వినుకొండ: వైసిపి- టిడిపి వర్గాల పరస్పర సవాళ్లతో పల్నాడు జిల్లా వినుకొండలో రాజకీయం వేడెక్కింది. టిడిపి కార్యకర్తలపై వైసిపి కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ క్రమంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో సీఐ గాల్లోకి కాల్పులు జరిపారు. వివరాల్లోకి వెళితే.. టిడిపి సీనియర్ నేత, వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ టిడిపి కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండ్ వద్దకు రాగానే వారికి వైసిపి ఎమ్మెల్యే బల్లా బ్రహ్మనాయుడు ఎదురుపడ్డారు. మట్టి తవ్వకాలపై చర్చకు సిద్ధమంటూ తన వాహనం దిగి మరీ టిడిపి నేతలకు ఆయన సవాల్ విసిరారు. గనుల అక్రమ తవ్వకాలు చేపట్టారంటూ బ్రహ్మనాయుడుకు వ్యతిరేకంగా టిడిపి కార్యకర్తలు నినాదాలు చేశారు. టిడిపి శ్రేణులను అడ్డుకున్న పోలీసులు.. అక్కడి నుంచి వెళ్లాలని వారికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలోటిడిపి, వైసిపి కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పట్టణ సీఐ సాంబశివరావు గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసులు టిడిపి కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారు. తమ నేతపై తప్పుడు కేసులు పెట్టారని.. దీన్ని నిరసిస్తూ శాంతియుతంగా ర్యాలీ చేపడితే అడ్డుకుంటారా? అని టిడిపి కార్యకర్తలు నిలదీస్తున్నారు. సమాచారం అందుకున్న జీవీ ఆంజనేయులు బస్టాండ్ వద్దకు చేరుకున్నారు.










