
మోడీ నేతృత్వంలోని కేంద్ర బిజెపి ప్రభుత్వం వాగ్దానం చేసిన సహకార సమాఖ్య వాదం బలవంతపు సమాఖ్య వాదంగా మారిపోయింది. 2019 నుంచి జరిగిన సంఘటనలను పరిశీలిస్తే గుజరాత్‌కు చెందిన కోఆపరేటివ్ అమూల్ డెయిరీ ఇతర రాష్ట్రాలకు విస్తరించడం ద్వారా ప్రైవేటు కార్పొరేట్ పెట్టుబడి ప్రవేశిస్తున్న క్రమం బిజెపి సహకార ఫెడరలిజం అసలు రంగు బయట పెడుతుంది. కొత్తగా మోడీ సర్కారు కేంద్రంలో సృష్టించిన సహకార మంత్రిత్వశాఖకు ఇన్‌ఛార్జిగా ఉన్న హోం మంత్రి అమిత్‌షా, కర్ణాటకలోని మాండ్యాలో పర్యటిస్తూ గుజరాత్‌కు చెందిన కోఆపరేటివ్ డెయిరీ అమూల్‌లో కర్ణాటక రాష్ట్ర సహకార డెయిరీ నందినిని విలీనం చేయాలన్న ఉద్దేశాన్ని బహిరంగపరిచారు. షా ప్రకటనపై కర్ణాటకలో రైతులే కాకుండా అన్ని రాజకీయ పార్టీల నుంచీ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. బిజెపి రాజకీయంగా ఒంటరిపాటుకు గురైంది. దాంతో కర్ణాటక బిజెపి ముఖ్యమంత్రి బొమ్మరు వివరణిస్తూ దేశంలోనే అతిపెద్ద సహకార పాల ఉత్పత్తిదారుల సంఘాలైన అమూల్, నందిని మధ్య సహకారం కోసం షా పిలుపునిచ్చారన్నారు. విలీనం ప్రతిపాదన లేదన్నారు. ఇదిలా ఉండగా, ఏప్రిల్ 5న అమూల్ తన ట్విటర్‌లో బెంగళూరు నగరంలో అమూల్ పాలు, పెరుగును ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించి మరోమారు అమూల్- నందిని విలీనంపై చర్చను లేవదీసింది. అమూల్‌లో నందినిని విలీనం చేయడం, లేదంటే కర్ణాటకలో నందినికి సమాంతరంగా అమూల్ నెట్‌వర్క్‌ను చొప్పించడం ద్వారా స్థానికంగా నందినిని ధ్వంసం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిశ్చయించుకుందని ఇప్పుడు కర్ణాటక ప్రజలు నమ్ముతున్నారు. ఈ నమూనాను తతిమ్మా రాష్ట్రాల్లో కూడా అమలు చేయడానికి కేంద్రం అడుగులేస్తోంది.
- స్వేచ్ఛగా కార్పొరేట్ల ప్రవేశం
కర్ణాటక రాష్ట్రం గుజరాత్ రాష్ట్రానికి ఆనుకొని లేదు. గుజరాత్, బెంగళూరు మధ్య పాల రైళ్లు కూడా లేవు. కర్ణాటక మార్కెట్‌లో చాలా కాలంగా ఉన్న ప్యాకేజి, ప్రాసెస్ చేసిన పాల ఉత్పత్తులు ఉండగా, బెంగళూరు మార్కెట్‌లో తాజా అమూల్ పాలు, పెరుగు అమ్మకాలపై స్థానిక సహకార డెయిరీలలో భయాలు కలుగుతున్నాయి. ఇది అమిత్‌షా నేతృత్వంలోని సహకార మంత్రిత్వ శాఖ నిజమైన ఉద్దేశాల గురించి తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒక సహకార సంస్థను మరొక సహకార సంస్థ కబళించడం సహకార స్ఫూర్తికి విరుద్ధం. కర్ణాటకలోని బిజెపి ప్రభుత్వంకానీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంకానీ అమూల్, నందిని విషయంలో బహిరంగంగా చెప్పేవాటి కంటే దాచిపెట్టేవే ఎక్కువ. కర్ణాటక బిజెపి ప్రభుత్వం నందినికి అనుకూలమనడం కేవలం నటన మాత్రమే. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కెఎంఎఫ్) బ్రాండ్ పేరు నందిని. