Oct 25,2023 11:47

జెనీవా :  ఇజ్రాయిల్‌ - పాలస్తీనా  వివాదంతో పశ్చిమాసియాలో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితి మరియు పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రాణ నష్టంపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. శాంతి స్థాపనకు అవసరమైన పరిస్థితులను కల్పించేందుకు,   హింసను ఆపి ప్రత్యక్ష చర్చలను పున: ప్రారంభించేందుకు ఇరుదేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చింది.

పశ్చిమాసియాలో పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యుఎన్‌ఎస్‌సి)లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఐరాసలో భారత ఉప శాశ్వత ప్రతినిధి ఆర్‌.రవీంద్ర  మాట్లాడారు. ప్రాణ నష్టం, క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తోందని అన్నారు.  పెరుగుతున్న మానవతా సంక్షోభం కూడా అంతే భయంకరంగా ఉందని అన్నారు. ఇరుపక్షాల దాడుల్లో పౌర మరణాలు ఆందోళనకరమని అన్నారు. ఇరు పక్షాలు పౌరులకు ముఖ్యంగా మహిళలు మరియు చిన్నారులకు రక్షణ కల్పించాలని అన్నారు. గాజాలో మానవతా సంక్షోభానికి తెరదించాలని విజ్ఞప్తి చేశారు. శాంతికి అవసరమైన పరిస్థితులను కల్పించేందుకు మరియు తీవ్రతరం చేసేందుకు హింసను నివారించడం ద్వారా ప్రత్యక్ష చర్చలను పున: ప్రారంభించడం కోసం కృషి చేయాలని ఇరు పక్షాలను కోరారు.