Jan 29,2023 06:25

ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనం తెచ్చేందుకు, అందుబాటులో ఉన్న సమాచారాన్ని ప్రజలకు తెలియచెప్పేందుకు, పౌరులకున్న హక్కును చట్టబద్దం చేసేందుకు సమాచార హక్కు (సహ) చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీనికోసం పెద్ద పోరాటమే జరిగింది. ఈ చట్టం రాకముందు ఆఫిస్‌కి వెళ్ళి బల్ల మీద చెయ్యి పెట్టడానికి కూడా వుండేది కాదు. ఈ చట్టం వచ్చిన తరువాత ఖచ్చితంగా అడిగిన సమాచారం ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. పౌరునికి చదువు రాకపోయినా వారు కోరినవిధంగా అధికారులే ఫిర్యాదు రాసి అప్లికేషన్‌ పూర్తిచేసి పెట్టాలి. ఒకవేళ ఫిర్యాదులో అచ్చుతప్పులు దొర్లినా, భాషా పరిజ్ఞానం లేకపోయినా విషయం అర్ధమైతే చాలు. సమచారం ఇవ్వాలి. అలాంటి చట్టం వున్నప్పటికీ ఈరోజు అధికారులు కావలసిన సమాచారం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. కొంతమంది అధికారులు కావాలని, 'మీరు అడిగింది సెక్షను 8.1 లోకో రెండు లోకో వస్తుంది కనుక సమాధానం ఇవ్వం' అంటూ తప్పించుకుంటున్నారు. దేశ రక్షణకు సంబంధించినది అయితే ఇవ్వకూడదు. ఒక ప్రభుత్వ కార్యాలయంలో జరిగిన అవినీతి గురించి మీరేం చర్యలు చేపట్టారు, సదరు పని జరగకపోవటానికి కారణాలు తెలపండి అనడిగితే అవి చెప్పటానికి ఇష్టంలేక 'దీనికి సమాధానం మా కార్యాలయంలో లేదు. మా పరిధి లోకి రాదు' అని తిప్పి పంపుతున్నారు. వారి దగ్గర లేకపోతే ఎవరి దగ్గర వుందో, వారికి ఫిర్యాదు పంపి, ఐదు రోజుల లోపు ఆ సమాచారం ఫిర్యాదుదారునికి తెలపాలి. అంతేగాని ఇవ్వకుండా వుండకూడదు. దీనికంతటికి కారణం సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించిన వారిపైన ఆర్‌టిఐ కమిషన్‌ వారు సరైన చర్యలు తీసుకోకపోవటం. దీంతో అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చి సహ కార్యకర్తలను నిరుత్సాహ పరుస్తూ, చట్టాన్ని నీరుగారుస్తున్నారు. కనుక ఇకనైనా చట్టాన్ని, అందులోని సెక్షన్లను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకొని జరిమానా విధించాలి. అప్పుడే సహ చట్టం బతుకుతుంది.


- నార్నె వెంకట సుబ్బయ్య