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో అత్యంత శక్తిమంతమైన యూనియన్లతో ఏర్పడ్డ ఫెడరేషన్. దాదాపు 25 లక్షల మంది రైతులు ఉపాధి పొందుతున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.25 వేల కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. దేశంలో అమూల్ తర్వాత నందిని మాత్రమే పెద్ద టర్నోటర్ కలిగి ఉంది. ఆ ఏడాది అమూల్ టర్నోవర్ రూ.65 వేల కోట్లు. ఇటీవలి అధ్యయనాల ప్రకారం దేశంలో రూ.15 లక్షల కోట్ల పాల వ్యాపారం జరుగుతోంది. దీనిలో 10 శాతం మాత్రమే వ్యవస్థీకృత రంగంలో ఉంది. పాల రంగంలో ప్రైవేటు పెట్టుబడి ప్రవేశించేందుకు అనుకూలంగా ఉండే సరికొత్త మోడల్ రావాలని ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు ప్రతిపాదిస్తున్నాయి. 2019లో కేంద్రంలో రెండవ తడవ అధికారంలోకొచ్చిన బిజెపి సర్కారు పాల సహకార వ్యవస్థలో స్వేచ్ఛగా కార్పొరేట్ల ప్రవేశం కోసం, సహకార డెయిరీల విచ్ఛిన్నానికి సరికొత్త నమూనా అమలుకు సిద్ధమైంది. పాలల్లో ప్రైవేట్లు గరిష్ట లాభాలు పొందేందుకు ఈ నమూనా సులభతరం చేస్తుంది.
- మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్స్
భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం సహకార సంస్థలు రాష్ట్రాల జాబితాలోకొస్తాయి కాబట్టి సహకార కార్యకలాపాలు రాష్ట్ర, ప్రైవేటు రెండింటిలోనూ, మూడవ రంగ స్వయంప్రతిపత్తిగా నిర్వహించబడతాయి. అవి ప్రజల ఉమ్మడి ప్రయోజనాల కోసం పని చేస్తాయి. సంస్థలో పెట్టుబడితో నిమిత్తం లేకుండా ఒక వ్యక్తికి ఒక ఓటు ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో నడుస్తున్న పెద్ద పెద్ద కోఆపరేటివ్స్‌లోకి భారీ ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించాలంటే కేంద్ర ప్రభుత్వ పాలనా పర్యవేక్షణ అసరమని తొలుత యుపిఎ సర్కారు భావించి, రాజ్యాంగానికి 97వ సవరణ చేయగా సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ కేంద్రం ఆధ్వర్యంలో బహుళ రాష్ట్ర సహకార సంఘాల ఏర్పాటుకు అనుమతించింది. సహకార వ్యవస్థలో కార్పొరేట్ల ప్రత్యక్ష, పరోక్ష పెట్టుబడి మోడీ రెండోసారి అధికారంలోకొచ్చే వరకు వేచి ఉండాల్సి వచ్చింది. కార్పొరేట్ మధ్యవర్తిత్వ, నియంత్రిత రైతు ఉత్పత్తిదారు సంస్థల ఏర్పాటుకు మూడు నల్ల వ్యవసాయ చట్టాలతో కఠోర ప్రయత్నం జరిగింది. రైతుల చారిత్రాత్మక పోరాటం కారణంగా మూడు వ్యవసాయ చట్టాలూ రద్దయినప్పటికీ రాష్ట్ర వ్యవసాయ చట్టాలలో ఇటువంటి నిబంధనలున్నాయి. పాల సహకార సంస్థలతో సహా ఇతర సంస్థల కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న రైతుల ప్రతిఘటనను అధిగమించేందుకు మోడీ ప్రభుత్వం అనేక 'వినూత్న' మార్గాలను అనుసరిస్తోంది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొంటే అమూల్ ఇతర రాష్ట్రాలకు విస్తరించడం, దాని ద్వారా ప్రైవేటు కేపిటల్ ప్రవేశం అసలు కథ బోధ పడుతుంది. 2019లో బహుళ దేశ ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్‌సిఇపి) చర్చల్లో ఈ ప్రక్రియను గుర్తించవచ్చు. ఆర్‌సిఇపి చర్చల్లో ముఖ్యమైన వివాదాల్లో ఒకటి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి ప్రపంచ పాడి దిగ్గజాలు ప్రపంచ వ్యాప్తంగా పాల ఉత్పత్తులపై జీరో సెస్ ప్రతిపాదన. భారతీయ పెద్ద వ్యాపారులు అటువంటి వెసులుబాటు కోసం ఎదురు చూస్తుండగా, రైతులు దేశ వ్యాప్తంగా వ్యతిరేక ఆందోళనలు చేశారు. పలు కారణాల వలన చివరికి ఆర్‌సిఇపి నుంచి భారత్ ఉపసంహరణ జరిగింది. ఆర్‌సిఇపి ఎదురుదెబ్బ ఉన్నప్పటికీ, దోపిడీ చేయడం కోసం పాడి రంగంపై కార్పొరేట్లు ఆసక్తి పెంచుకున్నారు. ఫిక్కీ 2020లో 'భారతదేశంలో పాల రంగం అభివృద్ధి' పేరిట స్ట్రేటజీ పేపర్ వెల్లడించింది. ప్రైవేటు పెట్టుబడిని తప్పక అనుమతించాలని, మధ్యవర్తిత్వం, నియంత్రిత వ్యవస్థలతో సులభతరం చేయాలని సూచించింది. ఎగుమతి సామర్ధ్యాన్ని ఉపయోగించుకోవాలని పేర్కొంది. మరో సంస్థ సిఐఐ 2022లో పాల వ్యాపారానికి అదనపు ప్రేరణ ఇవ్వడానికి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం పెంచాలని తెలిపింది. రైతులకు సబ్సిడీలు, సంస్థాగత పరపతి కోసం కార్పొరేట్ రంగం ఎక్కువగా పాల్గొనాలని, కొత్త సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన ప్రాసెసింగ్, మార్కెటింగ్, రైతులతో టై-అప్ పెరగాలని పేర్కొంది.
- కేంద్ర నియంత్రణలోకి
2021 వరకు సహకార విభాగం వ్యవసాయ మంత్రిత్వశాఖలో ఒక చిన్న విభాగం. అకస్మాత్తుగా మోడీ ప్రభుత్వం సహకార విభాగాన్ని కేబినెట్ మంత్రి బాధ్యతలతో స్వతంత్ర మంత్రిత్వశాఖ స్థాయికి పెంచింది. కేబినెట్‌లో రెండవ స్థాయిలో ఉన్న అమిత్‌షా ఆ విభాగానికి మంత్రి కావడం గమనార్హం. సహకార మంత్రిత్వశాఖ ఏర్పడిన రెండు వారాల వ్యవధిలో భారత పాల రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఒక ప్రైవేటు ఇన్వెస్టుమెంట్ యాక్సిలరేటర్‌ను నెలకొల్పుతున్నట్లు మోడీ ప్రభుత్వం ప్రకటించింది. ఇది పెట్టుబడిదారులతో పని చేయడానికి ఏర్పాటు చేసిన నిర్వహణ బృందమని పేర్కొంది. కేంద్రం నియంత్రణ కిందికి సహకార వ్యవస్థను తీసుకొచ్చే ప్రక్రియ మొదలు పెట్టింది. పెట్టుబడిదారులకు వ్యాపార సౌలభ్యం కలిగించేందుకు, సరఫరా గొలుసులో కార్పొరేట్ల ప్రవేశానికి ఇది పనికొస్తుంది. కొత్త మంత్రి అమిత్‌షా, బహుళ రాష్ట్ర సహకార సంఘాల (ఎంఎస్‌సిఎస్) బిల్లును ప్రవేశపెట్టారు. సొసైటీలో ముగ్గురు పాలనాధికారుల నియామకం, ఎన్నికల నిర్వహణ, ఆడిటింగ్‌కు కేంద్రానికి అధికారం ఇస్తుంది. ఎంఎస్‌సిఎస్ రాష్ట్రాల హక్కులను కాలరాస్తుంది. పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టడానికి కొద్ది నెలల ముందు, సిక్కింలో అమిత్‌షా మాట్లాడుతూ మల్టీ స్టేట్ మిల్క్ కోఆపరేటివ్ అన్నారు. ఐదు పాల సహకార సంస్థలతో ఏర్పడింది. అందువల్ల నందిని, అమూల్ విలీనం, షా చెప్పినట్లు దేశంలో రెండు పెద్ద కోఆపరేటివ్స్ మధ్య పరస్పర సహకారం కోసం కాదు. ప్రైవేటు పెట్టుబడి ప్రవేశంతో కేంద్ర పాలనలో మల్టీ స్టేట్ సొసైటీగా మార్చడం. అందుకే కర్ణాటక బిజెపి నేతలు హోం మంత్రి ప్రకటనను తిమ్మినిబమ్మిని చేసే ప్రయత్నం చేస్తున్నా ప్రజలు నమ్మడంలేదు. పాల సహకార రంగాన్ని కార్పొరేటీకరించడం ద్వారా ప్రపంచ పాల మార్కెట్‌లో చేరేందుకు మూడు ఎగుమతి ఆధారిత మల్టీ స్టేట్ మిల్క్ సొసైటీలను ఏర్పాటు చేస్తున్నామని, ఎగుమతులను ప్రోత్సహించేందుకు పని చేస్తాయని ఈ ఏడాది జనవరి 11న ప్రధాని ప్రకటించారు. అమూల్‌ను పాల ఎగుమతికి ప్రమోటర్‌గా జనవరి 23న నియమించారు. ప్రపంచ పాల ఎగుమతుల్లో 33 శాతం వాటా సాధించడం, ప్రాసెసింగ్, ఎగుమతి వాణిజ్యంలో పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యమని చెప్పారు.
