసిన హెచ్చరికలను కూడా బేఖాతరు చేసి అదానీ సంస్థ నుండి 13 వేల రూపాయలకు కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనివల్ల జరిగే మేలు ఎవరికో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వేసవిలో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరాకు అవసరమైన ప్రత్యామ్నాయ ప్రణాళికలను అమలు చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థల నుండి దేశీయ బొగ్గును సరసమైన ధరకు, సకాలంలో పొందేందుకు ప్రయత్నించాలి. ఈ మేరకు కేంద్రంపై ఒత్తిడి తేవాలి. మేధావులను, నిపుణులను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలి. ప్రజలపై భారాలు మోపే ఈ తరహా చర్యలను తక్షణం విడనాడాలి. విద్యుత్‌ రంగంలో ప్రజానుకూల చర్యలను చేపట్టాలి.