ఇజ్రాయెల్ : దక్షిణ గాజాలోని పౌరులు తక్షణమే ఆ ప్రాంతం నుంచి తరలిపోవాలని ఇజ్రాయెల్ తాజా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో గాజావాసులకు మళ్లీ వలసబాట తప్పేలా లేదు. హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా ఉత్తర గాజాలో భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు దక్షిణ గాజాపై దృష్టిపెట్టింది. ఈ ప్రాంతంలోని పాలస్తీనీయులు తక్షణమే పశ్చిమ ప్రాంతానికి పారిపోవాలని తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ గాజాపైనా ముమ్మర దాడులకు సిద్ధమైన ఐడిఎఫ్.. పౌరులు తరలిపోవాలని ఆదేశాలిచ్చింది. ఇప్పటికే దక్షిణ గాజాలోని కొన్ని ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది.
ఇజ్రాయెల్ అధికారి హెచ్చరిక
'' ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించాం. ఇది అంత సులభం కాదని మాకు తెలుసు. అయితే, ఎదురుకాల్పుల్లో పౌరులు చిక్కుకోకూడదని మేం భావిస్తున్నాం '' అని ఓ ఇజ్రాయెల్ అధికారి వెల్లడించారు. దక్షిణ గాజా నగరమైన ఖాన్ యూనిస్‌లో 4 లక్షల వరకు జనాభా ఉంటారు. దీనికి తోడు.. ఇటీవల ఉత్తర గాజాలో ఇజ్రాయెల్ విరుచుకుపడటం వల్ల అనేక మంది దక్షిణ ప్రాంతానికి వలస వచ్చారు. ఇప్పుడు వీరందరినీ పశ్చిమ ప్రాంతానికి తరలి వెళ్లాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు చేసింది.