
తిరువనంతపురం : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విప్లవకారుడు చే గువేరా 55వ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు. క్యూబా కమ్యూనిస్టు నాయకుడికి మానవత్వంపై తిరుగులేని ప్రేమ ఉన్నదన్నారు. సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా పోరాడటానికి, సామాజిక న్యాయం, సమానత్వం ఆధారంగా సోషలిజం కొత్త శకాన్ని నిర్మించటానికి చేగువేరా తన జీవితాన్ని త్యాగం చేశారని విజయన్ ట్వీట్ చేశారు. చేగువేరా బలిదానం చేసిన ఈ రోజున ఆయనకు వందనాలు తెలుపుతున్నట్టు రాసుకొచ్చారు. దోపిడి, అణచివేతపై పోరాటానికి చేగువేరా జీవితం సార్వత్రిక చిహ్నం అని సిపిఐ(ఎం) పేర్కొన్నది. ''అక్టోబరు 9, 1967న సిఐఎ మద్దతు గల బొలీవియన్ సాయుధ బలగాలచే సామాన్యులకు చే గువేరా అని పిలువబడే ఎర్నెస్టో గువేరా డి లా సెర్నా దారుణంగా హత్య చేయబడ్డాడు. గెరిల్లా యుద్ధంలో మాస్టర్, సైనిక సిద్ధాంతకర్త, సాటిలేని నాయకుడు, నిర్భయ సైనికుడు, గట్టి మార్క్సిస్టుకు రెడ్ సెల్యూట్'' అని సిపిఐ(ఎం) కేరళ యూనిట్ ట్వీట్ చేసింది. దేశవ్యాప్తంగా పలువురు వామపక్ష నాయకులు సైతం సోషల్ మీడియా వేదికగా చే గువేరాను స్మరించుకున్నారు. ఆయన ఫోటోలు, అతని కోట్‌లతో సహా వివిధ చిత్రాలను, వీడియోలను షేర్ చేశారు.