- రెండు లక్షల సంఘాల నిర్మాణం
ఈ ఏడాది మార్చి 10న జరిగిన గుజరాత్‌లోని ఇండియన్ డెయిరీ అసోసియేషన్ వార్షిక సమావేశంలో అమిత్‌షా మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా రెండు లక్షల పంచాయతీలలో స్వతంత్ర పాల సొసైటీలను ఏర్పాటు చేస్తామని, ఇవి అమూల్ నేతృత్వంలోని ఎగుమతి ఆధారిత సొసైటీతో ముడిపడి ఉంటాయన్నారు. ప్రస్తుత సహకార వ్యవస్థ ఎగుమతి మార్కెటింగ్‌కు వడ్డించే అమూల్ సామ్రాజ్యంలో భాగమని స్పష్టం చేశారు. ఈ వ్యూహాన్ని కొనసాగిస్తూ అమూల్ మేనేజింగ్ డైరెక్టర్ మెహతా ఏప్రిల్ 5న అమూల్ తాజా పాలు, పెరుగు అమ్మకాలు బెంగళూరులో ప్రారంభమవుతాయని ప్రకటించారు. ఏప్రిల్ 9న ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరు మాసాల్లోనే బెంగళూరులో ఆధునిక వాణిజ్యంతో అమూల్ ప్రవేశం జరుగుతుందని స్పష్టం చేశారు. స్వతంత్ర పాల సంఘాల ఏర్పాటు ద్వారా అమూల్ పాలను సేకరించి నందినికి సమాంతరంగా వ్యాపారం చేస్తుందన్నమాట. ఇది కచ్చితంగా నందిని మనుగడకు హానికరం. దాని సరఫరా గొలుసును దెబ్బతీయడంతోపాటు, కార్యకలాపాలను ఆక్రమించు కుంటుంది. ఈ క్రమం కర్ణాటక రైతుల భయం నిజమని తేలుస్తుంది. ఇది కేవలం అమూల్-నందినికే పరిమితం కాదు. పాల సహకార సంస్థలను కార్పొరేట్లు స్వాధీనం చేసుకునే కేంద్రీకరణ. మొదట్లో పాల ఉత్పత్తిదారులకు ఎక్కువ ఆదాయం లభించినా భవిష్యత్తులో మొత్తం పాల ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ రక్షణ ఉండదు. స్వేచ్ఛా మార్కెట్‌లో ప్రపంచ పాల ఆర్థిక వ్యవస్థకు లోబడి ఉంటుంది. ఇప్పటికే వ్యవసాయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న గ్రామీణ భారతాన్ని మరింత అతలాకుతలం చేస్తుంది. పాల రంగం పల్లె కుటుంబాలను కొంత వరకు నిలబెట్టగా కార్పొరేటీకరణ ఆ ఆసరానూ తొలగిస్తుంది. ఇది కర్ణాటకలోని 25 లక్షల మంది రైతులనే కాకుండా గుజరాత్‌లో పాల ఉత్పత్తిదారులతో సహా దేశంలో గల పది కోట్ల మంది రైతులను దెబ్బతీస్తుంది. రైతుల ఉమ్మడి ప్రయోజనాల కోసం పని చేసే నిజమైన సహకార విధానమే నందినికి, అమూల్‌కు, యావత్ దేశానికి రక్ష.
కె.ఎస్.వి. ప్రసాద్